Share News

ఉపాధ్యాయుల బదిలీలపై నీలినీడలు!

ABN , Publish Date - May 06 , 2025 | 12:33 AM

పాఠశాలలకు వేసవి సెలవులు ముగిసేలోపు ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూలు విడుదలవుతుందనే ఆశతో ఉపాధ్యాయులు ఉన్నారు. ఈలోగా ప్రత్యేక అవసరాలు కలిగిన టీచర్లు బదిలీల కోసం మెడికల్‌ సర్టిఫికెట్లను తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రిఫరెన్షియల్‌ కేటగిరిలో బదిలీల విధివిధానాలు సక్రమంగా లేకపోవడంతో దృష్టిలోపం ఉన్నవారు, వితంతు కోటాలోకి వచ్చే వారు బదిలీల్లో తమకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తగ్గించారని, సరిచేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్‌ 15వ తేదీ వరకు ఉపాధ్యాయుల బదిలీల అంశంపై యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవులు పూర్తయ్యేలోపు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉపాధ్యాయుల బదిలీలపై నీలినీడలు!

- సెలవుల్లో బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటన

- 10న పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం!

- ఇప్పటికే టీచర్ల పదోన్నతులపై కసరత్తు చేస్తున్న విద్యాశాఖ అధికారులు

-ప్రిఫరెన్షియల్‌ కేటగిరిలో బదిలీల విధివిధానాలపై దృష్టిలోపం, వితంతు కేటగిరి ఉపాధ్యాయుల అసంతృప్తి

- బదిలీల్లో అన్యాయం జరగనుందని కోర్టులో వేర్వేరుగా పిటీషన్లు

- జూన్‌ 15వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు!

పాఠశాలలకు వేసవి సెలవులు ముగిసేలోపు ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన షెడ్యూలు విడుదలవుతుందనే ఆశతో ఉపాధ్యాయులు ఉన్నారు. ఈలోగా ప్రత్యేక అవసరాలు కలిగిన టీచర్లు బదిలీల కోసం మెడికల్‌ సర్టిఫికెట్లను తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రిఫరెన్షియల్‌ కేటగిరిలో బదిలీల విధివిధానాలు సక్రమంగా లేకపోవడంతో దృష్టిలోపం ఉన్నవారు, వితంతు కోటాలోకి వచ్చే వారు బదిలీల్లో తమకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను తగ్గించారని, సరిచేయాలని కోరుతూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్‌ 15వ తేదీ వరకు ఉపాధ్యాయుల బదిలీల అంశంపై యధాస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవులు పూర్తయ్యేలోపు జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఉపాధ్యాయుల బదిలీలు జరిగితే ప్రిఫరెన్సియల్‌ కేటగిరీలోకి వచ్చే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మెడికల్‌ సర్టిఫికెట్లు పొందేందుకు గత నెలలోనే విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. మచిలీపట్నంలోని సర్వజన ఆస్పత్రిలో ఎన్టీఆర్‌ జిల్లాలోని 20 మండలాల్లో పనిచేసే టీచర్‌లకు గత నెల 24వ తేదీన సర్టిఫికెట్లు జారీ చేశారు. 25వ తేదీన కృష్ణాజిల్లాలోని 25 మండలాల్లో పనిచేసే టీచర్‌లకు సర్టిఫికెట్‌లు అందజేశారు. 26వ తేదీన ఏలూరు జిల్లా పరిధిలో పనిచేసే టీచర్‌లకు మెడికల్‌ సర్టిఫికెట్‌లను ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా దృష్టి లోపం ఉన్న టీచర్‌లకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా విధివిధానాలు ఉండటంతో తమకు టీచర్‌ల బదిలీల్లో అన్యాయం జరుగుతోందని ఈ కేటగిరిలోకి వచ్చే ఉపాధ్యాయులు మే 1వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. వీరి వాదనలు విన్న హైకోర్టు జూన్‌ 15వ తేదీ వరకు టీచర్‌ల బదిలీలపై స్టే విధించింది. సోమవారం వితంతు కోటాలోకి వచ్చే టీచర్‌లు తమకూ బదిలీల్లో కేటాయించిన పాయింట్లలో అన్యాయం జరుగుతోందని హైకోర్టును ఆశ్రయించినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. వీరి వాదనలు విన్న హైకోర్టు దృష్టిలోపం ఉన్న టీచర్ల బదిలీల అంశం మాదిరిగానే జూన్‌ 15 తర్వాత వితంతు టీచర్ల బదిలీల అంశంపై విచారణ చేస్తామని చెప్పినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. దుబాయ్‌లో ఉన్న విద్యాశాఖ సెక్రటరీ టీచర్‌ల బదిలీల అంశంపై గత శుక్రవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో గూగుల్‌ మీట్‌ నిర్వహించినట్లు టీచర్‌లు పేర్కొంటున్నారు.

తొలుత పదోన్నతులు.. ఆ తర్వాత బదిలీలు

బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఈ నెల 10వ తే దీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కాకముందే జిల్లాలో పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు ఇచ్చేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా టీచర్‌ల సీనియారిటీ జాబితాల తయారీపై జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌లు(ఎస్‌జీటీ), స్కూల్‌ అసిస్టెంట్‌లు (ఎస్‌ఏ)లు ఎంతమందికి పదోన్నతి ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే జాబితాలను రూపొందిస్తున్నారు. పాఠశాలల విలీనం, ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా తరగతికి ఒక ఉపాధ్యాయడు ఉండాలనే నిబంధనలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని టీచర్‌లు ఎంత మందిని బదిలీ చేయాల్సి వస్తుందనే అంశంపైనా లెక్కలు చూస్తున్నారు. దీంతో పాటు గణితం, ఇంగ్లీష్‌, సైన్స్‌ సబ్జెక్టులలో ఇప్పటికే మిగులుబాటుగా ఉన్న ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారు.. వారిని వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఏయే పాఠశాలల్లో సర్థుబాటు చేయాలనే అంశంపైనా జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. టీచర్‌ల పదోన్నతులు, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల అయితే ఆలస్యం లేకుండా ఈ ప్రక్రియలను పూర్తి చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు తమవంతు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

10 శాతం పాఠశాలలను బ్లాక్‌ చేసి..

ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి దృష్టిలోపం ఉన్న వారు, వితంతువులు కోర్టును ఆశ్రయించడంతో వీరి కోసం 10 శాతం పాఠశాలలను బ్లాక్‌ చేసి, బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ రెండు కేటగిరీల వారికి వారుకోరుకున్న ప్రాంతాలకు బదిలీలు చేసే అవకాశం లేకపోలేదని ఉపాధ్యాయ సంఘాల నాయకులు సూచనప్రాయంగా చెప్పుకుంటున్నారు. టీచర్ల బదిలీలకు సంబంధించి విద్యాశాఖలోని ఉన్నతాధికారులు కొందరు ఉపాధ్యాయుల ప్రయోజనాలను పక్కనపెట్టి విద్యాశాఖ సెక్రటరీ, కమిషనర్‌ను పక్కదారి పట్టిస్తున్నారని ఉపాఽధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతోనే విజయవాడకు ఊహించని విధంగా ఉపాధ్యాయులు తరలివచ్చి పెద్దఎత్తున నిరసన తెలియజేశారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు గుర్తు చేస్తున్నారు. కొందరు అధికారుల తీరుతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని టీచర్‌లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు.

Updated Date - May 06 , 2025 | 12:33 AM