CM Chandrababu Seeks UAE Investments: 100 కోట్లతో లైబ్రరీ
ABN , Publish Date - Oct 23 , 2025 | 05:22 AM
రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి దుబాయ్‌లోని ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ ముందుకొచ్చింది....
అమరావతిలో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తాం
దుబాయ్ పర్యటనలో తొలి రోజే పెట్టుబడుల వేటకు సీఎం శ్రీకారం
పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు
తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటుకు బుర్జిల్ సంసిద్ధత
లాజిస్టిక్స్, గిడ్డంగుల్లో పెట్టుబడులకు షరాఫ్ గ్రూప్ ఆసక్తి
రైల్వే, పోర్టు లింకు ప్రాంతాన్ని గుర్తించాలని సీఎంకు సూచన
దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ యూనిట్‌కు ట్రాన్స్‌వరల్డ్ ఓకే
గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా మారుస్తున్నాం
ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు.. విశాఖ సదస్సులో భాగస్వాములవండి.. దుబాయ్ పారిశ్రామికవేత్తలకు బాబు ఆహ్వానం
అమరావతి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయ నిర్మాణానికి దుబాయ్‌లోని ప్రముఖ రియాల్టీ సంస్థ శోభా గ్రూప్ ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ పర్యటన ప్రారంభమైంది. మూడ్రోజుల పర్యటనలో భాగంగా మంత్రులు, అధికారులతో కలిసి బుధవారం దుబాయ్ చేరుకున్న ఆయన.. తొలి రోజే పలువురు పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. అందులో భాగంగా..శోభా గ్రూప్ చైర్మన్ రవి మీనన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా.. అమరావతిలో రూ.100 కోట్ల విరాళంతో ఉచితంగా ప్రపంచ స్థాయి గ్రంథాలయం నిర్మిస్తామని రవి మీనన్ వెల్లడించారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ రాజధాని నగరంగా నిర్మిస్తున్నామని, దాని నిర్మాణంలో శోభా గ్రూప్ కూడా భాగస్వామి కావాలని సీఎం కోరారు. గ్రీన్ ఎనర్జీకి ఏపీని చిరునామాగా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని... మౌలిక సదుపాయాల కల్పనపైనా భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ సహా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలోనూ అపారమైన అవకాశాలు ఉన్నాయంటూ మీనన్‌ను ఆహ్వానించారు. శోభా గ్రూప్ తమ ఆదాయంలో 50 శాతాన్ని దానధర్మాలకు ఉపయోగించడాన్ని అభినందించారు. తాము ఏపీలో పేదరిక నిర్మూలన లక్ష్యంతో పీ4 విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. తమ సంస్థ దుబాయ్‌తోపాటు ఒమాన్, బహ్రెయిన్, ఖతార్, బ్రూనై దేశాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోందని.. భారత్‌లో 14 రాష్ట్రాల్లోని 27 నగరాల్లో ప్రాజెక్టులు చేపట్టిందని రవి మీనన్ చెప్పారు. విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సులో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలతో భేటీల్లో సీఎం ఆహ్వానించారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులపైనా చర్చించారు.
లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులు పెడతాం
షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్, షరాఫ్ డీజీ సంస్థ వ్యవస్థాపకుడు షరాఫుద్దీన్ షరా్‌ఫతో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. లాజిస్టిక్స్ ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ గ్రూప్ ఇప్పటికే భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో.. ఏపీ చేపట్టిన పారిశ్రామిక కారిడార్లలో ఆధునిక లాజిస్టిక్స్ పార్కులు, గిడ్డంగులు స్థాపించడానికి రాష్ట్రప్రభుత్వానికి సహకరించాలని ఆహ్వానించారు. షరాఫ్ గ్రూప్ ప్రతినిధులుస్పందిస్తూ.. తమ అనుబంధ సంస్థ అయిన హింద్ టెర్మినల్స్ ప్రైవేటు లిమిటెడ్ ద్వారా లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు, గిడ్డంగుల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తంచేశారు. రైల్వే, పోర్టు అనుసంధానం ఉన్న ప్రాంతాన్ని గుర్తించాలని సీఎంను కోరారు.
షిప్ బిల్డింగ్ యూనిట్‌పై ట్రాన్స్‌వరల్డ్ పరిశీలన
ట్రాన్స్‌వరల్డ్ గ్రూప్ చైర్మన్ రమేశ్ ఎస్ రామకృష్ణన్, బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ చైర్మన్ షంషీర్ వయాలిల్‌తోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. దుగరాజపట్నం పోర్టులో షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. సీఎం ఆహ్వానంపై ట్రాన్స్‌వరల్డ్ సానుకూలత వ్యక్తంచేసింది. తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణం చేపడతామని బుర్జిల్ హెల్త్‌కేర్ హోల్డింగ్స్ ప్రతినిధులు తెలిపారు. యూఏఈ రాజధాని అబూ ధాబీలో అతిపెద్ద క్యాన్సర్ ఆసుపత్రిని ఈ సంస్థ నిర్వహిస్తోంది.
తెలుగు ప్రజల ఘనస్వాగతం..
అంతకుముందు.. దుబాయ్ చేరుకున్న సీఎంకు స్థానిక తెలుగు ప్రజలు ఘనస్వాగతం పలికారు. విమానశ్రాయంలో భారతీయ కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్, టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, దుబాయ్ శాఖ అధ్యక్షుడు విశ్వేశరరావు, ముక్కు తులసి కుమార్, తెలుగు సంఘం అధ్యక్షుడు మసీయోద్దీన్, అధికారులు స్వాగతం పలికారు. సీఎంకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్ర మహిళలు కూడా చేరుకోవడంతో ఒకింత ఇబ్బంది ఎదురయింది. అనంతరం సతీశ్‌కుమార్ శివన్‌తో, అబూ ధాబీ ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమర్‌నాథ్‌తో సీఎం భేటీ అయ్యారు. ఏపీ-యూఏఈ నడుమ పారిశ్రామిక బంధం బలపడేలా సహకరించాలని కోరారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని తెలిపారు. యూఏఈలోని వివిధ దేశాలకు చెందిన సావరిన్ ఫండ్స్ నుంచి ఏపీలో పెట్టుబడులకు సహకరించాలని కోరారు. ప్రధాని మోదీ చొరవ వల్లే భారత్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. భారతదేశ బ్రాండ్‌ను ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. భారత్-యూఏఈ దేశాల మధ్య వాణిజ్యం-పెట్టుబడులు పెరగడానికి ఆయన కృషే కారణమని చెప్పారు. యూఏఈలో ఉన్న తెలుగు వారికి ఇండియన్ ఎంబసీ సహకారం అందించే అంశంపైనా చర్చించారు. ట్రేడ్-టెక్నాలజీలో భారత్‌దేశానికి యూఏఈ భాగస్వామిగా ఉందని శివన్ చెప్పారు. విద్య, వైద్యరంగాల్లో పెట్టుబడులకు ఆసక్తిగా ఉందన్నారు. పరస్పర పెట్టుబడులతో ఇరుదేశాల బంధం మరింత బలపడిందని సీఎంకు వివరించారు. ఈ భేటీలో మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు.
