Share News

గోనెగండ్లలో వైసీపీకి షాక్‌

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:59 PM

గోనెగండ్లలో వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన గోనెగండ్ల 2 ఎంపీటీసీ రమణికుమారి తన పదవికి రాజీనామా చేశారు.

 గోనెగండ్లలో వైసీపీకి షాక్‌
ఎంపీటీసీకి రాజీనామా సమర్పిస్తున్న మండల ఉపాఽధ్యక్షురాలు రమణికుమారి

టీడీపీలోకి రమణికుమారి, మురళీనాయుడు

గోనెగండ్ల, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): గోనెగండ్లలో వైసీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన గోనెగండ్ల 2 ఎంపీటీసీ రమణికుమారి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం తన అనుచరులతో కలసి రమణికుమారి ఎంపీడీవో కార్యాలయంను చేరుకొని తన రాజీనామా పత్రంను ఎంపీడీవో మణిమంజరికి అందజే శారు. తాలుకా వైసీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు మురళీనాయుడు తన పదవికి రాజీనామ చేశారు. తన రాజీ నామా పత్రంను జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఎస్వీ మోహనరెడ్డికి పంపారు. గోనెగండ్లలో బలమైనా సామాజిక వర్గానికి చెందిన మురళీనాయుడు, ఆయన భార్య రమణికుమారి వైసీపీ కి రాజీనామా చేయడం తో ఆ పార్టీ గట్టి షాక్‌ తగిలినట్టయింది. మురళీనాయుడు కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగినది. ఆకుటుంబం నుంచి మురళీనాయుడి తండ్రి వాసుదేవనాయుడు, తల్లి లక్ష్మిదేవమ్మ మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పంచలుగా గతంలో ఎన్నికయ్యారు. మురళీనాయుడు పార్టీకి రాజీనామా చేయడంతో గోనెగండ్లలో వైసీపీకి వచ్చే స్థానిక ఎన్నికలలో గట్టి దెబ్బ తగనున్నట్లు టీడీపీ నాయకులు భావిస్తున్నారు. తమ పదవులకు రాజీనామా చేసిన మురళీనాయుడు, రమణికుమారి తన అనుచరులతో కలసి ఎమ్మిగనూరుకు ప్రత్యేక వాహనాల్లో బయలు దేరారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సమక్షంలో సైకిల్‌ ఎక్కారు. ఇదే బాటలో మరి కొందరు వైసీపీ నాయకులు వచ్చే స్థానిక ఎన్నికల లోపు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.

Updated Date - Oct 13 , 2025 | 11:59 PM