Share News

Shocking Demise: కిరాతకుడు

ABN , Publish Date - Jul 16 , 2025 | 05:03 AM

కన్నపేగునే కడతేర్చి పొలాల్లో పాతి పెట్టాడో కిరాతక తండ్రి. ఇదే ఉన్మాది గతంలో తన కడుపున పుట్టిన మూడేళ్ల పసికందును, చెల్లెల్ని, తండ్రినీ చంపేశాడు.

Shocking Demise: కిరాతకుడు

  • కొడుకును చంపి పొలాల్లో పాతి..

  • గతంలో తల్లి, చెల్లి, తండ్రి, భార్య కుమార్తె హత్య

క్రోసూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): కన్నపేగునే కడతేర్చి పొలాల్లో పాతి పెట్టాడో కిరాతక తండ్రి. ఇదే ఉన్మాది గతంలో తన కడుపున పుట్టిన మూడేళ్ల పసికందును, చెల్లెల్ని, తండ్రినీ చంపేశాడు. కన్నతల్లినైతే ముక్కముక్కలుగా నరికి అడవిలో తుప్పల్లో పడేశాడు! తాజాగా రెండు వారాల క్రితం మొదటి భార్యకు పుట్టిన కొడుకును చంపి పొలాల్లో పాతిపెట్టాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడగా, విచారణలో నిందితుడి దుశ్చర్యల గురించి మరిన్ని విస్తుపోయే అంశాలు బయటికొచ్చాయి. పోలీసుల కథనం మేరకు... పల్నాడులోని అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర నాయక్‌, కోటేశ్వరి దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి మొదటి సంతానం మంగ్యానాయక్‌. కొన్నేళ్లకు మరొక బాబు జన్మించగా భార్యపై అనుమానంతో మూడు నెలలున్న ఆ పసికందును వెంకటేశ్వర నాయక్‌ చంపేశాడు. దీంతో కోటేశ్వరి బాయి పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత మూడేళ్లకు ప్రమీల బాయి అనే ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వెంకటేశ్వర్‌ నాయక్‌ ఉన్మాదిగా మారిపోయాడు. కొంతకాలానికి సొంత చెల్లిని దారుణంగా హత మార్చాడు. తర్వాత 2014లో కన్నతల్లి మార్వాణీ బాయిని ముక్కముక్కలుగా నరికి మాదిపాడు సమీప వెంకటాయపాలెం అడవిలో పడేశాడు. మరి కొద్ది కాలానికి తండ్రి బాలు నాయక్‌ను కూడా హతమార్చాడు. కొనాళ్లు జైలులో ఉండి బయటికొచ్చాడు. తనకు తెలియకుండా మేకను విక్రయించాడన్న నెపంతో సుమారు రెండు వారాల క్రితం కొడుకు మంగ్యా నాయక్‌ను చంపేసి, ఎర్రబాలెం సమీప పొలాల్లో పూడ్చి పెట్టాడు. మంగ్యా నాయక్‌ కన్పించకుండా పోవడంతో ప్రమీల బాయి క్రోసూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వెంకటేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా, హత్య విషయాన్ని ఒప్పుకున్నాడు. గతంలో కూడా అతనికి నేర చరిత్ర ఉందని, సీరియల్‌ కిల్లర్‌గా మొత్తం నాలుగు హత్య కేసుల్లో నిందితుడి ఉన్నట్టుగా వెల్లడైంది.

Updated Date - Jul 16 , 2025 | 05:07 AM