Rayadurg Garments Industry: దర్జీలు కావలెను
ABN , Publish Date - Sep 21 , 2025 | 05:12 AM
మార్కెట్ ఫుల్‌గా ఉంది.. కానీ నిపుణులైన దర్జీల కొరత రాయదుర్గం గార్మెంట్స్ పరిశ్రమను వేధిస్తోంది. జీన్స్ ప్యాంట్ల తయారీలో దక్షిణ భారతదేశంలోనే పేరెన్నికగన్న అనంతపురం జిల్లా రాయదుర్గం...
రాయదుర్గం గార్మెంట్స్ పరిశ్రమకు నిపుణుల కొరత
నైపుణ్య కార్మికుల్లేక పాత పద్ధతిలో పనులు
‘కొవిడ్’లో కార్మికులు, యజమానులు పరిశ్రమకు దూరం
(రాయదుర్గం-ఆంధ్రజ్యోతి)
మార్కెట్ ఫుల్‌గా ఉంది.. కానీ నిపుణులైన దర్జీల కొరత రాయదుర్గం గార్మెంట్స్ పరిశ్రమను వేధిస్తోంది. జీన్స్ ప్యాంట్ల తయారీలో దక్షిణ భారతదేశంలోనే పేరెన్నికగన్న అనంతపురం జిల్లా రాయదుర్గం గార్మెంట్స్ పరిశ్రమలో గతంలో వేలాది మంది కార్మికులు పనిచేసేవారు. అయితే కరోనా సమయంలో వారు ఉపాధి కోల్పోవడంతో సుమారు 40 శాతం మందికిపైగా ఇతర రంగాలకు మారిపోయారు. ఆ ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కొవిడ్ సంక్షోభాన్ని దాటుకుని ఇప్పుడు ఆ పరిశ్రమ మళ్లీ వేగం పుంజుకుంటోంది. కానీ తగినంత మంది నిపుణులైన కార్మికులు దొరక్క మార్కెట్‌ను అందిపుచ్చుకోలేకపోతోంది. మిగిలి ఉన్న కుట్టుకార్మికులు మూస పద్ధతిలోనే పని చేసుకుపోతున్నారు. ఆధునిక నైపుణ్యం వారి వద్ద లేకపోవడంతో పనిలో వేగం పెరగడంలేదు. ఇక కొత్తగా కార్మికులెవరూ ఈ రంగం పట్ల ఆసక్తి చూపడం లేదు. దీంతో యజమానులు తలలుపట్టుకునే పరిస్థితి వచ్చింది.
టెక్నాలజీని అందుకోలేక..
మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని రాయదుర్గం గార్మెంట్స్ పరిశ్రమ అందుకోలేకపోతోంది. ఏళ్ల తరబడిగా సింగిల్ నీడిల్ జూకీ మిషన్లపై ఆధారపడుతోంది. మార్కెట్‌లో ఆటోమెటిక్ త్రెడ్ కటింగ్ మెషీన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ వాటిని వినియోగించే కార్మికులు ఇక్కడ లేరు. ఇక్కడి జీన్స్‌ను ఏపీలోని వివిధ ప్రాంతాలకు, కర్ణాటక, తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నప్పటికీ, ఉత్పత్తిలో వేగాన్ని అందుకోలేకపోవడానికి మూసపద్ధతి, పాత నైపుణ్యాలే కారణం. జీన్స్ కుట్టుకు ఆధునిక మెషీన్లను వినియోగిస్తే నాణ్యత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి మిషన్ ఒక్కొక్కటి రూ. 40 వేల వరకూ విలువ చేస్తుంది. కానీ రాయదుర్గంలో రూ. 20 వేల విలువ చేసే జూకీ మిషన్లను వాడే కార్మికులే అందుబాటులో ఉన్నారు. వీరికి తగిన నైపుణ్యాన్ని అందించేలా శిక్షణ కేంద్రాలు లేవు. దీంతో గార్మెంట్ యజమానులు పాత తరహా మిషన్లపై ఆధారపడక తప్పడం లేదు. కొత్తతరహా మెషీన్లతో విద్యుత్ ఆదా అవుతుంది.
రోజుకు 40 లక్షలకుపైగా బిజినెస్
రాయదుర్గం గార్మెంట్స్ పరిశ్రమలో వేలాది కుటుంబాలు ఉన్నాయి. వీరి ద్వారా రోజుకు రూ. 40 లక్షలకుపైగా విలువైన ప్యాంట్లు తయారవుతాయి. ఒక్కో కార్మికుడు రోజుకు 10 నుంచి 15 ప్యాంట్లను తయారు చేస్తారు. ఇటీవల కార్మికుల డిమాండ్ పెరగడంతో ఆ రంగంలో స్థిరపడిన వా రికి ప్రాధాన్యంపెరిగి, కూలీ కూడా పెరిగింది. గతంలో ఒక్కో ప్యాంట్ కుట్టుకు కూలీ రూ. 40 దాకా ఇచ్చేవారు. ఇప్పుడు రూ.60 చెల్లిస్తున్నారు. గార్మెంట్స్‌కు డిమాండ్ పెరిగింది. కానీ కార్మికుల కొరత మాత్రం వెంటాడుతోంది.
డిమాండ్ పెరిగినా...
రాయదుర్గం జీన్స్‌కు జాతీయస్థాయి డిమాండ్ ఉంది. కొవిడ్‌కు ముందు ఇక్కడి గార్మెంట్స్ పరిశ్రమపై ఆధారపడి 20 వేలమందికిపైగా కార్మికులు జీవించేవారు. ఓ పక్క కొవిడ్, మరోపక్క వస్త్రం ధర విపరీతంగా పెరగడంతో పరిశ్రమకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుట్టు కార్మికులకు తగినంత ఉపాధి లభించలేదు. కొందరు కూలీలుగా మారారు. మరికొందరు వలసవెళ్లిపోయారు. కొవిడ్ సమయంలో కొందరు యజమానులు కూడా గార్మెంట్ రంగాన్ని వదిలి వెళ్లారు. సుమారు 500 యూనిట్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి గార్మెంట్స్ దిగుమతి పూర్తిగా ఆగిపోయింది. ప్రాంతీయంగా ఉండే గార్మెంట్స్ రంగానికి డిమాండ్ పెరిగింది. అందులో భాగంగానే రాయదుర్గం జీన్స్‌కు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్‌కు ఇప్పుడు మంచిరోజులు వచ్చాయని, అధునాతన మెషీన్లు కొనుగోలుకు తాము సిద్ధంగానే ఉన్నా కూడా నైపుణ్యం ఉన్న కార్మికులు అందుబాటులో లేరని పలువురు యజమానులు అంటున్నారు. నైపుణ్యం పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతను గార్మెంట్స్ రంగం వైపు మళ్లించాలని యజమానులు కూడా కోరుతున్నారు. అలాగే పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని గార్మెంట్స్ యజమానులు కోరుతున్నారు.