Share News

సారూ.. వెళ్ల వద్దు..!

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:52 PM

ఆ ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు ఎనలేని అభిమానం.. అతడు పాఠాలు చెబితే వారంతా శ్రద్ధగా వింటారు.

సారూ.. వెళ్ల వద్దు..!
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు వీరేష్‌ను పట్టుకొని ఏడుస్తున్న విద్యార్థులు

ఆ ఉపాధ్యాయుడు అంటే విద్యార్థులకు ఎనలేని అభిమానం.. అతడు పాఠాలు చెబితే వారంతా శ్రద్ధగా వింటారు. విద్యార్థులకు అభివృద్ధే లక్ష్యంగా పనిచేశారు. వారి ఎదుగుదలకు అహర్నిశలు శ్రమించారు. విద్యార్థులను సొంత బిడ్డలా చూసుకున్నారు. ఆ ఉపాధ్యాయుడికి బదిలీ అయింది. కానీ ఈ విషయం చాలా గోప్యంగా ఉంచారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వేరే చోటుకు వెళ్లాల్సింది. విషయం విద్యార్థులకు తెలిసిందే. అంతే ఇక ఒకటే ఏడుపులు.. ‘సారూ.. మమ్మల్ని వదిలిపోవద్దు సారూ.. నీకోసం ప్రాణాలైనా ఇస్తాం.. నువ్వు ఇక్కడే ఉండాలి సారూ..’ ఆయనను చుట్టుముట్టి కన్నీటి పర్యంతమ య్యారు. పెద్దకడబూరు మండలంలోని ముచ్చుగిరి గ్రామంలోని మండల పరిషత ప్రాథమిక పాఠశాలలో బెస్త వీరేష్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. సాధారణ బదిలీల్లో భాగంగా గంగులపాడు బదిలీ అయ్యారు. సోమవారం ఆయన రిలీవ్‌ కావాల్సి ఉండటంతో విషయం విద్యార్థులకు తెలిసింది. వారు కన్నీటి పర్యంతమయ్యారు. విద్యార్థులు చూపిన ప్రేమానురాగాలకు ఉపాధ్యాయుడి కళ్లు సైతం చెమగిల్లాయి నేను ఎక్కడికి వెళ్లనని రోజు మన పాఠశాలకే వస్తానని చిన్నారి విద్యార్థులకు నచ్చజెప్పి కాసేపు వారిని ఓదార్చి రోజు మాదిరిగా పిల్లలతో గడిపి బరువెక్కిన మనసుతో వెళ్లిపోయారు. పాఠశాలలో చదువుతున్న నాలుగో తరగతి విద్యార్థి హరికృష్ణ అయితే ‘సారూ.. నీ కోసం ప్రాణాలు అయినా ఇస్తానంటూ లేఖ రాశాడు. ఆఉపాధ్యాయుడు పిల్లలపై చూపిన ప్రేమానురాగాలు చూసి ప్రతిఒక్కరూ అభినందిస్తున్నారు.

ఫ పెద్దకడబూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 13 , 2025 | 11:52 PM