Share News

Minister Gottipati: విద్యుత్‌ ఉత్పత్తిలో భారీ వృద్ధి

ABN , Publish Date - Sep 03 , 2025 | 06:08 AM

విద్యుత్‌ ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది. ఏపీ జెన్కో-ఏపీపీడీసీఎల్‌ సంయుక్తంగా 2025 ఆగస్టు నాటికి 16 వేల మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి చేశాయి.

Minister Gottipati: విద్యుత్‌ ఉత్పత్తిలో భారీ వృద్ధి

  • గతేడాది కన్నా 20.3 శాతం అధికం

  • రాష్ట్రంపై తగ్గిన విద్యుత్తు కొనుగోళ్ల భారం

  • శ్రీశైలంలో రికార్డు స్థాయి ఉత్పత్తి

  • జెన్కో, ఎలక్ట్రికల్‌ సేఫ్టీ అధికారులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష

అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది. ఏపీ జెన్కో-ఏపీపీడీసీఎల్‌ సంయుక్తంగా 2025 ఆగస్టు నాటికి 16 వేల మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి చేశాయి. ఈ విషయాన్ని అధికారులు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు తెలిపారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 20.3 శాతం అధికమని పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలో ఏపీ జెన్కో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు వినియోగానికి తగినట్లుగా విద్యుదుత్పత్తి చేస్తున్నామని, గతంతో పోలిస్తే రోజువారీ విద్యుత్తు కొనుగోళ్లు తగ్గాయని అధికారులు మంత్రికి వివరించారు. జల, సోలార్‌ విద్యుదుత్పత్తిలో కూడా గత ఏడాది కన్నా వృద్ధి సాధించినట్లు చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌- ఆగస్టు మధ్య 2,270 మిలియన్‌ యూనిట్లు విద్యుదుత్పత్తి చేయగా, గత ఏడాది ఇదే కాలానికి 1,652 మిలియన్‌ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయన్నారు. రికార్డు స్థాయి విద్యుదుత్పత్తి చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. గత రెండు దశాబ్దాల్లో తొలిసారి శ్రీశైలం హైడల్‌ పవర్‌ స్టేషన్‌ వెయ్యి మిలియన్‌ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరడంపై అధికారులను అభినందించారు. ఎన్టీటీపీఎస్‌ స్టేజ్‌-5 (800 మెగావాట్లు), ఆర్టీపీఎస్‌ స్టేజ్‌- 4 (600 మెగావాట్లు) విస్తరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు. వీటిని ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమలపాడు, యాగంటి, రాజుపాలెం, అరవేటిపల్లి, గడికోట, దీనేపల్లిల్లో రానున్న సుమారు 6 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల పనులు, పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టు, దిగువ సీలేరు రెండు యూనిట్లు, ఎగువ సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీక్షలో ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్‌ చక్రధర్‌ బాబు, జెన్కో డైరెక్టర్లు ఎం.సుజయ్‌ కుమార్‌, పి.అశోక్‌ రెడ్డి, వి.ఉష, ఏపీపీడీసీఎల్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.


విద్యుత్తు ప్రమాదాలను నివారించండి

విద్యుత్తు ప్రమాదాల శాశ్వత నివారణే లక్ష్యంగా ఎలక్ట్రికల్‌ సేఫ్టీ అధికారులు పనిచేయాలని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. విద్యుత్తు ప్రమాదాలపై ఆయన ఆ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మానవ తప్పిదాలు, నిర్వహణ లోపాల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రమాదాల నివారణకు పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, సోషల్‌ మీడియా, మీడియా వేదికలను ఉపయోగించుకోవాలని, విద్యుత్తు శాఖ టోల్‌ ఫ్రీ నంబరు 1912కు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రమాదాల నివారణకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. ప్రతి త్రైమాసికానికి ఒకసారి ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత డిస్కంలకు సమగ్ర నివేదిక పంపాలని ఎలక్ట్రికల్‌ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఎలక్ట్రికల్‌ సేఫ్టీ జి.విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2025 | 06:09 AM