Share News

సేవలు అంతంత మాత్రమే

ABN , Publish Date - Dec 16 , 2025 | 11:57 PM

మండల కేంద్రంలో ప్రధాన ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స సేవలు అంతంత మాత్రమేనని పలువురు ఆరోపిస్తున్నారు.

 సేవలు అంతంత మాత్రమే
సుండిపెంట ప్రభుత్వ ఆరోగ్యకేంద్రం

అత్యవసరానికి

అందుబాటులో లేని 108 వాహనం

100 కిలోమీటర్లకే

పరిమిత అంటున్న సిబ్బంది

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

శ్రీశైలం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ప్రధాన ప్రభుత్వాస్పత్రిలో అంబులెన్స సేవలు అంతంత మాత్రమేనని పలువురు ఆరోపిస్తున్నారు. అత్యవసర వైద్యం కోసం వస్తున్న రోగులకు ప్రాథమిక చికిత్స తరువాత మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లేందుకు తగిన 108 వంటి అంబులెన్స సదుపాయం లేక నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం వదులుకున్న సంఘటనలు ఉన్నాయి. పగలు రాత్రి అనే తేడా అత్యవసర సమయంలో వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు వాహనాలు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. గోల్డెన అవర్‌ కాస్త గడిచిపోవడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కర్నూలు, విజయవాడ లేదా హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లడం కష్టసాధ్యమవుతుందని పలువురు బాధితులు గోడును వెల్లబుచ్చుకుంటున్నారు.

దోర్నాల, మార్కాపురం ప్రాంతంలోని..

ప్రస్తుతం ఉన్న 108అంబులెన్స కేవలం దోర్నాల, మార్కాపురం ప్రాంతంలోని వైద్యశాలల వరకు మాత్రమే వెళ్లేందుకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయని సిబ్బంది బదులివ్వడం శోచనీయమని అంటున్నారు. ఎంతటి అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా దూర ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ఆధునిక సదుపాయాలు కలిగిన వైద్యశాలకు తీసుకువెళ్లేందుకు నిరాకరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 100 కిలోమీటర్లే పరిమిత అని చెబుతున్నారు. శ్రీశైల మండల ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించి అత్యవసర సమయాల్లో కర్నూలు లేదా హైదరాబాద్‌ వరకు వెళ్లేందుకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక అంబులెన్సను ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

Updated Date - Dec 16 , 2025 | 11:57 PM