Senior Advocate Sidharth Luthra: ఏసీబీ కోర్టు అభ్యంతరాలకు 1నే జవాబిచ్చాం
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:30 AM
మద్యం కుంభకోణం కేసులో దాఖలు చేసిన చార్జిషీట్ల విషయంలో ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికీ దర్యాప్తు సంస్థ ఈ నెల ఒకటో తేదీనే జవాబు ఇచ్చిందని సిట్/సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు.
వివరాలన్నీ అందుబాటులోనే ఉన్నాయి
వాటిని న్యాయాధికారి పరిశీలించకుండానే చార్జిషీట్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు
నిందితులకు డీఫాల్ట్ బెయిల్ ఇచ్చారు
హైకోర్టుకు సీఐడీ నివేదన
చార్జిషీటుపై అభ్యంతరాలు లేవనెత్తుతూ ఆఫీస్ మెమోరాండం ఇవ్వడం చట్టంలో లేదు
సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వెల్లడి
విచారణ నేటికి వాయిదా
అమరావతి, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో దాఖలు చేసిన చార్జిషీట్ల విషయంలో ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలన్నింటికీ దర్యాప్తు సంస్థ ఈ నెల ఒకటో తేదీనే జవాబు ఇచ్చిందని సిట్/సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. వివరాలన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ.. చార్జిషీట్లు అసంపూర్తిగా ఉన్నాయంటూ నిందితులు ధనుంజయ్‌రెడ్డి (ఏ-31), కృష్ణమోహన్‌రెడ్డి (ఏ-32), బాలాజీ గోవిందప్ప(ఏ-33)కు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందన్నారు. చార్జిషీట్లపై సందేహాలుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను గానీ, దర్యాప్తు అధికారిని గానీ పిలిచి వివరణ తీసుకుని ఉండాల్సిందని తెలిపారు. సిట్ దాఖలు చేసిన చార్జిషీటు, అనుబంధ చార్జిషీటు అసంపూర్తిగా ఉన్నాయనే కారణంతో పై ముగ్గురికీ ఏసీబీ కోర్టు ఈ నెల 6న పొరపాటున డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వాటిపై న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి బుధవారం విచారణ జరిపారు. దర్యాప్తు సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధా ర్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ‘దర్యాప్తు సంస్థ నిర్దిష గడువులోగా చార్జిషీటు దాఖలు చేసింది. ఈ ఏడాది జూలై 19న మొదట చార్జిషీటు వేశాం. ఆగస్టు 11న అదనపు వివరాలతో మరో చార్జిషీటు వేశాం. అనంతరం ఏసీబీ ప్రత్యేక కోర్టు నిందితులకు రిమాండ్ పొడిగించింది. చార్జిషీటు వేశాక సీఆర్‌పీసీ 309వ సెక్షన్‌ను అనుసరించి రిమాండ్ పొడిగింపు ఉత్తర్వులు ఉండాలి. నిందితుల తరఫు న్యాయవాదులు చెబుతున్నట్లుగా సెక్షన్ 167(2) ప్రకారం రిమాండ్ పొడిగించినట్లు ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లో లేదు.
బీఎన్‌ఎస్ఎస్ చట్ట నిబంధనల ప్రకారం.. చార్జిషీటు దాఖలు చేసిన అనంతరం అవసరమని భావిస్తే దర్యాప్తు అధికారి (ఐవో) దర్యాప్తును కొనసాగించవచ్చు. మేజిస్ట్రేట్ నుంచి అనుమతి తీసుకోవలసిన అవసరం లేదు. పోలీసు మాన్యువల్, సీఆర్‌పీసీలో ప్రాథమిక నివేదిక అనే పదమే ఎక్కడా లేదు. చట్టంలో పోలీసు రిపోర్టుఅని మాత్రమే ప్రస్తా వించారు. చార్జిషీటు అనేది దర్యాప్తు అధికారి అభిప్రాయం మాత్రమే. దానిని పరిశీలించాల్సిన బాధ్యత న్యాయాధికారిదే. చార్జిషీట్లను క్షుణంగా పరిశీలించకుండానే ఏసీబీ కోర్టు న్యాయాధికారి అర్థం లేని అభ్యంతరాలను లేవనెత్తారు. వాటన్నిటికీ ఒకటో తేదీనే జవాబిచ్చాం. వీటిని పరిగణనలోకి తీసుకోకుండానే డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేశారు. అభ్యంతరాలకు మేం సమాధానాలిచ్చిన విషయాన్ని బెయిల్ ఉత్తర్వుల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. చార్జిషీటుపై సందేహాలుంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేదా దర్యాప్తు అధికారిని పిలిచి వివరణ తీసుకుని ఉండాల్సింది. అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆఫీస్ మెమోరాండం ఇవ్వడం చట్టంలో ఎక్కడాలేదు. న్యాయాధికారి చట్టంలో లేని విధానాన్ని అనుసరించారు. ఎఫ్‌ఎస్ఎల్ నివేదికలు, ప్రభుత్వ అధికారుల విచారణ విషయంలో కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోలేదనే కారణంతో చార్జిషీటు అసంపూర్తిగా ఉందంటూ డీఫాల్ట్ బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. చార్జిషీటుకు అనుమతులను జత చేయాల్సిన అవస రం లేదు, ఆతర్వాతైనా ఎఫ్‌ఎస్ఎల్ నివేదికలు, అను మతులను కోర్టుకు సమర్పించవచ్చు’అని తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో సిట్/సీఐడీ తరఫు వాదనలు కొనసాగింపునకు విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.