బెడిసి కొట్టింది!
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:20 AM
పర్యాటక యూనిట్లను ప్రైవేటీకరించాలన్న అధికారుల నిర్ణయం బెడిసి కొట్టింది. విజయవాడ డివిజన్ పరిధిలోని పర్యాటక యూనిట్లను నిర్వహించటానికి ఏ ప్రైవేటు సంస్థ కూడా ఆసక్తి చూపలేదు. సోమవారంతో నోటిఫికేషన్ గడువు పూర్తికానుంది. దీంతో 5వ తేదీ వరకు గడువు పొడిగించాలని భావిస్తున్నారు.
-పర్యాటక యూనిట్ల ప్రైవేటీకరణకు ముందుకురాని సంస్థలు
- నేటితో ఆసక్తి వ్యక్తీకరణ గడువు పూర్తి
- హరిత బెర్మ్‌పార్క్‌ను తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి రుణం
- లీగల్ సమస్యలు వస్తాయన్న ఉద్దేశ్యంతో వెనుకడుగు
- భవానీ ద్వీపం, సూర్యలంక, నాగార్జున సాగర్ ప్రాజెక్టులపైనా అనాసక్తి
- ఉద్యోగుల ఆందోళనలు, న్యాయ పోరాటాల నేపథ్యంలోనూ అయిష్టత
పర్యాటక యూనిట్లను ప్రైవేటీకరించాలన్న అధికారుల నిర్ణయం బెడిసి కొట్టింది. విజయవాడ డివిజన్ పరిధిలోని పర్యాటక యూనిట్లను నిర్వహించటానికి ఏ ప్రైవేటు సంస్థ కూడా ఆసక్తి చూపలేదు. సోమవారంతో నోటిఫికేషన్ గడువు పూర్తికానుంది. దీంతో 5వ తేదీ వరకు గడువు పొడిగించాలని భావిస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ డివిజన్ పరిధిలోని హరిత బెర్మ్‌పార్క్ (పున్నమి), భవానీ ద్వీపం, సూర్యలంక, నాగార్జునసాగర్ తదితర పర్యాటక యూనిట్లను ప్రైవేటీకరణ చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే వీటిని నిర్వహించటానికి ఏ ఒక్క ప్రైవేటు సంస్థ కూడా ధైర్యం చేయలేదు. ఆపరేషన్ అండ్ మెయింట్‌నెన్స్ (ఓఅండ్‌ఎం) పేరుతో అప్పగించే వీటికి భారీగా పెట్టుబడులు పెట్టి నిర్వహించే బదులు.. అదేదో తాము స్వయంగానే బయట చేసుకుంటే వ్యాపారం బాగుంటుందన్న ఆలోచనలు చేయటంతో ఏ సంస్థ కూడా ముందుకు రాలేదని తెలుస్తోంది. కొన్ని ప్రైవేటు హోటల్స్ యాజమాన్యాలు సమావేశాలు పెట్టుకున్నా కూడా ఆసక్తి వ్యక్తీకరించటానికి వెనుకాడాయి. ఆదివారం వరకు ఒక్కటంటే ఒక్క సంస్థ కూడా ఆసక్తి చూపలేదు. సోమవారం వరకు గడువు ఉన్నా కూడా.. ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో పర్యాటకశాఖ అధికారులు ఆర్‌ఎఫ్‌పీ గడువును అక్టోబరు 5వ తేదీ వరకు పొడిగించాలని భావిస్తున్నారు. సోమవారం పొడిగింపు పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ఒక విధానం లేకుండా పర్యాటక యూనిట్లను ఓఅండ్‌ఎం కింద అప్పగించేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్‌జైన్ ఏకపక్షంగా చేసిన ప్రయోగం బెడిసికొట్టినట్టు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక యూనిట్ల ప్రైవేటీకరణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి ఆదేశాలకు భిన్నంగా..
ముఖ్యమంత్రి ఆదేశాలకు భిన్నంగా పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్ లాభాలు వచ్చే యూనిట్లను కూడా ప్రైవేటీకరణ జాబితాలో పెట్టారు. దీంతో వివాదం రాజుకుంది. విజయవాడ డివిజన్ పరిధిలో అయితే బ్యాంకులో తనఖా ఉన్న యూనిట్లను కూడా ప్రైవేటీకరణ జాబితాలో పెట్టారు. హరిత బెర్మ్ పార్క్ పై రూ. 150 కోట్ల రుణాన్ని తీసుకోవటం జరిగింది. ఈ రుణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాటేజీలను అభివృద్ధి చెయ్యటం కోసం అని తీసుకున్నారు. ఇప్పటి వరకు రూ. 80 కోట్ల మేర అయితే పనులు జరిగాయి. సడెన్‌గా పనులు ఆపివేసి .. ప్రైవేటీకరణ జపం ఎత్తుకున్నారు. తాకట్టులో ఉన్న బరం పార్కును ఓఅండ్‌ఎం కింద నిర్వహించటానికి ఏ సంస్థ కూడా ఆసక్తి చూపలేదు. ఒకవేళ దీనిని కనుక తీసుకుంటే .. భవిష్యత్తులో లీగల్ సమస్యలు వస్తాయని సంస్థలు భావించాయి. తాకట్టులో ఉన్న ఏ ఆస్తిని కూడా మరొకరికి వాణిజ్యపరంగా అప్పగించటం అన్నది లీగల్‌గా సమస్యలను కలిగిస్తుందని సంస్థలు భావించినట్టు తెలుస్తోంది. రేపు బ్యాంకు తన తనఖాలో ఉన్న యూనిట్‌ను ఏ విధంగా మరొకరికి అప్పగిస్తారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉండదని భావించాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హరిత బరం పార్కు వైపు ఏ సంస్థ కూడా కన్నెత్తి చూడటం లేదు. భవానీ ద్వీపం తరచూ వరద ముంపునకు గురయ్యే అవకాశం ఉందని వయబిలిటీ కాదని సంస్థలు భావించాయి. సూర్యలంక, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు పట్ల కూడా ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపించలేదు. పర్యాటక శాఖ ఉద్యోగులు గట్టిగా ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు. న్యాయ పోరాటాలు దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశ్యంతో ప్రైవేటు సంస్థలు ఏవీ ఆసక్తి చూపించటం లేదని తెలుస్తోంది.