Peddareddy in High Court: పెద్దారెడ్డికి హైకోర్టులో చుక్కెదురు
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:36 AM
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లి నివసించడానికి తగిన భద్రత కల్పించాలని ..
సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెన్షన్
ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లి నివసించడానికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సస్పెండ్ చేసింది. ప్రధాన పిటిషన్‌లో జారీ చేసిన ఉత్తర్వులకు మించి కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో సింగిల్ జడ్జి ఆదేశాలిచ్చారన్న సీనియర్ న్యాయవాది వాదనతో ప్రాథమికంగా సంతృప్తి చెందినట్లు పేర్కొంది. పెద్దారెడ్డికి నోటీసులు జారీ చేసింది. అప్పీల్‌పై విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లేందుకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు అమలు చేయడం లేదని పేర్కొంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన సింగిల్ జడ్జి... ఈ నెల 18న పెద్దారెడ్డి తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లి నివాసం ఉండేందుకు తగిన భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అనంతపురం జిల్లా ఎస్పీ ధర్మాసనం ముందు లెటర్ పేటెంట్ అప్పీల్ వేశారు. ఈ అప్పీల్ బుధవారం విచారణకు రాగా ఎస్పీ జగదీశ్ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కోర్టుధిక్కరణ వ్యాజ్యంలో నిర్దిష్ట తేదీని నిర్ణయించి ఉత్తర్వులు అమలు చేయాలని సింగిల్ జడ్జి ఆదేశించడంపైనే తమ అభ్యంతరమని తెలిపారు. పెద్దారెడ్డి పిటిషన్‌లో ఇచ్చిన ఉత్తర్వులకు మించి సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయమూర్తి ప్రాథమిక నిర్ధారణకు వస్తే సంబంధిత అధికారికి శిక్ష విధించవచ్చని, అంతకుమించి ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. కేతిరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి సరైన ఉత్తర్వులే ఇచ్చారని అన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో కోర్టు అధికార పరిధి ఏమిటి? ఉత్తర్వులు అమలు చేయకుండా ఉల్లంఘనకు పాల్పడ్డారని నిర్ధారణకు వస్తే సంబంధిత అధికారికి నోటీసులు జారీ చేయాలి. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు శిక్ష విధించకూడదో వివరణ కోరాలి. ఆ తర్వాత శిక్ష విధించాలి. లేదా అధికారులు ఆదేశాలు అమలు చేశారని సంతృప్తి చెందితే ధిక్కరణ పిటిషన్‌ను కొట్టివేయాలి. కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో తదుపరి ఉత్తర్వులు ఏమైనా జారీ చేయవచ్చా’? అని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై వాదనలు వినిపించాలని కోరింది. పొన్నవోలు బదులిస్తూ... సింగిల్ జడ్జి ఎలాంటి తదుపరి ఉత్తర్వులు ఇవ్వలేదని తెలిపారు. రిట్ పిటిషన్‌లో ఉత్తర్వులను కోర్టు ధిక్కరణ వ్యాజ్యంలో ప్రస్తావించారని ఆయన చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి ఆదేశాలను సస్పెండ్ చేసింది.