జిల్లా ఆర్థికాభివృద్ధికి సప్తపది!
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:27 AM
జిల్లా ఆర్థికాభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ‘సప్త పది’ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలను విస్తరించేందుకు వీలుగా పలు ప్రాజెక్టులు, కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వీటిలో నిధుల అవసరం ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి త్వరలో జరగబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంతి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోనుంది. ఆర్థికేతర అంశాలపై జిల్లా స్థాయిలో ఈ ఏడాది రెండో అర్ధ సంవత్సరం నాటికే తదనుగుణంగా చర్యలు తీసుకోనుంది. నియోజకవర్గాల వారీగా ప్రతిపాదించిన ప్రాజెక్టులు, కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
- ఏడు నియోజకవర్గాల పరిధిలో వృద్ధి పెంపునకు శ్రీకారం
- విస్తృతంగా ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదన
- విజయవాడ సెంట్రల్ హనుమాన్‌పేటలో ఫుట్‌వేర్ క్లస్టర్
- విస్సన్నపేటలో పిట్టలవారిగూడె ం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్
- మూలపాడులోని బటర్ ఫ్లై పార్క్‌లో ఐకానిక్ బ్రిడ్జి, జంగిల్ సఫారీ
- ఇబ్రహీంపట్నంలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన
- నందిగామలో 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు
- బెంజిసర్కిల్, ఎన్టీఆర్ సెంటర్, హెల్త్ యూనివర్సిటీల దగ్గర ఫుడ్ కోర్టుల ఏర్పాటు
- చిల్లకల్లులో డ్వాక్రా మహిళా మార్ట్ ఏర్పాటుకు ప్రతిపాదన
జిల్లా ఆర్థికాభివృద్ధిని మరింతగా పరుగులు పెట్టించేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. ‘సప్త పది’ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలను విస్తరించేందుకు వీలుగా పలు ప్రాజెక్టులు, కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వీటిలో నిధుల అవసరం ఉన్న ప్రాజెక్టులకు సంబంధించి త్వరలో జరగబోయే కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంతి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఆమోదం పొందే విధంగా చర్యలు తీసుకోనుంది. ఆర్థికేతర అంశాలపై జిల్లా స్థాయిలో ఈ ఏడాది రెండో అర్ధ సంవత్సరం నాటికే తదనుగుణంగా చర్యలు తీసుకోనుంది. నియోజకవర్గాల వారీగా ప్రతిపాదించిన ప్రాజెక్టులు, కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
-(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
తిరువూరు నియోజకవర్గంలో :
- విస్సన్నపేటలో పిట్టలవారిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ప్రతిపాదించారు. ఈ స్కీమ్ ద్వారా మొత్తం 16 వేల ఎకరాల ఆయకట్టులో సాగు పెరుగుతుంది. 7,241 మంది రైతులకు ఈ పథకం వరదాయినిగా మారుతుంది. ఈ పథకం ద్వారా రూ.32 కోట్ల జీవీఏను జోడించటానికి దోహదపడుతుంది.
- పెడన- లక్ష్మీపురం వరకు హైవే రెస్టారెంట్లు, రెస్టింగ్ పాయింట్లు ఏర్పాటు వల్ల ఆతిథ్య రంగంలో వృద్ధి పెరుగుతుంది.
- తిరువూరులో ఐటీఐ కాలేజీకి ప్రతిపాదించారు. ఐటీ ఐ కాలేజీ ద్వారా ఉపాధి అవకాశాలను పెంపొందించేలా రూపకల్పన చేశారు. ప్రాక్టికల్ శిక్షణలు ఇవ్వటంతో పాటు వ్యాపారవేత్తలుగా ప్రమోట్ చేసేందుకు ఐటీఐ తప్పనిసరిగా నిర్ణయించారు.
- తిరువూరులో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదించారు. చిన్నారులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించటంతో పాటు సాంఘిక సమానత్వం పెంపొందించే ప్రయత్నం చేయనున్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో :
- విద్యాధరపురంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇక్కడ జిల్లా, రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు నిర్వహించటం ద్వారా క్రీడా సంస్కృతిని పెంచవచ్చు. దీనికి తోడు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయి.
- పశ్చిమ నియోజకవర్గంలో మంచినీటి సరఫరా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. సురక్షిత నీటిని అందించటం ద్వారా ప్రజలు రోగాల బారిన పడకుండా చూస్తారు. తద్వారా వైద్య ఖర్చులను నివారిస్తారు.
-పశ్చిమ నియోజకవర్గంలో టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. తద్వారా కనకదుర్గమ్మ ఆలయం, భవానీ ద్వీపం, హరిత బెర్మ్ పార్క్‌లకు ఆదరణ మరింత పెరుగుతుంది. ఫలితంగా లోకల్ బిజినెస్, సేవా రంగాలు విస్తృతమవుతాయి.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో :
-వాంబే కాలనీలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలో వ్యాపారాభివృద్ధికి దోహదపడటంతో పాటు ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి వంటివి జరుగుతాయని అంచనా వేస్తున్నారు.
