Share News

AP Govt: స్వయం ఉపాధి.. ప్చ్‌

ABN , Publish Date - Jul 06 , 2025 | 03:45 AM

రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాల అమలులో నాటి స్ఫూర్తి కొరవడుతోంది. ప్రభుత్వ సహకారంతో, బ్యాంకు చేదోడుతో, జీవితంలో స్థిరపడాలన్న ఆలోచన యువతలో కరువైంది. గత వైసీపీ ప్రభుత్వం డీబీటీ పేరుతో ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లుగా...

AP Govt: స్వయం ఉపాధి.. ప్చ్‌

  • కార్పొరేషన్లకు అరకొరగా యూనిట్లు కేటాయింపు

  • నిధుల మంజూరు కూడా అంతంతమాత్రంగానే..

  • బీసీల జనాభా ఎక్కువ, యూనిట్లు మాత్రం తక్కువ

  • మండల స్థాయిలో ఇబ్బందికరంగా లబ్ధిదారుల ఎంపిక

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాల అమలులో నాటి స్ఫూర్తి కొరవడుతోంది. ప్రభుత్వ సహకారంతో, బ్యాంకు చేదోడుతో, జీవితంలో స్థిరపడాలన్న ఆలోచన యువతలో కరువైంది. గత వైసీపీ ప్రభుత్వం డీబీటీ పేరుతో ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లుగా, ఉపాధి యూనిట్లు లేకుండా సబ్సిడీ కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఈ యూనిట్లకు సంబంధించి అర్హతల నిబంధనలు సరళతరం చేయడంతో అందరూ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కలిగింది. దీంతో ఆర్థికంగా స్థితిమంతులుగా ఉన్నవారు సైతం సబ్సిడీల కోసం ఎగబడుతున్నారు. వాస్తవంగా స్వయం ఉపాధి యూనిట్లు నిర్వహించుకుని ఎదగాలన్న వారికి మాత్రం ఊతం లభించడం లేదు. మరోవైపు యూనిట్ల కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతుండంతో అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు పలు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. వాటికి భారీగా బడ్జెట్‌ కేటాయించి పలు స్వయం ఉపాధి పథకాలు అమల్లోకి తెచ్చారు. ఈ వర్గాల యువతకు ఇన్నోవా కార్ల కోసం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడంతో పాటు సబ్సిడీ కూడా అందించారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆయా వర్గాల యువత జీవన ప్రమాణాలు పెరిగాయి. అయితే 2019లో జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వయం ఉపాధి పథకాలను అటకెక్కించారు. వివిధ కార్పొరేషన్లు ఏర్పాటుచేసినా వాటికి ఒక్క పైసా కూడా కేటాయించకుండా డీబీటీ విధానాన్ని అమలు చేశారు. దీంతో ఆ కార్పొరేషన్లు చివరకు డీబీటీ పథకాలకు బుక్‌ అడ్జె్‌స్టమెంట్‌ సంస్థలుగా మారిపోయాయి. చంద్రబాబు హయాంలో ఆయా కులాలకు చెందిన యువతకు స్వయం ఉపాధి యూనిట్‌ నిర్వహించేందుకు అవసరమైన ఆర్థికసాయం కూడా అందించేవారు. జగన్‌ డీబీటీ పథకాలతో ఇచ్చిన అరకొర ఆర్థిక సాయం కుటుంబ తాత్కాలిక అవసరాలు, ఆసుపత్రుల బిల్లులు, విద్యుత్‌ చార్జీలు, పన్నులకే సరిపోయేవి.


ఈ డబ్బులు లబ్ధిదారులకు ఉపయోగపడేవి కావు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువత రోజు కూలీలుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో కూటమి సర్కారు రావడంతో వారంతా స్వయం ఉపాధి పథకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకాలకు ప్రభుత్వం బడ్జెట్‌ అంతంతమాత్రంగానే కేటాయిస్తోంది. దరఖాస్తులు మాత్రం విరివిగా వస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక అధికారులకు తలనొప్పిగా మారింది.

వెల్లువెత్తిన దరఖాస్తులు

రాష్ట్ర జనాభాలో దాదాపు సగం ఉన్న బీసీలు టీడీపీ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. స్వయం ఉపాధి పథకాలు అమలు చేయడానికి బీసీ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. దీనికోసం దరఖాస్తుల స్వీకరణ చేపట్టడంతో ఏకంగా 4.33 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే 2024-25 సంవత్సరానికి గాను బీసీలకు 44,722 యూనిట్లు మాత్రమే లక్ష్యంగా నిర్దేశించారు. అందిన దరఖాస్తుల్లో 10శాతం మందికి కూడా స్వయం ఉపాధి యూనిట్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 2025-26 సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్‌ ఏప్రిల్‌ 11 నుంచి మే 20 వరకూ దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ కార్పొరేషన్‌కు కూడా దరఖాస్తుల వెల్లువ ప్రారంభమైంది. వీరికి 20వేల యూనిట్లు మాత్రమే లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ సరిపోకవపోడంతో లబ్ధిదారులను సంతృప్తిపరచలేక నేతలు, అధికారులు సతమవుతున్నారు.


క్షేత్రస్థాయిలో అసంతృప్తి

డిమాండ్‌ మేరకు స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు కాకపోవడంతో పథకాల అమలులో ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. మండల స్థాయిలో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్న అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. బ్యాంకుల పరిధిలో టార్గెట్లు అతి తక్కువ సంఖ్యలో ఉండటం, లబ్ధిదారులు సంఖ్య ఎక్కువగా ఉండటంతో తీవ్ర పోటీ నెలకొంది. వీరిలో ఎవరికి సిఫారసు చేయాలో తెలియక అధికార పార్టీ నేతలూ ఇబ్బంది పడుతున్నా రు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు, అధికారులు సూచించిన వారికి కాకుండా వేరేవారికి రుణాలిస్తామని బ్యాంకులు మెలికలు పెడుతున్నాయి. దీంతో అధికార పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది.

జగన్‌ నిర్వాకంతోనే..

2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏటా లక్ష మందికి పైగా స్వయం ఉపాధి యూనిట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ కూడా ఈ పథకాన్ని కొనసాగించి ఉంటే ఇప్పుడు ఇంత డిమాండ్‌ ఉండేది కాదు. కానీ గత ప్రభుత్వం ఈ పథకాలను పూర్తిగా నిలిపేయడంతో ఆ ఒత్తిడి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై పడింది. స్వయం ఉపాధి కోసం వచ్చిన దరఖాస్తులన్నింటికీ రుణాలివ్వాలంటే బ్యాంకుల్లో ఉండే నిల్వలు చాలవని, సబ్సిడీ ఇవ్వాలంటే ప్రభుత్వ బడ్జెట్‌ చాలదని పేర్కొంటున్నారు. గత ఐదేళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని రాష్ట్రంలో కూటమి సర్కారు చేపడుతున్న ఈ పథకాలు అందరికీ చేరువ కాలేని పరిస్థితి ఉండటంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడుతోంది.

Updated Date - Jul 06 , 2025 | 03:45 AM