Municipal Department Corruption: మౌనమేల నారాయణా
ABN , Publish Date - Sep 25 , 2025 | 04:18 AM
జగన్ జమానాలో అవినీతి రాజ్యమేలింది! పలు స్కామ్‌లపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. కానీ... మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ తీరే వేరు. ఎందుకో ఏమోగానీ... వైసీపీ హయాంలో....
అక్రమార్కులకు మంత్రి అండదండలు
వైసీపీ హయాంలో మునిసిపల్ శాఖలో భారీ అవినీతి
ఐఏఎస్ శ్రీలక్ష్మి, కొందరు వైసీపీ నేతలే బాధ్యులు
వందల కోట్ల విలువైన టీడీఆర్ బాండ్ల స్కామ్
‘అది చిన్న ఇష్యూ’ అని తుస్సుమనిపించిన మంత్రి
అంతర్గత విచారణకూ ఆయన బ్రేకులు
‘అమృత్’, బ్యూటిఫికేషన్ పనులపైనా అదే తీరు
అక్రమాలపై కూటమి ఎమ్మెల్యేల ఆరోపణలు
ఆధారాలు చూపిస్తున్నా స్పందించని నారాయణ
సభా సంఘం వేసేందుకూ ససేమిరా
నాటి అక్రమార్కులపై ఆయనకు ఎందుకంత ప్రేమ?
గత ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అమృత్ 2.0 పథకం, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ పనులను చాలా చోట్ల చేయకుండానే పెద్దఎత్తున నిధులు దోచుకున్నారనే ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి కూటమి సర్కారు స్పందిస్తుందని... నాటి మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మితోపాటు బాధ్యులైన వైసీపీ నేతలపై చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. కానీ... స్వయానా మంత్రి నారాయణే వారికి అండగా నిలుస్తున్నారు!
ఒకవైపు... విపక్షంలో ఉండగానే జగన్ రెచ్చిపోతున్నారు. ‘‘ఈసారి అధికారంలోకి వస్తే కూటమి నేతలు, అధికారులను వదిలిపెట్టేది లేదు. సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొస్తాం. సినిమా చూపిస్తాం’’ అని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు... జగన్ హయాంలో మునిసిపల్ శాఖ పరిధిలో జరిగిన అక్రమాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. స్వయానా కూటమి ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఆ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తీరుపై కూటమి నేతలే విస్తుపోతున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ జమానాలో అవినీతి రాజ్యమేలింది! పలు స్కామ్‌లపై కూటమి ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోంది. కానీ... మునిసిపల్ శాఖా మంత్రి నారాయణ తీరే వేరు. ఎందుకో ఏమోగానీ... వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై ఆయన విపరీతమైన ప్రేమ కనబరుస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీఆర్ కుంభకోణాన్ని ఆయనే ‘తుస్సు’మనిపించగా... ‘అమృత్’, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ పథకాల్లోని అక్రమాలపైనా అదే వైఖరి ప్రదర్శిస్తుండటం గమనార్హం. ఈ రెండింటిలోనూ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మిపైనే తీవ్ర ఆరోపణలున్నాయి. ఆమెతోపాటు దీనికి బాధ్యులైన వైసీపీ నేతలు, అధికారులను నారాయణ కాపాడుతున్నారనే అభిప్రాయం నెలకొంది.
టీడీఆర్ స్కామ్‌లో ఇలా...
గత ప్రభుత్వ హయాంలో మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వై.శ్రీలక్ష్మిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. టీడీఆర్ బాండ్లలో అవినీతి భారీగా జరిగిందని అప్పట్లోనే కలకలం రేగింది. తిరుపతి, తణుకులాంటి మున్సిపాలిటీల్లో సైతం వైసీపీ నేతల జోక్యంతో టీడీఆర్ బాండ్ల విడుదలలో వందల కోట్లు స్కామ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా టీడీఆర్ బాండ్లలో అవకతవకలకు పాల్పడటం ద్వారా వైసీపీ నేతలు వందల కోట్లు దోచుకున్నారన్న విమర్శలొచ్చాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానా భారీగా నష్టం చేకూరింది. దీనికి సంబంధించిన ఆధారాలూ ఉన్నాయి. కానీ... మంత్రి నారాయణ మాత్రం ‘ఇదేదో చిన్న విషయం’ అన్నట్లుగా మాట్లాడారు. అంతర్గతంగా జరుగుతున్న విచారణకూ బ్రేకులు వేశారు. మరోరకంగా చెప్పాలంటే... ఐఏఎస్ శ్రీలక్ష్మికి మంత్రి నారాయణ క్లీన్‌చిట్ ఇచ్చేశారు. ఆ తర్వాత... వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా శ్రీలక్ష్మిపై పరోక్షంగా తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు.
