Share News

AP Assembly: మండలిలో హోరా హోరీ

ABN , Publish Date - Sep 20 , 2025 | 07:08 AM

రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల ఏర్పాటు అంశంపై శుక్రవారం శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది.

AP Assembly: మండలిలో హోరా హోరీ

  • వైద్య కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా తెచ్చిందే జగన్‌!.. మండలిలో నిలదీసిన టీడీపీ

  • మెడికల్‌ కాలేజీల అంశంపై వైసీపీ సభ్యుల రగడ

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో వైద్య కళాశాలల ఏర్పాటు అంశంపై శుక్రవారం శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. టీడీపీ, వైసీపీ సభ్యులు చైర్మన్‌ పోడియం వద్ద పోటాపోటీగా నినాదాలు చేశారు. సభ ప్రారంభం కాగానే వైద్య కళాశాలల అంశంపై చర్చించాలంటూ వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆ తీర్మానాన్ని చైర్మన్‌ మోషేన్‌రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. పీపీపీ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. వారి ఆందోళనల మధ్యనే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభ రెండుసార్లు వాయిదా పడింది. తర్వాత జరిగిన బీఏసీ సమావేశంలో వైద్య కళాశాలలపై స్వల్పకాలిక చర్చకు నిర్ణయం తీసుకున్నారు. తిరిగి 12.38 గంటలకు సభ ప్రారంభమయ్యాక కూడా వైసీపీ సభ్యులు చైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో టీడీపీ సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా తెచ్చింది నువ్వు కాదా జగన్‌? అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బాపట్లలో పునాదుల దశలోనే వదిలేసిన మెడికల్‌ కళాశాల ఫొటోలను, అసంపూర్తిగా నిర్మించిన కళాశాల భవనాల ఫొటోలను ప్రదర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రశ్నోత్తరాలు పూర్తయినట్టు ప్రకటించిన చైర్మన్‌.. జీఎస్టీ సంస్కరణల అంశంపై ప్రకటన చేయాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ను కోరారు.


దీంతో టీడీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లి కూర్చోగా వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. మెడికల్‌ కళాశాలలపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పయ్యావుల ప్రకటించి, సభను ఆర్డర్‌లో పెట్టాలని చైర్మన్‌ను కోరారు. కాలేజీల అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. వైసీపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో చైర్మన్‌ సభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా, గందరగోళం సమయంలోనే కారుణ్య నియామకాలపై ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్‌ సమాధానమిచ్చారు. కారుణ్య నియామకాలకు 3,441 మంది దరఖాస్తు చేసుకోగా, 2,569 మంది నియమితులయ్యారని తెలిపారు. ఉపాధ్యాయుల కారుణ్య నియామకాలను సాధారణ కోటాలోకి చేర్చే ప్రతిపాదన లేదని చెప్పారు. పలు ప్రశ్నలకు మంత్రులు నిమ్మల, నారాయణ సమాధానం ఇస్తుండగా.. వైసీపీ సభ్యుల నినాదాలతో గందరగోళం ఏర్పడింది.


పన్ను వేసి.. చెత్త తొలగించలేదు: నారాయణ

గత ప్రభుత్వం చెత్తపై పన్ను వసూలు చేసినా.. 85 లక్షల టన్నుల చెత్తను తొలగించకుండా వదిలేసిందని మున్సిపల్‌ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో పురపాలక సంఘాల్లో పారిశుధ్య వ్యవస్థపై సభ్యులడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు 84 లక్షల టన్నుల చెత్తను తొలగించామని చెప్పారు.

నీటి ప్రాజెక్టుల నిర్వహణను ప్రైవేట్‌కు ఇవ్వం: నిమ్మల

సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణను ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగించే ప్రతిపాదనేమీ లేదని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం, ఇళ్ల స్థలాలు, సాగునీటి ప్రాజెక్టు నిర్వహణ వంటి అంశాలపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రాజెక్టు నిర్వహణకు 1,517 మంది లస్కర్లు, 1,456 మంది సాంకేతిక సిబ్బంది ఉన్నారని, కొత్త సిబ్బందిని నియమించే ప్రతిపాదన లేదని, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమిస్తున్నారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా 373 నివాస ప్రాంతాల్లోని 96,660 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని అంచనా వేసినట్లు తెలిపారు.

Updated Date - Sep 20 , 2025 | 07:12 AM