Share News

Teacher Union: ఎస్జీటీల బదిలీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Jun 10 , 2025 | 03:40 AM

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే బదిలీలు చేపట్టనున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ సోమవారం ‘ఎక్స్‌’లో ప్రకటించారు.

Teacher Union: ఎస్జీటీల బదిలీలకు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌

  • టీచర్ల విజ్ఞప్తిపై మంత్రి లోకేశ్‌ స్పందన.. ‘విద్యాభవన్‌ ముట్టడి’ వాయిదా

  • ఆలస్యమయ్యే అవకాశం

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): సెకండరీ గ్రేడ్‌ టీచర్ల బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే బదిలీలు చేపట్టనున్నట్లు మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ సోమవారం ‘ఎక్స్‌’లో ప్రకటించారు. ‘పార్వతీపురం మన్యం జిల్లాలో నా క్షేత్రస్థాయి పర్యటన అనంతరం ప్రజాప్రతినిధులు, టీడీపీ ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవి, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్‌, కంచర్ల శ్రీకాంత్‌లతో చర్చించాను. ఉపాధ్యాయుల అభిప్రాయాలను ఎమ్మెల్సీలు నాకు తెలియజేశారు. టీచర్ల విజ్ఞప్తి మేరకు ఎస్జీటీలకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు బదులుగా మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. మంత్రి ప్రకటనతో మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ డిమాండ్‌తో ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక తన పోరాటాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రకటించింది. ఉద్యమ కార్యాచరణ ప్రకారం మంగళవారం(నేడు) మంగళగిరిలోని విద్యాభవన్‌ను ముట్టడించేందుకు ఐక్య వేదిక సన్నద్ధమైంది. టీచర్ల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నందున ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రకటించింది. కాగా, మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ కోసం ఐక్య వేదిక ఆధ్వర్యంలో టీచర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా డీఈవో కార్యాలయాల వద్ద నిరాహార దీక్షలు చేశారు. అయితే మాన్యువల్‌ కౌన్సెలింగ్‌తో బదిలీల ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. షెడ్యూలు ప్రకారం ఈనెల 12 నాటికి టీచర్ల బదిలీల ప్రక్రియ పూర్తికావాలి. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ వెబ్‌ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేసింది. మాన్యువల్‌ కౌన్సెలింగ్‌లో టీచర్లు ప్రత్యక్షంగా హాజరై బదిలీ స్థానాలు ఎంపిక చేసుకోవాలి. దీనిని స్లాట్ల వారీగా నిర్వహిస్తారు. ఈ ప్రక్రియతో బదిలీలు ఆలస్యమవుతాయి.

Updated Date - Jun 10 , 2025 | 03:43 AM