Shanti Ashram: శాంతి ఆశ్రమం పీఠాధిపతి జ్ఞానేశ్వరి మాతాజీ కన్నుమూత
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:11 AM
ప్రపంచ వ్యాప్త భక్తులున్న కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం శాంతి ఆశ్రమ పీఠాధిపతి జ్ఞానేశ్వరి మాతాజీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు.
ప్రత్తిపాడు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యాప్త భక్తులున్న కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండ లం శాంతి ఆశ్రమ పీఠాధిపతి జ్ఞానేశ్వరి మాతాజీ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. శాంతి ఆశ్రమం 2వ పీఠాధిపతిగా 43 ఏళ్లుగా ఆమె సేవలందిస్తున్నారు. ఈ ఆశ్రమానికి దేశవ్యాప్తంగానే కాకుండా అమెరికా, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో కూడా భక్తులు ఉన్నారు. మాతాజీ 9వ ఏట నుంచి ఆధ్యాత్మిక చింతనలో ఉండి బ్రహ్మచారిణిగా ఉండిపోయారు. 3 నెలల క్రితం ఆశ్రమంలో పడిపోయిన మాతాజీ(90)కి కాలు విరగడంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. అనంతరం ఆశ్రమంలో విశ్రాంతి పొం దుతున్నారు. రెండురోజుల కిందట మాతాజీ అస్వస్థతకు గురి కావడంతో ఆశ్ర మ నిర్వాహకులు కాకినాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 6.40గంటలకు పరమపదించారు. దీంతో ఆమెను శాంతి ఆశ్రమానికి తరలించి ఆశ్రమ వ్యవస్థాపకులు ఓంకార స్వామి సమాధి మందిరం వద్ద సందర్శకుల కోసం ఉంచారు. శనివారం ఉదయం 10 గంటలకు శాంతి ఆశ్రమంలో జ్ఞానేశ్వరి మాతాజీకి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.