Share News

ACB Court: గడువులోపే చార్జిషీటు వేశాం

ABN , Publish Date - Sep 19 , 2025 | 05:07 AM

నిర్దిష్ట గడువులోగా చార్జిషీటు వేసి.. కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినప్పటికీ లిక్కర్‌ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసిందని సిట్‌/సీఐడీ తరఫు...

ACB Court: గడువులోపే చార్జిషీటు వేశాం

  • ఏసీబీ కోర్టు అభ్యంతరాలకూ బదులిచ్చాం: సీఐడీ

  • లిఖితపూర్వక వాదనలు, కోర్టుల తీర్పులు సమర్పించాం

  • వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే లిక్కర్‌ నిందితులకు కోర్టు బెయిల్‌ ఇచ్చింది

  • హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిన సీనియర్‌ న్యాయవాది

  • తదుపరి విచారణ 24వ తేదీకి వాయిదా

అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): నిర్దిష్ట గడువులోగా చార్జిషీటు వేసి.. కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినప్పటికీ లిక్కర్‌ కేసు నిందితులకు ఏసీబీ కోర్టు డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసిందని సిట్‌/సీఐడీ తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాము సమర్పించిన లిఖితపూర్వక వాదనలు, వాటిని బలపరుస్తూ వివిధ కోర్టులు ఇచ్చిన తీర్పులను కూడా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మద్యం కుంభకోణం కేసులో ధనుంజయ్‌రెడ్డి(ఏ-31), కృష్ణమోహన్‌రెడ్డి(ఏ32), బాలాజీ గోవిందప్ప(ఏ33)లకు డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై లూథ్రా గురువారం కూడా తన వాదనలు కొనసాగించారు. ‘అన్ని వివరాలతో చార్జిషీటు వేయడం వరకే దర్యాప్తు అధికారి బాధ్యత. దానిని పరిగణనలోకి తీసుకోవాలా లేదా అనేది పూర్తిగా ప్రత్యేక కోర్టు పరిధిలోని వ్యవహారం. దర్యాప్తు సంస్థ వేసిన చార్జిషీటును సంబంధిత న్యాయస్ధానం పరగణనలోకి తీసుకోలేదనే కారణంతో నిందితులు డీఫాల్ట్‌ బెయిల్‌ కోరడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే నిందితులకు ఏసీబీ కోర్టు డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది’ అని తెలిపారు. గోవిందప్ప తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఆగస్టు 26నే గోవిందప్ప డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ వేశారు.


అప్పటికి ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మాత్రమే ఏసీబీ కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఏసీబీ కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరిస్తూ సెప్టెంబరు 1న సీఐడీ వేసిన మెమోను పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. తదుపరి దర్యాప్తునకు కోర్టు అనుమతి అవసరం లేదన్న ప్రాసిక్యూషన్‌ వాదన సరికాదు’ అన్నారు. కృష్ణమోహన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపిస్తూ.. ‘నిర్దిష్ట గడువుకు మించి నిందితులను నిర్బంధించకుండా సీఆర్‌పీసీ సెక్షన్‌ 167 నిరోధిస్తోంది. గడువులోగా దర్యాప్తు పూర్తికాకుంటే బెయిల్‌ మంజూరు చేయడం తప్పనిసరి. ఏసీబీ కోర్టు అభ్యంతరాలకు సమాధానాలు ఇవ్వడంలో దర్యాప్తు అధికారి విఫలమయ్యారు’ అని తెలిపారు. కోర్టు సమయం ముగియడంతో విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రకటించారు.

Updated Date - Sep 19 , 2025 | 05:09 AM