Sharmila Criticizes Jagan: ఉన్న ఒక్క చెల్లినీ చూసుకోలేరా?
ABN , Publish Date - Nov 20 , 2025 | 04:55 AM
అన్నగా ఉన్న ఒకే ఒక్క చెల్లిని చూసుకోలేరా? అని మాజీ సీఎం వైఎస్ జగన్ తీరుపై ఆయన చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆవేదన....
జగన్‌కు నేను దూరం కాలేదు.. అతనే నన్ను, అమ్మను దూరం పెట్టారు
‘జగన్, కేటీఆర్ వర్సెస్ షర్మిల, కవిత’చర్చపై ఏపీసీసీ చీఫ్ స్పందన
అమరావతి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అన్నగా ఉన్న ఒకే ఒక్క చెల్లిని చూసుకోలేరా? అని మాజీ సీఎం వైఎస్ జగన్ తీరుపై ఆయన చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు తాను దూరం కాలేదని, అతనే తనను, అమ్మ (విజయమ్మ)ను దూరం పెట్టారని అన్నారు. బుధవారం విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత.. తెలంగాణలో కేసీఆర్ కుమార్తె, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోదరి కవిత, ఏపీలో జగన్ సోదరి షర్మిలకు తమ సోదరులతో ఉన్న విభేదాలపై రాజకీయ వర్గాల్లో చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలో కవిత, షర్మిల తమ అన్నలకు దూరం కావడంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ‘ఆంధ్రజ్యోతి’ షర్మిల అభిప్రాయాన్ని కోరింది. ‘ఉన్న ఒకే ఒక్క చెల్లిని కూడా చూసుకోకపోతే ఎలా? కోరిన వెంటనే నేను అన్న కోసం వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. ఇంతకంటే చిత్తశుద్ధిని పదే పదే నిరూపించుకోవాలా? చెల్లెల్లను సరిగా చూసుకుంటే బయటికి ఎందుకొస్తాం’ అని అన్నారు. కాగా, ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు బాండ్ పేపర్‌పై లిఖిత పూర్వక పూచీ ఇవ్వాలని విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబును షర్మిల డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖ సదస్సులో చేసుకున్న పెట్టుబడి ఒప్పందాలు, మేనిఫెస్టోలోని ఉద్యోగాల కల్పన హామీపై తనకు నమ్మకం లేదని అన్నారు.