EX MLA Bhumana Karunakar Reddy: ఆమె.. తాటకి, పూతన, లంకిణి
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:02 AM
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పేరెత్తకుండానే వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆమె తాటకి, పూతన, లంకిణి.. ఆధునిక రజియా సుల్తానా...
అవినీతి అనకొండ.. వేల కోట్ల లూటీ
కట్టే చీర ధర రూ.లక్షన్నరకు పైనే
రూ.50 లక్షల విలువైన 11 విగ్గులు
టీడీఆర్ బాండ్ల దోపిడీకి అడ్డుకట్ట వేశాననే నాపై ఆమెకు ఆగ్రహం
అందుకే రూ.2 వేల కోట్లు తిన్నానని పొరుగు జిల్లాలో దుష్ప్రచారం
ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఉద్దేశించి భూమన
తిరుపతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పేరెత్తకుండానే వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘‘ఆమె తాటకి, పూతన, లంకిణి.. ఆధునిక రజియా సుల్తానా.’’ అంటూ మంగళవారం సెల్ఫీ వీడియోలో మండిపడ్డారు. ‘‘తిరుపతిలో టీడీఆర్ బాండ్ల అవినీతి జరిగిందంటూ ప్రచారం జరగడానికి కారణం ఓ మహిళా ఐఏఎస్’’ అంటూ శ్రీలక్ష్మిపై ఆరోపణలు గుప్పించారు. తిరుపతిలో గత ప్రభుత్వంలో తాము మాస్టర్ ప్లాన్ కింద 21 రోడ్లు కొత్తగా వేస్తుండగా, ఆ రోడ్ల నిర్మాణంతో స్థలాలు కోల్పోయే వారిని టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయడానికి, తద్వారా రూ.వందల కోట్లు నొక్కేయడానికి ఆవిడ కుటిల పన్నాగం పన్నారని ఆరోపించారు. దాన్ని తాము అడ్డుకున్నామన్న దుగ్ధతో ఆమె తమ పక్క జిల్లా టీడీపీ నేతలకు ఆ విషయం చెప్పి, రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందని తమపై ఎంత ప్రచారం చేశారో అందరికీ తెలుసన్నారు. అవినీతిలో ఆమె అనకొండ అని, రాష్ట్రంలో అప్పటి మంత్రులను పూచిక పుల్లల్లా చూసేవారని ఆరోపించారు. చివరికి తన శాఖకు ఇంచార్జిగా ఉన్న మంత్రులను కూడా లెక్క చేయలేదని ఆరోపించారు. ‘‘డబ్బు సంపాదించడం తప్ప ఏ నైతిక విలువలూ లేని మనిషి. కింది స్థాయి అధికారుల పట్ల తాటకిలా వ్యవహరించారు. ఈ అవినీతి అధికారిణి గత 30-35 ఏళ్లుగా ఎక్కడ పనిచేసినా వందల, వేల కోట్లు లూటీ చేశారు. చివరికి అత్యున్నత న్యాయస్థానంతో కూడా ‘మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులే’ అని అనిపించుకున్నారు’’ అని ఎద్దేవా చేశారు. పూతనకు ఏమాత్రం తక్కువ కాదని, లంకిణి కంటే చాలా విపరీత చేష్టలున్న అధికారిణి అని ఆరోపించారు.
జీతమెంత.. చీర ధరెంత?
ఐఏఎస్ శ్రీలక్ష్మి వస్త్రాలపైనా భూమన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె రోజూ ధరించే చీర ఖరీదు రూ.లక్షన్నరకు పైగా ఉంటుందన్నారు. ‘‘ఆమె చేసే ఉద్యోగమేంటి? ఆమెకు వచ్చే జీతమెంత? ధరించే చీరల ఖరీదు ఎంత?.’’ అని ప్రశ్నించారు. రూ.50 లక్షలకు పైగా ఖరీదు చేసే విగ్గులు ఆమెకు 11 ఉన్నాయని, ఒక్కో రోజు ఒకో విగ్గు ధరిస్తూ ఆఫీసులో దర్శనమిస్తుంటారని ఆరోపించారు. అవినీతితో పాటు భూమిని కూడా ఆమె కొల్లగొట్టారని ఆరోపించారు. విలువలు, ఉద్యమాలు, పోరాటాలతో రాజకీయాలు చేసిన తనపై ఆమె కక్ష కట్టారని ఆరోపించారు. ‘‘టీడీఆర్ బాండ్లపై ఏ విచారణకైనా సిద్ధమే. ఒక్క రూపాయి అవినీతి చేసివున్నా ఏ శిక్షకైనా సిద్ధమే. ఇలాంటి నీచ ఆలోచనలున్న అధికారుల వల్ల సమస్యలు వస్తాయి. అయినా రాజకీయాల్లో ఇలాంటివి సహజం. కాబట్టి భరిస్తాం’’ అని వ్యాఖ్యానించారు.