Constitutional Bodies: కమిషన్లు ఖాళీ
ABN , Publish Date - Dec 14 , 2025 | 04:26 AM
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కీలకమైన కమిషన్లకు చైర్మన్లు, సభ్యుల నియామకంలోనూ ఎడతెగని జాప్యం చేస్తోంది.
రాజ్యాంగబద్ధ పదవుల భర్తీ ఎప్పుడు?
చైర్మన్లు, కమిషనర్లు లేక సంస్థల వెలవెల
రెండేళ్లుగా ఏపీఈఆర్సీ, ఏపీహెచ్‌ఆర్సీ ఖాళీ
ఆర్టీఐ, ఏపీపీఎస్సీ, లోకాయుక్త, బీసీ కమిషన్
వంటి అనేక సంస్థలు కూడా అదే బాటలో
హైకోర్టు ప్రశ్నించినా పట్టించుకోని ప్రభుత్వం
సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచిపోతోంది. కానీ, రాజ్యాంగ బద్ధ పదవుల భర్తీపై ఇంత వరకూ దృష్టి సారించలేదు. సమాచార, మానవహక్కుల కమిషన్, విద్యుత్ నియంత్రణ మండలి వంటి కీలక సంస్థలు అధిపతులు లేక అచేతనంగా ఉంటున్నాయి. వీటిలో కొన్ని పదవులు కూటమి అధికారంలోకి వచ్చే నాటికే ఖాళీగా ఉండగా మరికొన్ని ఆ తర్వాత ఖాళీ అయ్యాయి. ఎప్పటికప్పుడు వీటిని భర్తీ చేసుకుంటూ వచ్చినా కూటమి అధికారంలో ఉండే ఐదేళ్లలో రెండు విడతలుగా ఈ పదవులను భర్తీ చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ, ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించడం లేదు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా కీలకమైన కమిషన్లకు చైర్మన్లు, సభ్యుల నియామకంలోనూ ఎడతెగని జాప్యం చేస్తోంది. దీంతో అటు న్యాయపరంగా కూడా చిక్కులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి నామినేటెడ్ పదవుల భర్తీవిషయంలో ఎడతెగని జాప్యం చేసిన ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత తొలి జాబితా విడుదల చేసింది. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. అయితే, కీలకమైన రాజ్యాంగ బద్ధ పదవుల భర్తీ విషయంలో మాత్రం ఇంకా చర్యలు తీసుకోలేదు. కీలక పోస్టుల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటోందని ఈ ఏడాది సెప్టెంబరులో హైకోర్టు కూడా ప్రశ్నించింది. రాజ్యాంగ బద్ధ పదవుల భర్తీని ఎప్పటిలోగా చేపడతారో తెలియజేయాలని ఆదేశించింది. ఇది జరిగి మూడు నెలలు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నామినేటెడ్ పదవుల మాదిరి రాజ్యాంగ బద్ధ పదవులకు కుల సమీకరణాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. అర్హత, విధేయతను ప్రామాణికంగా తీసుకుంటే సరిపోతుంది. అయినా.. వీటి భర్తీలో జాప్యం జరుగుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలోనూ ఇదే తీరు..
టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారీ నామినేటెడ్ పదవులు.. రాజ్యాంగబద్ధ పదవుల భర్తీపై పెద్దగా దృష్టి సారించడం లేదన్న వాదన ఉంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నామినేటెడ్, రాజ్యాంగ బద్ధ పదవుల భర్తీలో జాప్యం చేస్తూ వచ్చారు. ఓ వైపు రాష్ట్ర విభజన మరో వైపు రెవెన్యూ లోటు వంటి సమస్యలతో రాష్ట్రంపై ఆర్థికంగా భారంపడే అవకాశం ఉందని భావించి అప్పట్లో వీటి భర్తీ విషయంలో జాప్యం చేశారన్న ప్రచారం జరిగింది.
లేనివి కూడా సృష్టించి!
2019లో వచ్చిన జగన్ సర్కార్ ఎడాపెడా నామినేటెడ్, రాజ్యాంగ బద్ధ పదవులు భర్తీ చేసింది. అంతేకాదు కొత్తగా పదుల సంఖ్యలో కార్పొరేషన్లను సృష్టించి మరీ పదవుల పందేరం చేసింది. కార్పొరేషన్ల చైర్మన్లకు కార్యాలయాలు, కుర్చీలు లేకపోయినా వారి జీతాల విషయంలో మాత్రం ఉదారత కనబరిచింది.
తక్షణం భర్తీ చేయాల్సినవి ఇవీ..
రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్ పదవి 2024, ఫిబ్రవరి నుంచే ఖాళీగా ఉంది. ఈ కమిషన్‌లో చైర్మన్‌తోపాటు నలుగురు సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. వినియోగదారుల సమస్యల పరిష్కారంలో కమిషన్ పాత్ర కీలకంగా ఉంటుంది. అలాంటి పదవిని సుమారు రెండేళ్లు నుంచి ఖాళీగా ఉంచారు.
ఏపీ సమాచార హక్కు కమిషన్(ఆర్‌టీఐ)లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌తోపాటు 10 మంది వరకు కమిషనర్లను నియమించుకునే వెసులుబాటు ఉంది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పదవీకాలం ఈ ఏడాది అక్టోబరుతో పూర్తయింది. ప్రస్తుతం కేవలం ముగ్గురు కమిషనర్లు మాత్రమే ఉన్నారు. దీంతో అప్పీళ్ల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎ్‌ససీ)లో చైర్మన్ పదవి ఈ ఏడాది అక్టోబరులో ఖాళీ అయింది. మొత్తం 9 మంది సభ్యులకుగాను 3 పోస్టులు ఏడాదిగా ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల ప్రక్రియపై కమిషన్‌లోని ఖాళీలు ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఏపీ హెచ్‌ఆర్సీ(మానవహక్కుల కమిషన్) చైర్మన్ పదవి 2024, మార్చి నుంచి ఖాళీగా ఉంది.
ఏపీ ఈఆర్సీ(విద్యుత్తు నియంత్రణ) చైర్మన్ పదవి 2024, అక్టోబరు నుంచి ఖాళీగా ఉంది.
ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పదవి ఇటీవలే ఖాళీ అయింది.
ఏపీ వక్ఫ్, ఎండోమెంట్ ట్రైబ్యునళ్లు ఏడాదికిపైగా ఖాళీగా ఉన్నాయి.
ఏపీ లోకాయుక్త.. 2024, సెప్టెంబరు నుంచి ఖాళీగా ఉంది.
బాలల హక్కుల కమిషన్, బీసీ కమిషన్ వంటి పలు రాజ్యాంగబద్ధ సంస్థలకు చైర్మన్ల నియామకం జరగాల్సి ఉంది.