Share News

Endowments Department: దేవదాయ ఏసీ శాంతికి షోకాజ్‌

ABN , Publish Date - Aug 23 , 2025 | 04:40 AM

దేవదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిణిగా పేరొందిన అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.

Endowments Department: దేవదాయ ఏసీ శాంతికి షోకాజ్‌

  • కంపల్సరీ రిటైర్‌మెంట్‌కు ఏర్పాట్లు

  • సర్వీసు అంతా అక్రమాలు, వివాదాలు

  • కంపల్సరీ రిటైర్‌మెంట్‌కు ఏర్పాట్లు.. సర్వీసు అంతా అక్రమాలు, వివాదాలు

  • తప్పులన్నీ రుజువయ్యాయన్న కమిషనర్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దేవదాయ శాఖలో అత్యంత వివాదాస్పద అధికారిణిగా పేరొందిన అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతిపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆమెపై అనేక ఆరోపణలు రావడంతో గత ఏడాది జూలైలో ప్రభుత్వం సస్పెండ్‌ చేసి, విచారణకు ఆదేశించింది. ఆమె గతంలో పనిచేసిన విశాఖపట్నం, అనకాపల్లి, ఎన్‌టీఆర్‌ జిల్లాల్లో శాంతిపై వచ్చిన ఫిర్యాదులపై దేవదాయ శాఖ కమిషనర్‌ నివేదికలు తెప్పించుకున్నారు. ఆమె ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించారని, కింది స్థాయి అధికారుల సిఫారసులు లేకుండానే ఆలయాల భూములను ఇష్టానుసారం లీజుకు ఇచ్చారని తమ నివేదికల్లో విచారణాధికారులు పేర్కొన్నారు. సర్వీస్‌ రికార్డుల్లో శాంతి భర్తగా మదన్‌ మోహన్‌ పేరు ఉంది. అయితే 2020లో తాను సుభాశ్‌ అనే న్యాయవాదిని పెళ్లి చేసుకున్నానని ఆమె విజయవాడలో విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. అయితే, ఆమె విశాఖపట్నం అపోలో ఆస్పత్రిలో ప్రసవం కాగా, మెటర్నటీ లీవుకు పెట్టిన దరఖాస్తులో భర్తగా మదన్‌మోహన్‌ పేరే పేర్కొన్నారు. దీనిపై ఆయన ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చిందని, దానికి కారకులు ఎవరో తేల్చాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై అప్పట్లో ఆయన ఆరోపణలు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం ఆమెను గత ఏడాది జూలై రెండో తేదీన సస్పెండ్‌ చేసింది. విచారణకు ఆదేశించింది. శాంతిపై వచ్చిన చాలా ఆరోపణలు నిజమని రుజువు కావడంతో ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనల ప్రకారం ‘కంపల్సరీ రిటైర్‌మెంట్‌’ ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలంటూ దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ వారం రోజుల క్రితం ఆమెకు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. దానికి 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.


ఆది నుంచి అంతే!!

ఐదేళ్ల క్రితం, అంటే 2020 కొవిడ్‌ సమయంలో ఆమె విశాఖపట్నంలో దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌గా తొలి పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. అప్పుడు విశాఖకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇన్‌చార్జి. ఆయన విశాఖలోని దేవదాయ శాఖ పరిధిలోని ప్రేమసమాజం భూములపై దృష్టిపెట్టారు. ఆ విషయంలో ఆయనకు శాంతి పూర్తిగా సహకరించారు. చెప్పినట్టు చేయడంతో ఆమెను సాయిరెడ్డి ప్రోత్సహించారు. ఆ తర్వాత అదనంగా మరో రెండు ఆలయాలకు ఇన్‌చార్జి ఈవోగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. తనపై అధికారి అయిన డిప్యూటీ కమిషనర్‌ ముఖంపై ఆమె ఇసుక చల్లడం అప్పట్లో రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఆమెను విశాఖ నుంచి బదిలీ చేయాలని ఆ శాఖ ఉద్యోగులు రెండు రోజులు ధర్నా చేస్తే వైసీపీ పెద్దలు వారిని బెదిరించారు.

