తాడేపల్లి ప్యాలెస్‌కూ వాటాలు: భానుప్రకాశ్‌రెడ్డి
ABN , Publish Date - Sep 21 , 2025 | 04:43 AM
శ్రీవారి పరకామణి కుంభకోణంలో వైసీ పీ పెద్దలు, కొందరు టీటీడీ అధికారులూ వాటాదారులేనని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.
తిరుపతి (విద్య), సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): శ్రీవారి పరకామణి కుంభకోణంలో వైసీ పీ పెద్దలు, కొందరు టీటీడీ అధికారులూ వాటాదారులేనని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు పెద్దలు, టీటీడీ అధికారులు శ్రీవారి సొమ్మును వాటాలు వేసుకుని పంచుకున్నారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలె్‌సకూ వాటాలు వెళ్లాయన్నారు. పోలీసు అధికారుల నుంచి వచ్చిన ఒత్తి డి కారణంగానే పరకామణి కేసును రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ అధికారులు చెప్పారన్నారు. రాజీకోసం ఒత్తిడి చేసిన ఆ పోలీసు అధికారి ఎవరో త్వరలోనే నిగ్గుతేలుతుందన్నారు. అప్పట్లో కీలక స్థానంలో ఉన్న ఓ అధికారి పశ్చాత్తాపం చెందారని, పరకామణి కుంభకోణానికి సంబంధించిన అన్ని విషయాలను త్వరలో బహిరంగంగా వెల్లడించనున్నారని తెలిపారు. పెద్దజీయర్ మఠం క్లర్క్ సీవీ రవికుమార్ పరకామణిలో డాలర్ల కట్టను దాచేస్తున్న వీడియోలను మీడియాకు ఆయన చూపించారు. సాక్ష్యాలు లేకుండా పెద్దలు ఈ వీడియోలన్నింటినీ డిలీట్ చేశారని, అయితే టీటీడీ ఉద్యోగిగా ఉన్న ఓ భక్తుడు ఆ వీడియోలను సేకరించి జాగ్రత్త చేశారని వివరించారు. రవికుమార్ ప్రతిరోజూ రూ. 10 నుంచి 12 లక్షల వరకూ హుండీ సొమ్మును కాజేసేవాడని, వాటితో అనేక ఆస్తులు కొనుగోలు చేశాడని చెప్పారు. చెన్నైలోని టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో నాటి కొందరు టీటీడీ అధికారులు, వైసీపీ పెద్దలు కూర్చుని ఆ ఆస్తులను వాటాలు వేసుకున్నారని తెలిపారు. గత పాలకులకు సహకరించిన కొందరిని బ్రహ్మోత్సవాల తర్వాత టీటీడీ నుంచి సాగనంపనున్నట్టు పేర్కొన్నారు.