Single Major Degree: డిగ్రీలో సింగిల్ మేజరే
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:11 AM
డిగ్రీ కోర్సులపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ప్రవేశ పెట్టిన సింగిల్ మేజర్ డిగ్రీనే కొనసాగిస్తూ కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఉన్నత విద్యాశాఖ కొత్త క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించింది.
126 క్రెడిట్లతో కొత్త ఫ్రేమ్‌వర్క్
దాదాపు గతం మాదిరే కొత్త పాలసీ.. వ్యతిరేకత
అమరావతి, జూలై 15(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కోర్సులపై ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. వైసీపీ హయాంలో ప్రవేశ పెట్టిన సింగిల్ మేజర్ డిగ్రీనే కొనసాగిస్తూ కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఉన్నత విద్యాశాఖ కొత్త క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ రూపొందించింది. ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీలో 136 క్రెడిట్లు ఉండగా, కొత్త సింగిల్ మేజర్‌లో 126 ఉంటాయి. మేజర్ కోర్ సబ్జెక్టుకు 44, మేజర్ ఎలక్టివ్ సబ్జెక్టుకు 16 కలిపి మొత్తం 60 క్రెడిట్లతో మేజర్ సబ్జెక్టు ఉంటుంది. 24 క్రెడిట్లతో మైనర్ సబ్జెక్టు ఉంటుంది. మల్టీ డిసిప్లినరీ కోర్సులకు 6, ఎబిలిటీ ఎన్‌హాన్స్‌మెంట్ కోర్సుల(భాషా)కు 18, స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్ కోర్సులకు 12, వాల్యూ యాడెడ్ కోర్సులకు 2, ఇంటర్న్‌షి్‌పకు 4 క్రెడిట్లు కేటాయించింది. మూడేళ్ల డిగ్రీ మొత్తం 126 క్రెడిట్లతో పూర్తమవుతుంది. అయితే, ప్రస్తుత విధానంలో నాలుగో ఏడాది డిగ్రీ చదివితే 160 క్రెడిట్లు వస్తాయి. కాగా.. మేజర్, మైనర్ సబ్జెక్టు, మల్టీ డిసిప్లినరీ, స్కిల్ ఎన్‌హాన్స్‌మెంట్, వాల్యూ యాడెడ్ క్రెడిట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.ప్రస్తుతం ఇంటర్న్‌షి్‌పకు 20 క్రెడిట్లు ఉంటే వాటిని 4కు తగ్గించింది. 4 క్రెడిట్లతో ఇంటర్న్‌షిప్ అంటే విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భాషా సబ్జెక్టులకు పెంపు
భాషా సబ్జెక్టులకు ప్రస్తుతం 12 క్రెడిట్లు ఉంటే వాటిని 18కి పెంచారు. సింగిల్ మేజర్ డిగ్రీ విధానంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో ఏకపక్షంగా సింగిల్ మేజర్ ప్రవేశ పెట్టింది. దీనివల్ల పలు కాలేజీల్లో అనేక కోర్సులు మాయమయ్యాయి. దీంతో డ్యూయెల్ మేజర్ తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. దీనిలో భాగంగా 150 క్రెడిట్లతో రెండు మేజర్ సబ్జెక్టులు ఉండేలా కొత్త ఫ్రేమ్‌వర్క్ రూపొందించి విద్యామండలి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కానీ ఉన్నతాధికారులు సింగిల్ మేజర్ కొనసాగించేలా మార్పులు చేశారు. విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు సింగిల్ మేజర్‌ను వ్యతిరేకిస్తున్నారు.