Share News

Sangeetha Varalakshmi: మొక్కు తీరింది.. కోరిక నెరవేరింది

ABN , Publish Date - Aug 09 , 2025 | 05:34 AM

గాన సరస్వతి వరలక్ష్మీ నారాయణమ్‌ ఆకాంక్ష నెరవేరింది. సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె ఫొటో దిగారు. సీఎంవో నుంచి వరలక్ష్మికి గురువారం సాయంత్రం పిలుపు రావడంతో ఆమె ఆయనను కలుసుకున్నారు.

Sangeetha Varalakshmi: మొక్కు తీరింది.. కోరిక నెరవేరింది

  • సీఎంతో ‘సంగీత వరలక్ష్మి’కి ఫొటో

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందించిన సీఎంఓ

  • ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపిన వరలక్ష్మి

మంగళగిరి,ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): గాన సరస్వతి వరలక్ష్మీ నారాయణమ్‌ ఆకాంక్ష నెరవేరింది. సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె ఫొటో దిగారు. సీఎంవో నుంచి వరలక్ష్మికి గురువారం సాయంత్రం పిలుపు రావడంతో ఆమె ఆయనను కలుసుకున్నారు. తన మొక్కులు ఫలించాయని,సీఎం చంద్రబాబును కలవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి విజయం సాధిస్తే రాష్ట్రంలోని 108 ఆలయాల్లో సంగీత కచేరీలు చేస్తానంటూ ఎన్నికలకు ముందు వరలక్ష్మి మొక్కుకున్నారు. మంగళగిరికి చెందిన వరలక్ష్మి ముంబాయిలో స్థిరపడినప్పటికీ చంద్రబాబుపై ఉన్న అభిమానంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన దరిమిలా.. ఆమె తన మొక్కు తీర్చుకోవడంలో భాగంగా అన్నవరం సత్యదేవుని సమక్షంలో తొలి కచేరీ నిర్వహించారు. చివరి కచేరీని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ సన్నిధిలో గురువారం రాత్రి ముగించారు.వరలక్ష్మి మొక్కు ఉదంతాన్ని ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం ప్రచురించగా,సీఎంఓ వెంటనే స్పందించింది.సీఎంను కలుసుకునేందుకు ఉండవల్లి నివాసానికి రావాలని ఇంద్రకీలాద్రిపై కచేరీ చేస్తున్న వరలక్ష్మికి కబురందించింది. దీనిపై ఆమె సంతోషం తో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కచేరీ ముగించిన అనంత రం అమ్మవారిని దర్శించుకుని సోదరుడు,స్థానిక న్యాయవాది శ్రీభాష్యం రంగనాథ్‌తో కలిసి చంద్రబాబు నివాసానికి చేరుకుని ఆయనను కలిశారు.వరలక్ష్మి కుటుంబ వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.


అలాగే కచేరీల మొక్కు గురించి కూ డా విచారించి ఏయే దేవస్థానాల్లో కచేరీలు చేశారో తెలుసుకున్నారు. తన ఐదో ఏట నుంచే సంగీత సాధన చేస్తూ 60 ఏళ్లుగా దేశ విదేశాల్లో ఇప్పటికి 5 వేలకు పైగా గాన కచేరీలు నిర్వహించినట్టు వరలక్ష్మి సీఎంకు వివరించారు. ‘మీ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆశిస్తూ ఇప్పటి వరకు కచేరీ లు చేశాన’ని చెప్పారు.ఇకమీదట లోకేశ్‌ క్షేమాన్ని కోరుతూ కచేరీలు చేయగలనని వరలక్ష్మి అనడంతో చంద్రబాబు సంతోషంతో మురిసిపోయారు. ఈ సందర్భంగా తన 108 కచేరీలకు సంబంధించి రాసుకున్న డైరీని సీఎం చంద్రబాబుకు చూపగా, ఆయన చివరిదైన ఇంద్రకీలాద్రి కచేరీ వివరాల వద్ద అభినందనలు తెలుపుతూ సంతకం చేశారు.

బార్‌ అసోసియేషన్‌లో..

మరోవైపు,‘ఆంధ్రజ్యోతి’కథనాన్ని చూసి..విజయవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఖుద్దూస్‌ బాషా కూడా..బార్‌ అసోసియేషన్‌లో శుక్రవారం కచేరీ నిర్వహించాలని వరలక్ష్మిని అభ్యర్థించారు.దీంతో ఆమె న్యాయవాదుల సమక్షంలో కచేరీ నిర్వహించి ప్రశంసలందుకున్నారు. తాను సీఎంను కలవడానికి కారణమైన ‘ఆంధ్రజ్యోతి’కి ఎంతో రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Aug 09 , 2025 | 05:34 AM