Severe Rains Cause Floods: పిడుగుపాటుకు ఐదుగురు మృతి
ABN , Publish Date - Sep 14 , 2025 | 03:08 AM
అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు కోస్తా ప్రాంతంలో బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి....
కొండవాగులో కొట్టుకుపోయిన ఇద్దరు మహిళలు
కోస్తాలో వర్ష బీభత్సం.. పలు జిల్లాల్లో కుండపోత
గుంటూరు, ఏలూరు నగరాల్లో రోడ్లపైనే ప్రవాహాలు
సెల్లార్లు, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద
ఏజెన్సీలో పొంగి ప్రవహించిన కొండవాగులు
గోదావరికి మళ్లీ పెరుగుతున్న వరద
నేడూ కోస్తాలో భారీ వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు కోస్తా ప్రాంతంలో బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో వాన విరుచుకుపడింది. పలుచోట్ల పిడుగులు పడటంతో ఈ రెండు జిల్లాల్లో కలిపి ఐదుగురు మరణించారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో దాసరి సారమ్మ(39), దాసరి రాణి(41), పెదనందిపాడు మండలం అనపర్రులో దేవరపల్లి సామ్రాజ్యం(61), తన్నీరు నాగమ్మ(41), పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన దాసుపాటి వెంకటేశ్వర్లు(63) పిడుగుపాటుకు దుర్మరణం చెందారు. సుమారు రెండు గంటలకు పైగా కుండపోతగా కురిసిన వర్షంతో గుంటూరు నగరంలోని రోడ్లన్నీ ఏరులై ప్రవహించాయి. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అపార్టుమెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల సెల్లార్లలోకి భారీగా నీరు చేరింది. సెల్లార్లు, రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు నీటిలో మునిగిపోవడంతో అవి మొరాయించాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏలూరు జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కుండపోతగా వర్షాలు కురవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలూరు నగరంలో రహదారులపై ఉధృతంగా వర్షం నీరు ప్రవహించడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. తమ్మిలేరు, ఎర్రకాలువ, వేలేరుపాడులో పెదవాగుకు వరద పోటెత్తింది. నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు ప్రాజెక్టు నుంచి 2 వేలు క్యూసెక్కులు, కొంగువారిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టు నుంచి 1550 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతం చెన్నాపురం వద్ద కొండవాగులు దాటుతూ ఇద్దరు మహిళలు కొట్టుకుపోయారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పూచికపాడు గ్రామానికి చెందిన ఏడుగురు మహిళలు తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం చెన్నాపురానికి చెందిన పామాయిల్ తోటలో శనివారం పనికి వెళ్లారు. వారంతా పని ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో చెన్నాపురం వద్ద కొండవాగు దాటుతూ పాలడుగుల చెన్నమ్మ(50), పచ్చిపాల వరలక్ష్మి(50) గల్లంతయ్యారు. రాత్రి వరకు ఆ ఇద్దరి ఆచూకీ తెలియలేదు. ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాల్ని సిద్ధం చేసినట్టు జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు చెప్పారు. జీలుగుమిల్లి మండలం రాచన్నగూడెం సమీపంలోని చిన్నవాగు ఉధృతంగా ప్రవహించడంతో సీఐతోపాటు ఎస్‌ఐ కాంత్రికుమార్ సిబ్బంది చిన్నవాగు వద్దే ఆగి పోవాల్సి వచ్చింది.
ఎక్కడ ఎంత వానంటే..
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి, ఏలూరు జిల్లా లింగపాలెంలలో 8.7, ద్వారకాతిరుమలలో 7.6, గుంటూరు జిల్లా పెదకాకానిలో 7.7, సత్తెనపల్లిలో 7.5, వల్లభాపురంలో 7.4, గుంటూరు నగరంలో 7.2, కృష్ణా జిల్లా నూజివీడులో 7.1, తోటవల్లూరులో 7.0, ప్రకాశం జిల్లా దర్శిలో 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 47 ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లపైగా వాన పండింది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు, కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఆదివారం కోస్తాలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబటి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.


అనూహ్యంగా పెరిగిన గోదావరి
భారీ వర్షాలకు గోదావరి ఉప నదులు శబరి, సీలేరు, మంజీర, ప్రవర, ఇంద్రావతి పొంగి గోదావరిలో కలుస్తున్నాయి. దీంతో శనివారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం అనూహ్యంగా పెరిగింది. పోలవరం నుంచి 4,35,010 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. పోలవరం స్పిల్వే ఎగువన 29.700, దిగువన 20.300, భద్రాచలం వద్ద 31.20 అడుగులకు నీటిమట్టం చేరింది.