ఇదే సమయంలో కొత్తగా ఏర్పాటుచేసిన అనకాపల్లి జిల్లా దేవదాయ బాధ్యతలు కూడా ఆమే తీసుకున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో దేవాలయాల భూములను వేలం లేకుండా ఏకపక్షంగా ప్రైవేటు వ్యక్తులకు శాంతి లీజుకు ఇచ్చేశారు.


  • లంకెలపాలెంలో పరదేశమ్మ ఆలయానికి సర్వే నంబరు 189లో 10.13 ఎకరాలు ఉంది. అందులో కొంత స్థలాన్ని పలువురు ఆక్రమించారు. ఎకరా స్థలంలో ఐస్‌క్రీమ్‌ ఫ్యాక్టరీ పెట్టుకున్నవారిని లీజు తక్కువ ఇస్తున్నారని, జరిమానా వేసి శాంతి భయపెట్టారు. ఆ తరువాత ఆక్రమార్కులతో అడ్డగోలు ఒప్పందం చేసుకొని 11 ఏళ్ల లీజుకు ఇచ్చేశారు.

  • చోడవరంలో స్వయంభూ విఘ్నేశ్వర ఆలయానికి మెయిన్‌రోడ్డులోనే షాపులు ఉన్నాయి. వారిని కూడా ముందు అద్దెలు పెంచాలని, ఖాళీ చేసేయాలని శాంతి బెదరగొట్టారు. వారు కాళ్లవేళ్లాపడి ఒప్పందం చేసుకోవడంతో వారికి కూడా 11 ఏళ్ల లీజుకు షాపులను ఇచ్చేశారు.

  • అనకాపల్లిలో సిద్ధి వినాయక ఆలయానికి సంబంధించిన షాపుల్లో కొందరు అద్దెకు ఉన్నారు. వారు అద్దెలు కట్టకపోవడంతో వాటిని వేలానికి పెట్టారు. శాంతి వేలం లేకుండా 11 ఏళ్ల లీజుకు ఇచ్చేశారు. వీటన్నింటిపైనా విచారణ జరిగింది.


రంగంలోకి దిగని ఏసీబీ...

సర్వీసులో చేరిన ఐదేళ్లలోనే రూ.కోట్ల విలువైన ఆస్తులు సంపాదించారనే ఆరోపణలు శాంతిపై ఉన్నాయి. విధుల్లో చేరిన రెండోఏడాదే విశాఖలోని విశాలాక్షినగర్‌లో రూ.80లక్షల విలువైన ఫ్లాట్‌ కొనుగోలుచేశారు. దాదాపు వంద తులాల బంగారు ఆభరణాలు శాంతికి ఉన్నట్టు చెబుతున్నారు. విశాఖ నుంచి విజయవాడ బదిలీ కాగా, అక్కడ శాంతి బినామీల పేరిట రెండు విల్లాలను కొనుగోలు చేశారంటున్నారు. అందులో ఒకటి సాయిరెడ్డే తక్కువ రేటుకు ఇప్పించారని ఆమె మీడియా సమావేశంలో ప్రకటించారు. ఓ విల్లాను కూటమి ప్రభుత్వంలోని ఓ నాయకుడికే నెలకు రూ.లక్ష అద్దెకు ఇచ్చారు. మరో విల్లాలో కుమారుడితో కలిసి ఉంటున్నారు. ఇటీవల ఆఫీస్‌ పనిపై విశాఖ వచ్చిన ఆమె, తన కుమార్తెను డెహ్రాడూన్‌ స్కూల్‌లో ఏడాదికి రూ.16లక్షల ఫీజు కట్టి చేర్పిస్తున్నానని సహోద్యోగులకు చెప్పారు. అయినా, ఆమె అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఇంతవరకు అవినీతి నిరోధక శాఖ దృష్టి పెట్టలేదు. ఆమె తన ఇద్దరు చెల్లెళ్లకు అప్పట్లో వైసీపీ కీలక నేతతో సిఫారసు చేయించుకుని ఏపీ ఫైబర్‌ నెట్‌లో ఉద్యోగాలు వేయించారు. మొన్నటివరకు వారు అక్కడే పనిచేయడం గమనార్హం. ఇప్పటికైనా ఏసీబీ ఆమె సంపాదనపై దృష్టి పెడితే అనేక విషయాలు బయటకు వస్తాయి.

Updated Date - Aug 23 , 2025 | 04:44 AM