Share News

వెస్ట్‌ బైపాస్‌కు సర్వీసు రోడ్లు!

ABN , Publish Date - Dec 18 , 2025 | 01:12 AM

పశ్చిమ బైపాస్‌ సర్వీసు రోడ్ల ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయింది. ప్యాకేజీ-3లో చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు సర్వీసు రోడ్లను మంజూరు చేయాల్సిందిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ (మోర్త్‌)ను బుధవారం ఢిల్లీలో కోరారు. బైపాస్‌ దాదాపుగా పూర్తి కావడంతో సర్వీసు రోడ్ల పనులను అదనంగా చేపట్టడానికి మోర్త్‌ కూడా సానుకూలంగా స్పందించింది.

వెస్ట్‌ బైపాస్‌కు సర్వీసు రోడ్లు!

- చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు రెండు వైపులా..

- 32 కిలోమీటర్ల మేర ఏర్పాటుకు అవకాశం

- మోర్త్‌కు ప్రతిపాదించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని

- సానుకూలంగా స్పందించిన మోర్త్‌

- భూములిస్తామని ముందుకు వచ్చిన రైతులు

-వెస్ట్‌ బైపాస్‌తో ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ ఇవ్వాలని సీఎం సూచన

- తెర మీదకు రామవరప్పాడు - కేసరపల్లి 100 అడుగుల రోడ్డు

పశ్చిమ బైపాస్‌ సర్వీసు రోడ్ల ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌ అయింది. ప్యాకేజీ-3లో చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు సర్వీసు రోడ్లను మంజూరు చేయాల్సిందిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ (మోర్త్‌)ను బుధవారం ఢిల్లీలో కోరారు. బైపాస్‌ దాదాపుగా పూర్తి కావడంతో సర్వీసు రోడ్ల పనులను అదనంగా చేపట్టడానికి మోర్త్‌ కూడా సానుకూలంగా స్పందించింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడ పశ్చిమ బైపాస్‌ ఎన్‌హెచ్‌-16గా మారనున్న నేపథ్యంలో మోర్త్‌ కూడా ఎంపీ చిన్ని ప్రతిపాదనను సానుకూలంగా తీసుకుంది. దీంతో సర్వీసు రోడ్లకు గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్టు అయింది. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 32 కిలోమీటర్ల దూరం ఉంది. రెండు వైపులా సర్వీసు రోడ్లకు ఎంపీ ప్రతిపాదించారు. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌కు సర్వీసు రోడ్లు లేకపోవటంతో అలైన్‌మెంట్‌ వెంబడి ఉన్న గ్రామాల ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సర్వీసు రోడ్లను ఏర్పాటు చేయగలిగితే తాము తేలిగ్గా బైపాస్‌తో అనుసంధానం కాగలమని తెలిపారు. దీనికి తోడు బైపాస్‌ వెంబడి ఉన్న ఎంఎస్‌ఎంఈ యూనిట్ల నిర్వాహకులు కూడా సర్వీసు రోడ్లను ప్రతిపాదించారు.

భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధం

ముఖ్యంగా బైపాస్‌ వెంబడి పంట పొలాలు కలిగిన రైతులు సర్వీసు రోడ్లకు డిమాండ్‌ చేస్తున్నారు. సర్వీసు రోడ్ల కోసం తమ భూములను ఇస్తామని కూడా ముందుకు వచ్చారు. సర్వీసు రోడ్లు లేకపోవటం వల్ల పొలాల్లో పండించుకున్న పంటలను బైపాస్‌ మార్గంలోకి మళ్లించటానికి రైతులకు అవకాశం లేకుండాపోతోంది. అదే సర్వీసు రోడ్డు ఉంటే పొలాల్లోకి వాహనాలలో చేరుకోవటానికి అవకాశం ఉంటుంది. పొలాలు దున్నటానికి ట్రాక్టర్లు రావటానికి, పంట దిగుబడి వచ్చాక కోతలు కోశాక ధాన్యాన్ని బయటకు తరలించటానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు సర్వీసు రోడ్డుకు డిమాండ్‌ చేశారు. తమ భూములు ఇస్తామని సర్వీసు రోడ్లు వేయమని ప్రాధేయపడ్డారు. రైతుల నుంచి వస్తున్న డిమాండ్లను కూడా దృష్టిలో పెట్టుకుని ఎంపీ చిన్ని మోర్త్‌ను కలిశారు.

