Heavy Rain: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం
ABN , Publish Date - Oct 22 , 2025 | 04:36 AM
నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం ఉద యం అల్పపీడనం ఏర్పడి మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది బుధవారం వాయుగుండంగా బలపడనుంది.
నేడు వాయుగుండంగా మారే అవకాశం
తీవ్ర వాయుగుండం, తుఫాన్‌గానూ మారే చాన్స్
24, 25 తేదీల్లో మరో అల్పపీడనం
వారం రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
నైరుతి బంగాళాఖాతంలో మంగళవారం ఉద యం అల్పపీడనం ఏర్పడి మధ్యాహ్నానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది బుధవారం వాయుగుండంగా బలపడనుంది. వాయుగుండం ఎక్కడ తీరం దాటుతుందో వాతావరణ శాఖ వెల్లడించలేదు. కానీ, వాయుగుండం దక్షిణ కోస్తాంధ్ర తీరం దిశగా పయనించే క్రమంలో తీవ్ర వాయుగుండంగా లేదా తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు అంచనా వేశారు. గురువారం రాత్రి లేదా శుక్రవారంలోగా మచిలీపట్నం-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తీవ్ర అల్పపీడన ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వర్షాలు కురిశాయి. బుధవారం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని అల్పపీడనం సోమవారం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇదిలావుండగా ఈనెల 24 లేదా 25న దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది బలపడి వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరం దిశగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.
వరుస అల్పపీడనాలతో తమిళనాడు, కోస్తాంధ్ర, సీమల్లో వచ్చే వారం రోజులు వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఇంకా వచ్చే నెల తొలివారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. కాగా, రానున్న ఐదు రోజులు రాష్ట్రవ్యాప్తంగా పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. బుధవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వివరించింది.
నెల్లూరు రోడ్లపై మోకాళ్లలోతు నీరు..
ఆరు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో నెల్లూరు జిల్లాలో జనజీవనం అతలాకుతలమైంది. నగరంలోని ఏ వీధిలో చూసినా మోకాళ్ల లోతు నీరు నిలబడింది. చేజర్ల, ఆత్మకూరు, అనంతసాగరం మండలాల్లో వరిపైరు నీటి మునిగింది. సోమశిల, కండలే రు జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. కలెక్టర్ హిమాన్షుశుక్లా ఆదేశాలతో బుధవారం జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
తిరుమలలో జోరువాన.. తిరుమలలో మంగళవారం జోరుగా వాన కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధులు, రోడ్లు, కాటేజీ ప్రాంతాలు తడిసిముద్దయ్యాయి. తిరుమలలో చలితీవ్రత కూడా పెరగడంతో పుష్కరిణిలో స్నానం చేసేవారి సంఖ్య తగ్గింది. అప్పుడప్పుడు దట్టమైన పొగమంచు తిరుమలను కమ్మేస్తోంది.