Section 104 of IPC: సెక్షన్ 104 రాజ్యాంగ విరుద్ధం
ABN , Publish Date - Aug 21 , 2025 | 05:44 AM
అప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి హత్యకు పాల్పడితే ఆయనకు మరణశిక్ష లేదా జీవించి ఉన్నంత కాలం జైలుశిక్ష విధించేందుకు వీలు కల్పిస్తున్న భారతీయ న్యాయ సంహితలోని..
హైకోర్టులో పిల్ దాఖలు
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): అప్పటికే జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి హత్యకు పాల్పడితే ఆయనకు మరణశిక్ష లేదా జీవించి ఉన్నంత కాలం జైలుశిక్ష విధించేందుకు వీలు కల్పిస్తున్న భారతీయ న్యాయ సంహితలోని(బీఎన్‌ఎస్) సెక్షన్ 104ను రాజ్యాంగవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర న్యాయ, హోంశాఖ కార్యదర్శులు, రాష్ట్ర న్యాయ, హోంశాఖ ముఖ్యకార్యదర్శులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ పిల్‌ను విశాఖపట్నంజిల్లా చోడవరానికి చెందిన బగ్గు సత్య చంద్రశేఖర్ అనే వ్యక్తి దాఖలుచేశారు. ఆయన తరఫున న్యాయవాది శ్రీకృష్ణ సాయి భార్గవ్ వాదనలు వినిపించారు. సెక్షన్ 104 రాజ్యాంగ విరుద్ధమైనదే కాకుండా ప్రాథమిక హక్కులకు కూడా భంగకరమేనని వాదించారు. ‘‘జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి హత్యకు పాల్పడితే మరణశిక్షను విధించాలని ఐపీసీ సెక్షన్ 303 చెబుతోంది. మిథు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో ఈ సెక్షన్‌ను రాజ్యాంగవిరుద్ధమైనదని సుప్రీంకోర్టు ప్రకటించింది. కేసు పూర్వపరాలను పరిశీలించి, శిక్ష విధించే విషయంలో న్యాయమూర్తులకు ఉన్న విచక్షణాధికారాన్ని ఇది నిరోధిస్తుందని పేర్కొంది. ఈ సెక్షన్‌ను రద్దుచేసింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఈ తరహా సెక్షన్‌నే బీఎన్‌ఎ్‌సలో సెక్షన్ 104 రూపంలో కొనసాగిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం.’’ అని వాదించారు.