100 అడుగుల రోడ్డు ప్రతిపాదన మళ్లీ తెరపైకి..

రామవరప్పాడు నుంచి కేసరపల్లి వరకు ఎన్‌హెచ్‌-16కు సమాంతరంగా 100 అడుగుల రోడ్డును అభివృద్ధి చేసేందుకు అడుగు ముందుకు పడింది. ఏడాది కిందటే ఈ ప్రతిపాదనను ఎంపీ కేశినేని చిన్ని తీసుకువచ్చారు. అప్పట్లో కాంతిలాల్‌ దండేను తీసుకు వచ్చి ఈ ప్రత్యామ్నాయ 100 అడుగుల రోడ్డు అవసరం గురించి చెప్పారు. కానీ, అప్పట్లో ఈ రోడ్డు పట్టాలెక్కలేదు. ఇటీవల సీఎం చంద్రబాబు విజయవాడ బైపాస్‌ నుంచి ఎయిర్‌పోర్టుకు నేరుగా అనుసంధానం చేసేలా రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించటంతో మళ్లీ కదలిక వచ్చింది. ఇదే సందర్భంలో గతంలో ఎంపీ కేశినేని చిన్ని ప్రతిపాదించిన రామవరప్పాడు-కేసరపల్లి 100 అడుగుల రోడ్డును కూడా అనుసంధానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మహానాడు జంక్షన్‌ నుంచి నిడమానూరు జంక్షన్‌ వరకు మహానాడు ఫ్లైఓవర్‌ గతంలో మంజూరైంది. దీనిని నిర్మించే సమయంలో ట్రాఫిక్‌ సమస్యలు రాకుండా ఉండాలంటే.. ప్రత్యామ్నాయంగా 100 అడుగుల రోడ్డు అవసరమని ఆయన భావించారు. ఇది కార్యరూపంలోకి రాలేదు. వెదరుపావులూరు నుంచి ముస్తాబాద వెళ్లే రోడ్డు ఉంది. ఈ రోడ్డును రామవరప్పాడు వరకు పంట పొలాల మీదుగా సరళరేఖలా 100 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించారు. ముస్తాబాద నుంచి జక్కులనెక్కలం మీదుగా కేసరపల్లిలో ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఎన్‌హెచ్‌ - 16కు అనుసంధానించాలని ప్రతిపాదించారు. దీనిని తాజాగా చంద్రబాబు ఆదేశాల మేరకు విజయవాడ వెస్ట్‌ బైపాస్‌కు కూడా అనుసంఽధానించగలిగితే.. అమరావతి నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి జక్కులనెక్కలం మీదుగా చేరుకోవచ్చు. అమరావతి నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చేవాళ్లు చిన్న అవుటపల్లి వెళ్లి వెనక్కు రావాల్సిన అవసరం లేకుండా.. నేరుగా వచ్చేయవచ్చు. ఈ ప్రతిపాదనను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు త్వరగా ముందుకు తీసుకువెళితే గన్నవరం నియోజకవర్గానికి కూడా మంచి అభివృద్ధి జరుగుతుంది.

గొల్లపూడి దగ్గర క్లిప్‌ హ్యాంగర్‌కు ప్రతిపాదన

హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలో ఎన్‌హెచ్‌ - 65 మీదుగా వెళుతున్న విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ ప్రాంతంలో క్లిప్‌ హ్యాంగర్‌ ఏర్పాటుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మరో ప్రతిపాదన చేశారు. ఈ క్లిప్‌ హ్యాంగర్‌ను హైదరాబాద్‌ - విజయవాడ డీపీఆర్‌లో భాగంగా చేర్చాలని కూడా కోరారు. రెండు అంతకంటే ఎక్కువ రహదారులు కలిసే చోట ట్రాఫిక్‌ ఒక రోడ్డు మీద నుంచి మరో రోడ్డుకు ఆటంకం లేకుండా సజావుగా రాకపోకలు సాగించేలా నిర్మాణం చేయటాన్నే క్లిప్‌ హ్యాంగర్‌ అంటారు. ఒక రకంగా దీనిని హాఫ్‌ క్లోవర్‌ లీఫ్‌ జంక్షన్‌ అని కూడా పిలుస్తారు. గొల్లపూడి దగ్గర ప్రస్తుతం వాహనాలు రోడ్లను మారే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని సరి చేయటానికి ఈ ప్రతిపాదనను చేశారు.

Updated Date - Dec 18 , 2025 | 01:12 AM