Share News

AP High Court: ఊరేగింపులకు భద్రత.. పోలీసులదే బాధ్యత

ABN , Publish Date - Aug 31 , 2025 | 06:21 AM

వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే విగ్రహాల నిమజ్జనాలను పురస్కరించుకుని చేసే ఊరేగింపులు శాంతియుతంగా, సాఫీగా సాగేందుకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం...

AP High Court: ఊరేగింపులకు భద్రత.. పోలీసులదే బాధ్యత

  • వినాయక నిమజ్జనాలపై హైకోర్టు స్పష్టీకరణ

  • సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ

  • ఆదోని డీఎస్పీ దాఖలు చేసిన అప్పీల్‌ కొట్టివేత

అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే విగ్రహాల నిమజ్జనాలను పురస్కరించుకుని చేసే ఊరేగింపులు శాంతియుతంగా, సాఫీగా సాగేందుకు తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులదేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరమైతే అదనపు భద్రతా బలగాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కర్నూలు జిల్లా, ఆదోనిలో ఈనెల 31న ప్రధాన రహదారి మీదుగా వినాయక నిమజ్జనం ఊరేగింపు నిర్వహణకు విశ్వహిందూ పరిషత్‌, వినాయక ఉత్సవ కమిటీకి అనుమతి ఇవ్వడంతో పాటు భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. మరోవైపు, ఇతర మతాల మనోభావాలు దెబ్బతీయకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులకు స్పష్టం చేసింది. ఆదోని డీఎస్పీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. కర్నూలుజిల్లా, ఆదోనిలో వినాయక విగ్రహాలను ఎల్‌ఎల్‌సీ కాలువలో నిమజ్జనం చేసేందుకు పట్టణంలోని ఆర్ట్స్‌ కాలేజ్‌, శ్రీకృష్ణదేవాలయం, ఎమ్మిగనూరు సర్కిల్‌, అనంత మంగళ ఆంజనేయస్వామి దేవస్థానం, నిర్మలా టాకీస్‌, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌, శ్రీనివాస బ్రిడ్జి, కొత్తబ్రిడ్జి రూట్‌లో ఊరేగింపునకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ విశ్వహిందూ పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు ఎ. బసవన్న గౌడ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.


ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి పిటిషనర్‌ సమర్పించిన వినతిలో పేర్కొన్న రూట్‌ మ్యాప్‌లో వినాయక నిమజ్జన ఊరేగింపునకు అనుమతించాలని పోలీసులను ఆదేశించింది. ఊరేగింపును పర్యవేక్షించడంతో పాటు సమస్యలు సృష్టించేవారిపై కన్నేసి ఉంచేందుకు కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఊరేగింపుని రికార్డు చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే, విశ్వహిందూ పరిషత్‌ ఇచ్చిన రూట్‌ మ్యాప్‌లో మసీదు ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉన్నందున సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ఆదోని డీఎస్పీ ధర్మాసనం ముందు అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. డీఎస్పీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. విశ్వహిందూ పరిషత్‌ ప్రతిపాదించిన దారిలో 2011లో ఓసారి రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయన్నారు. మసీదు ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లాలని మాత్రమే పోలీసులు సూచించారని తెలిపారు. ఈ వాదనలను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.

Updated Date - Aug 31 , 2025 | 06:22 AM