- హనుమాన్‌పేటలో ఫుట్‌వేర్ క్లస్టర్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇక్కడ బూట్లు, చెప్పులు వంటి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించవచ్చు. భారీ అమ్మకాలు జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపార టర్నోవర్‌ను పెంచటంతో పాటు సర్వీసు చార్జీలు, టాక్స్ రెవెన్యూస్ ద్వారా గణనీయంగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.
-ఎంజీ రోడ్డు (బందరు రోడ్డు) వెంబడి ఉన్న అంబేడ్కర్ స్మృతివనంలో ఫుడ్‌కోర్టు, స్థానిక హస్తకళల ప్రదర్శనలు, పబ్లిక్ ఈవెంట్స్, ఎగ్జిబిషన్స్, లే జర్ షో వంటి కార్యక్రమాల ద్వారా పర్యాటకాన్ని మరింత పెంపొందింపజేయాలని నిర్ణయించారు.
మైలవరం నియోజకవర్గంలో :
- మూలపాడులోని బటర్ ఫ్లై పార్క్‌లో ఐకానిక్ బ్రిడ్జి, జంగిల్ సఫారీలను ఏర్పాటు చేయటం ద్వారా ఎకో టూరిజం, వైల్డ్‌లైఫ్ ఎడ్యుకేషన్ కల్పించవచ్చని భావిస్తున్నారు.
- పవిత్ర సంగమం ఘాట్ దగ్గర రివర్‌ఫ్రంట్ టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రిక్రియేషన్, కల్చరల్ ఈవెంట్ల నిర్వహణ ద్వారా స్థానికంగా ఆర్థికాభివృద్ధికి కృషి చేయనున్నారు.
- కొండపల్లిలో కొండపల్లి కోట, టాయ్ ఇండస్ర్టీ, ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లు మరింత ప్రజాదరణ చూరగొనేలా చర్యలు చేపట్టడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించనున్నారు.
- మైలవరం నియోజకవర్గంలో స్థానిక యువతకు ఔత్సాహిక పారిశ్రామివేత్తలు అవకాశం కల్పించేందుకు ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ప్రతిపాదించారు.
- ఇబ్రహీంపట్నంలో ఐటీ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. స్థానిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం ద్వారా పెట్టుబడుల సమీకరణతో పాటు ఉపాధి అవకాశాలు పెంచనున్నారు.
- రెడ్డిగూడెంలో పామాయిల్ సాగును మరింత విస్తరించటంతో పాటు ఇదే ప్రాంతంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదించారు.
నందిగామ నియోకవర్గంలో :
- నందిగామకు అమరావతి నూతన రైల్వే ప్రాజెక్టు ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా జరగనుంది. పరిటాల కార్గో హబ్‌గా మారనుంది. దీని ద్వారా పెట్టుబడుల సమీకరణతో పాటు, ఉద్యోగాల కల్పన జరుగుతుంది.
- పెద్దవరంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు ద్వారా పారిశ్రామిక మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పించ వచ్చు.
- నందిగామలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదించారు. స్థానికంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడటం ద్వారా సంపద వృద్ధికి దోహదపడుతుంది.
- పల్లగిరిలో ఐటీఐ కాలేజీ ఏర్పాటుకు ప్రతిసాదించారు. స్థానిక యువతకు శిక్షణ, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే అవకాశం ఏర్పడనుంది.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో :
- చిల్లకల్లులో డ్వాక్రా మహిళా మార్ట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. మహిళా సాధికారత దిశగా ప్రయత్నం జరగనుంది.
- జగ్గయ్యపేటలో ఎన్‌ఎండీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ప్రతిపాదన.
- ముక్తేశ్వరపురం దగ్గర ముక్త్యాల - అచ్చంపేట కృష్ణా బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన. రాజధాని అమరావతితో అనుసంధానం తద్వారా పర్యాటకంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
- వేదాద్రిలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదన.
- వేదాద్రి, ముక్త్యాల, పెనుగంచిప్రోలు, తిరుమలగిరిలను కలుపుతూ టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదన.
- ముక్తేశ్వరపురం దగ్గర అలకనంద రిసార్ట్, రివర్ ఫ్రంట్ టూరిజం ఏర్పాటు ద్వారా పర్యాటకాభివృద్ధికి దోహదం.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో :
- బెంజిసర్కిల్, ఎన్టీఆర్ సెంటర్, హెల్త్ యూనివర్సిటీల దగ్గర ఫుడ్ కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదన. ఒక్కో చోట 50 ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు ద్వారా ఆదాయం సాధించే అవకాశం ఉంది.
- కొత్త జీజీహెచ్‌లో పారామెడికల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు.
- పాలిటెక్నిక్ కాలేజీలో సీఎస్‌ఆర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన.