Share News

Senior Maoist Leader Paka Hanumanthu: మరో మావోయిస్టు అగ్రనేత హతం

ABN , Publish Date - Dec 26 , 2025 | 05:09 AM

మావోయిస్టు పార్టీ నాయకత్వానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్‌ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటరులో పార్టీ కేంద్ర కమిటీ సీనియర్‌ నేత....

Senior Maoist Leader Paka Hanumanthu: మరో మావోయిస్టు అగ్రనేత హతం

  • ఎన్‌కౌంటర్‌లో పాకా హనుమంతు మృతి

చింతూరు, చర్ల, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ నాయకత్వానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఒడిశా రాష్ట్రంలోని కంధమాల్‌ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటరులో పార్టీ కేంద్ర కమిటీ సీనియర్‌ నేత, ఒడిశా రాష్ట్ర కమిటీ చీఫ్‌ పాకా హనుమంతు అలియాస్‌ గణేశ్‌ ఉయికే మరణించారు. ఆయనతోపాటు మరో ముగ్గురు మరణించారు. ఇదే రాష్ట్రంలోని గంజాం జిల్లాలో జరిగిన మరో ఎన్‌కౌంటరులో ఇద్దరు మహిళా మావోయిస్టులు మరణించారు. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంగు గ్రామానికి చెందిన పాక హనుమంతు(67) తలపై రూ. 1.10 కోట్ల రివార్డు ఉంది. మరణించే సమయానికి దక్షిణ మధ్య బ్యూరో చీఫ్‌ హోదాలో సెంట్రల్‌ రీజియన్‌ బ్యూరో సభ్యునిగా కొనసాగుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం, కంధమాల్‌ జిల్లా రంభ రిజర్వు ఫారెస్టు అటవీప్రాంతంలో జవాన్లు రెండురోజులుగా కూంబింగ్‌ జరుపుతున్నారు. బుధవారం తెల్లవారుజామున వారికి పాక హనుమంతు బృందం తారసపడింది. ఆ వెంటనే ఇరుపక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో హనుమంతు, మరో ముగ్గురు చనిపోగా, మిగతావారు తప్పించుకున్నారు. ఘటనాస్థలంలో ఒక ఏకే 47, రెండు ఇన్సాస్‌ రైఫిళ్లను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశాల్లో చోటుచేసుకున్న పలు విధ్వంస ఘటనల్లో హనుమంతు నిందితుడిగా ఉన్నారు. కాగా, గంజాం జిల్లా తారాసింగి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని నారిగుచ్చా గ్రామ పరిసర ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ జవాన్లకు మావోయిస్టులకు జరిగిన మరో ఎన్‌కౌంటరులో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. వీరి నుంచి ఒక రివాల్వర్‌, ఒక 303 తుపాకీ, వాకీటాకీని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై రూ.24 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. సివిల్‌ డ్రెస్‌లో ఉంటూ మావోయిస్టు దళాలకు అవసరమైన వస్తువులను ఈ మహిళలు చేరవేస్తున్నట్టు భావిస్తున్నారు.


22 మంది లొంగుబాటు తరువాత..

ఒడిశా డీజీపీ ఎదుట 22మంది మావోయిస్టులు 3 రోజుల క్రితం లొంగిపోయారు. వీరిలో రాష్ట్ర కమిటీ సభ్యులూ ఉన్నారు. ఆ తర్వాత 3రోజులకే హనుమంతు ఎన్‌కౌంటర్‌ జరి గింది. ఈ ఏడాది ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 430 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

ఇక మిగిలింది ఐదుగురే..

మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పుడు 16 రాష్ట్రాల్లో ప్రాబల్యం చాటింది. కేంద్ర కమిటీ సభ్యులుగా సుమారు 42మంది ఉండేవారు. హనుమంతు మరణంతో ఈ సంఖ్య ఐదుకు చేరింది. పొలిట్‌ బ్యూరో సభ్యులుగా తిప్పర్తి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్‌ గణపతి ఉండగా, అనల్‌దా, పసునూరి విశ్వనాథ్‌, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌ కేంద్ర కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు.

పెద్ద ముందడుగు: అమిత్‌షా

పాకా హనుమంతు ఎన్‌కౌంటరుతో మావోయిస్టు రహిత భారత్‌ నిర్మాణం దిశగా గట్టి ముందడుగు పడిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. మావోయిస్టు రహిత రాష్ట్రాల్లో ఒడిశా మొదటి వరుసలో నిలిచిందన్నారు. ఇదే బాటలో నడిచేందుకు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందంటూ అభినందించారు. వచ్చే మార్చి 31నాటికి తమ లక్ష్యం ఛేదించి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు.

ఎవరీ హనుమంతు?

పాకా హనుమంతు మావోయిస్టు పార్టీలోని సీనియర్‌ నేతల్లో ఒకరు. నల్లగొండలో 1981లో డిగ్రీ చదువుతూ, ఆర్‌ఎస్‌యూలో చేరారు. ఏబీవీపీ నాయకుడు శ్రీనివాస్‌ హత్య కేసులో హనుమంతును పోలీసులు నిందితుడిగా చేర్చారు. తర్వాత ఆయన పీపుల్స్‌ వార్‌ పార్టీలో (ఇప్పుడు మావోయిస్టు పార్టీ) చేరి అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి తిరిగి రాలేదు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడు అయ్యారు. ఏవోబీలో మావోయిస్టుపార్టీ ఉద్యమాన్ని నడిపించిన వారిలో హనుమంతు ఒకరు. 2013లో ఛత్తీ్‌సగఢ్‌లోని దర్బా లోయలో మహేంద్ర కర్మపై దాడిచేసి 23 మందిని చంపివేసిన కేసులో హనుమంతు ప్రధాన నిందితుడు. ఒడిశాలో మావోయిస్టు పార్టీ జరిపిన అనేక దాడులకు నాయకత్వం వహించాడని పోలీసులు చెబుతున్నారు. చమ్రుదాదా, రాజేష్‌ తివారీ తదితర పేర్లతోనూ హనుమంతు పనిచేశారు.

Updated Date - Dec 26 , 2025 | 05:09 AM