Simhachalam: నోటి మాటతో గోడ కట్టేశారు
ABN , Publish Date - May 03 , 2025 | 05:18 AM
సింహాచలం గోడ కూలిన ఘటనపై విచారణ కమిటీ అనుమతులు లేకుండానే నిర్మాణం జరిపినట్టు వెల్లడించింది. 10 మందిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేస్తూ, కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టనున్నారు.
అధికారులు చెప్పడంతో హడావుడిగా నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్
నాణ్యత చూడలేదు, నీటితో తడపలేదు
‘సింహాచలం’ దుర్ఘటనపై విచారణ కమిటీ చైర్మన్ సురేశ్‌కుమార్ వెల్లడి
నేడు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక
ఇన్‌చార్జి ఈవోపై వేటు.. బ్లాక్‌లిస్టులో కాంట్రాక్టర్?
విశాఖపట్నం, మే 2(ఆంధ్రజ్యోతి): సింహగిరిపై రక్షణ గోడను కేవలం నోటి మాటతోనే నిర్మించారని, ఎలాంటి అనుమతులు లేవని విచారణ కమిటీ చైర్మన్ సురేశ్ కుమార్ తెలిపారు. రెండు రోజులపాటు విచారించి పలువురి నుంచి వివరాలు సేకరించామన్నారు. విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి(అప్పన్న) చందనోత్సవం రోజు గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన ఘటనపై ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మీడియాతో మాట్లాడారు. గురువారం సింహాచలంలో, శుక్రవారం సర్క్యూట్‌హౌ్‌సలో దేవస్థానం ఇన్‌చార్జి ఈవో, ఆగమ పండితులు, ఇంజనీరింగ్ సిబ్బంది, ఏపీటీడీసీ ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నామన్నారు. ఆలయ అఽధికారులు నోటిమాటగా చెప్పడంతో కాంట్రాక్టర్ హడావుడిగా పనులు చేపట్టారని, గోడ డిజైన్, మెటీరియల్ విషయంలోనూ అధికారులు బాధ్యత తీసుకోలేదని తెలిపారు. కూలిన గోడ నుంచి నమూనాలు తీసుకుని పరీక్షలకు పంపినట్టు చెప్పారు. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేయాలనుకుంటే అనుమతులు తీసుకోవాలని, కానీ.. అలా చేయలేదన్నారు. శనివారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేస్తామని తెలిపారు. మరో నెలరోజుల తర్వాత పూర్తిస్థాయి నివేదిక ఇస్తామని, ఘటన జరిగిన రోజున్న భక్తుల నుంచి వివరాలు తెలుసుకుంటామని చెప్పారు. గత ఏడాది ఆగస్ట్టు నాటికి ‘ప్రసాద్’ పథకం కింద పనులు పూర్తికావలసి ఉందని, అయితే ఆరు నెలలకు మించి జాప్యం జరిగిందని తెలిపారు. దీనికి అధికారులు స్పష్టమైన కారణాలు చెప్పడం లేదన్నారు. ‘ప్రసాద్’ పనుల పర్యవేక్షణకు 2 నెలల కిందటే ఓ కమిటీ సింహాచలం వచ్చిందని, వారిని కూడా కలిసి వివరాలు తెలుసుకుంటామని సురేశ్ వివరించారు.
విచారణ సాగిందిలా!
సింహాచలంలో గోడ కూలిన ఘటనపై విచారణ చేపట్టిన మునిసిపల్ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం సర్క్యూట్ హౌస్‌లో పలువురిని ప్రశ్నించింది. దేవస్థానం ఇన్‌చార్జి ఈవో కె. సుబ్బారావు, సిబ్బంది, స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు, ఇంజనీరింగ్ విభాగం, పర్యాటకాభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ విభాగాల అధికారుల నుంచి వివరాలు సేకరించింది. ప్రక్రియ మొత్తాన్నీ వీడియో రికార్డింగ్ చేశారు. ప్రధాన అర్చకులు, స్థానాచార్యులను విచారించే సమయంలో కొండపై పనులు వైదిక నిబంధనలు, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా జరిగాయా? అన్నది తెలుసుకున్నారు. ఇన్‌చార్జి ఈవో సుబ్బారావు, ఇతర సిబ్బందిని వేర్వేరుగా పిలిచి విచారించారు. ఇంజనీరింగ్ విభాగం నుంచి ఈఈ, డీఈఈలు, కిందిస్థాయి సిబ్బంది నుంచి సివిల్ పనుల వివరాలు తెలుసుకున్నారు. గోడ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా?, డిజైన్స్‌కు ఆమోదం ఉందా?, నిర్మాణంలో నాణ్యత పరిశీలించారా? తదితర వివరాలు అడిగి నమోదు చేశారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు.. ఘటన జరిగినప్పుడు తాము వెళ్లిన సమయానికి అక్కడున్న పరిస్థితిని కమిటీకి వివరించారు. ఇదిలావుంటే, శుక్రవారం ఉదయం విచారణకు రావాల్సిన ఏపీటీడీసీ ఈఈ.. కమిటీ ముందుకు రాకుండా అరకులోయ పర్యటనకు బయలుదేరారు. ఆ విషయం తెలిసిన జిల్లా అధికారులు ఆయనను వెనక్కి పిలిచారు. అయితే ఈ విషయాన్ని విచారణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. విచారణకు రాకుండా తప్పించుకోవాలని ఎందుకు భావించారని కమిటీ సభ్యులు నిలదీసినట్టు తెలిసింది.
10 మందిపై చర్యలు!
సింహాచలంలో గోడ కూలిన ఘటనకు సంబంధించి పలువురిపై చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీ సిఫారసు చేయనున్నట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. దేవస్థానం ఇన్‌చార్జి ఈవో, ఈఈ, ఇంజనీరింగ్ అధికారులు, ఏపీటీడీసీ ఈఈ, మరికొందరు అధికారులు మొత్తం 8 నుంచి 10 మందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గోడ నిర్మించిన కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టనున్నారు. నిర్మాణం తరువాత కనీసం 15 రోజులు క్యూరిం గ్ చేయాలి. అలా చేయలేదని తేలింది. అదేవిధంగా గోడ నిర్మాణానికి పునాదులు వేసేటప్పు డు మధ్యమధ్యలో ఐరన్ వాడాలి. అదీ చేయలేదని కమిటీ గుర్తించింది. వీటన్నింటికీ కాంట్రాక్టరే పూర్తి బాధ్యత వహించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..