హత్య కేసులో ఏడుగురికి జీవితఖైదు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:50 AM
హత్య కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి గురువారం తీర్పు చెప్పారు.
-మచిలీపట్నం మండలం బుద్దాలపాలెం కేసులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సంచలన తీర్పు
మచిలీపట్నం, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): హత్య కేసులో నిందితులపై నేరం రుజువు కావడంతో ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.గోపి గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2006లో సంభవించిన భారీ వర్షాల కారణంగా మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో రైతులు పంటలు కోల్పోయారు. కొందరి గృహాలు కూలిపోయాయి. ఆ సమయంలో ఒక స్వచ్ఛంద సంస్థ గ్రామస్థులకు సాయం చేసేందుకు కూపన్లు అందజేసింది. సాయం అందుకునే సమయంలో గ్రామస్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనపై అప్పట్లో ఇరువర్గాలపై మచిలీపట్నం తాలూకా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాడనే కారణంతో కాగిత రామ్మోహనరావు(26)పై అదే గ్రామానికి చెందిన శొంఠి వీరబాబు, శొంఠి పెదపైడేశ్వరరావు, బొర్రా శ్రీనివాసరావు, బొర్రా స్వామికృష్ణ, కాగిత సోమయ్య, శొంఠి వీరవెంకటేశ్వరరావు, శొంఠి వీరాంజనేయులు, శొంఠి ముసలయ్య, కాగిత ఆంజనేయులు కక్ష పెంచుకున్నారు. ఈ కేసు 2013 ఫిబ్రవరి 28వ తేదీన విచారణకు వచ్చిన సమయంలో కాగిత రామ్మోహనరావు కోర్టులో తన సాక్ష్యం చెప్పాడు. అదేరోజు రాత్రి గ్రామంలో కాపుకాసిన ఈ తొమ్మిది మంది నిందితులు కాగిత రామ్మోహనరావుపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి సోదరుడు కాగిత రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడిగా ఉన్న శొంఠి వీరబాబు, 9వ నిందితుడిగా ఉన్న కాగిత ఆంజనేయులు కేసు విచారణలో ఉండగానే మరణించారు. ఈ కేసులో తొమ్మిది మంది సాక్షులను విచారించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.