AP Govt: గుంతలు పూడ్చడానికి సింగిల్ బిడ్ అయినా ఓకే..!
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:24 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుంతలు లేని రహదారులను పూర్తి చేసేందుకు రహదారులు-భవనాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
మార్చి నాటికి పనుల పూర్తే లక్ష్యం.. పాట్ హోల్ రిపేర్లకు మాత్రమే వర్తింపు
అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలో గుంతలు లేని రహదారులను పూర్తి చేసేందుకు రహదారులు-భవనాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. టెండర్ల నిబంధనలను సడలించాలని ప్రతిపాదనలను పంపించింది. మార్చి నాటికి రాష్ట్రంలోని రహదారులపై గుంతలన్నింటినీ పూడ్చాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇందుకు సంబంధించిన టెండర్లు త్వరితగతిన పూర్తిచేసి పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలి. అయితే, కాంట్రాక్టర్లు క్షేత్రస్థాయిలో సమస్యలెదుర్కొంటున్నారు. ఇందులో ఒకటి సకాలంలో బిల్లుల చెల్లింపు, రెండోది స్థానిక ఒత్తిళ్లు. ఆర్‌అండ్‌బీలో ప్రస్తుత నిబంధనల ప్రకారం... ఏ పనికైనా కనీసం రెండు లేదా మూడు బిడ్లు రావాలి. అలా వచ్చిన వాటిల్లో ఎల్1గా ఉన్నవారికే టెండర్ ఇస్తారు. అయితే, జగన్ ప్రభుత్వంలో రహదారి పనులు పెద్దగా జరగలేదు. ఏవో కొన్ని చేపట్టినా వాటికీ బిల్లులు ఇవ్వలేదు. దీంతో కొత్తగా ఆర్‌అండ్‌బీ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో వారిలో మనోధైర్యం కల్పించేందుకు ప్రతీ నెలా బిల్లులు చెల్లించేలా విధాన నిర్ణయం తీసుకోవాలని ఆర్‌అండ్‌బీ ప్రత్యేక సీఎస్ ఎం.టి.కృష్ణబాబు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆర్థిక శాఖ దీన్ని పరిశీలిస్తోంది. సీఎం దీని అమలుకు సానుకూలంగా ఉన్నారు. ఇక నిర్ణయం తీసుకోవడమే మిగిలింది. అలాగే కాంట్రాక్టర్లకు మరింత భరోసా ఇచ్చేందుకు గుంతలు పూడ్చే (పాట్ హోల్ రిపేర్) వర్క్‌లకు ఒక కాంట్రాక్టర్ బిడ్ దాఖలు చేసినా ఆమోదించాలని ఆర్‌అండ్‌బీ ప్రతిపాదించింది. సీఎం ఆదేశాల మేరకు మార్చి నాటికి గుంతలు పూడ్చే పనులు పూర్తిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కృష్ణబాబు ‘ఆంధ్రజ్యోతి’కి చె ప్పారు. ఈ విధానాన్ని కేవలం గుంతలు పూడ్చే పనులకే వర్తింపచేస్తామని స్పష్టం చేశారు.