గ్రీన్ బ్యూటిఫికేషన్ పనుల్లోనూ...
గత ప్రభుత్వంలో అమృత్ 2.0 పథకం, గ్రీన్ బ్యూటిఫికేషన్ పనుల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. బుధవారం అసెంబ్లీలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆమదాలవలస మునిసిపాలిటీలో అమృత్ 2.0, ట్రంచ్-1 కింద చెరువుల పునరుద్ధరణలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరారు. మంత్రి, అధికారులు ఆమదాలవలస వచ్చి, కనీసం రూపాయి పనైనా జరిగిందేమో చూసి చెప్పాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవినీతిపై సభా కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అయితే, మంత్రి నారాయణ మాత్రం ససేమిరా అన్నారు. అవినీతి జరగలేదనేలా వైసీపీ సర్కారుకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. వైసీపీ హయాంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పేవ్‌మెంట్లు, డివైడర్లు, గ్రీనరీ కోసం భారీగా నిధులు ఖర్చు చేశారు. కొన్నిచోట్ల ఒక్క మొక్క కూడా నాటకుండానే నిధులు డ్రా చేశారు. ఈ విషయంపై తాజాగా పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఆరోపణలు చేశారు. అయినా మంత్రి సభాసంఘానికి అంగీకరించలేదు. ఆయా అంశాలపై సభాసంఘం వేయడం అసాధారణమేమీ కాదు. సంఘం సభ్యులు క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించి, ప్రభుత్వానికి సిఫారసులు చేస్తారు. మంత్రి నారాయణ అందుకూ ససేమిరా అనడం గమనార్హం.
అంబేడ్కర్ సాక్షిగా...
వైసీపీ ప్రభుత్వంలో విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. అక్కడ మునిసిపల్ శాఖ ఆధ్వర్యంలో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ పనులు చేపట్టారు. ఈ వ్యవహారంలో తానే సర్వం అన్నట్టుగా శ్రీలక్ష్మి వ్యవహరించారు. మొక్కల కొనుగోళ్లు సహా ఈ పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణలు, చర్యలు ఉంటాయని అందరూ భావించారు. అయితే మంత్రి నారాయణ ఇవేవీ లేకుండా తుస్సుమనిపించారు.
ఎన్ని విమర్శలు వచ్చినా...
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీలక్ష్మి నుంచి బొకే అందుకునేందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇష్టపడలేదు. అలాంటి అధికారిణిని మళ్లీ కొనసాగించేందుకు మంత్రి నారాయణ సమ్మతించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. నారాయణ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే శ్రీలక్ష్మి వెళ్లి అభినందించి వచ్చారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖలో జరిగిన ఏ అవినీతికి సంబంధించి అయినా.. పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఆరోపించినా, పత్రికల్లో కథనాలు వచ్చినా, ఆ శాఖ నుంచి స్పందన లేదు. గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ సీఈఓ అవినీతిపై పత్రికల్లో ఎన్ని కథనాలు వచ్చినా చాలా కాలం పాటు ఆయన్ను తొలగించకుండా కొనసాగించారు. అదేవిధంగా మున్సిపల్ శాఖకు సంబంధించి పలు విభాగాధిపతులపై ఎన్ని ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకోలేదు.
నాటి వేధింపులు మరిచిపోయారా?
వైసీపీ హయాంలో మంత్రి నారాయణను టార్గెట్ చేసి వేధించిన సంగతి తెలిసిందే. రాజధాని ప్రాంతంలో నారాయణ కుటుంబీకులు భూములు కొనుగోలు చేశారంటూ ఆరోపణలు చేసి, గత టీడీపీ సర్కారును బద్నాం చేసేందుకు వైసీపీ సర్కార్ చేయని ప్రయత్నమంటూ లేదు. నారాయణను అరెస్టు చేసేందుకు కూడా గత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇందులో శ్రీలక్ష్మి పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. ఇంత జరిగినా... ఇప్పుడు ఆమెకు నారాయణ అండగా నిలవడం, గత ప్రభుత్వ అక్రమాలపై చర్యలు తీసుకోకుండా వదిలేయడం గమనార్హం!