Share News

చీకట్లో గుట్టుగా..

ABN , Publish Date - Dec 24 , 2025 | 01:04 AM

తీర ప్రాంతంలోని గ్రామాల్లో మట్టి మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. ఇటీవల వరకు వర్షాలు కురవడంతో మిన్నకుండిపోయిన అక్రమార్కులు తాజాగా మట్టి తవ్వకాలు ప్రారంభించారు. తీర ప్రాంతంలోని ప్రభుత్వ భూములే లక్ష్యంగా మట్టిని తవ్వేస్తున్నారు. రాత్రివేళ టిప్పర్ల ద్వారా తరలించి విక్రయాలు జరిపేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయంటూ తమదైన శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు.

చీకట్లో గుట్టుగా..

- బరితెగించిన మట్టి మాఫియా

- పల్లె తుమ్మలపాలెం, పోలాటితిప్ప గ్రామాల్లో తవ్వకాలు

- అర్ధరాత్రి మచిలీపట్నం, పరిసర ప్రాంతాలకు తరలింపు

- ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా చేపలు, రొయ్యల చెరువుల తవ్వకం

- కోతకు గురవుతున్న పోలాటితిప్ప-పల్లెతుమ్మలపాలెం రహదారి

- పంట పొలాల మధ్య చేపల చెరువుల తవ్వకంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

తీర ప్రాంతంలోని గ్రామాల్లో మట్టి మాఫియా మళ్లీ రెచ్చిపోతోంది. ఇటీవల వరకు వర్షాలు కురవడంతో మిన్నకుండిపోయిన అక్రమార్కులు తాజాగా మట్టి తవ్వకాలు ప్రారంభించారు. తీర ప్రాంతంలోని ప్రభుత్వ భూములే లక్ష్యంగా మట్టిని తవ్వేస్తున్నారు. రాత్రివేళ టిప్పర్ల ద్వారా తరలించి విక్రయాలు జరిపేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే మాకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయంటూ తమదైన శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

మచిలీపట్నం సౌత మండలంలో పల్లె తుమ్మలపాలెం, పోలాటితిప్ప రహదారి వెంబడి వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇటీవల కాలంలో కొందరు ఈ భూముల నుంచి మట్టిని కొన్ని రోజులుగా తరలిస్తున్నారు. పోలాటితిప్ప, పల్లెతుమ్మలపాలెం గ్రామాల మధ్య ఉన్న ప్రభుత్వ భూములను గతంలోనే రొయ్యల చెరువులుగా మార్చారు. ఈ చెరువుల మరమ్మతుల పేరుతో మట్టిని తవ్వి రాత్రి సమయంలోనే టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. పగలు సమయంలో ఎలాంటి పనులు జరగనట్లుగా చూపి, రాత్రి సమయంలో టిప్పర్లను, ట్రాక్టర్లను పెట్టి మట్టిని తరలిస్తున్నారని పోలాటితిప్ప గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. భారీ లోడుతో టిప్పర్‌లు తిరుగుతుండటంతో పోలాటితిప్ప బస్‌స్టాప్‌ సెంటర్‌ నుంచి మట్టిని తరలిస్తున్న ప్రాంతం వరకు రహదారి పాడైందని, అయినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పోలాటితిప్ప గ్రామానికి కరకట్ట మధ్యన ఉన్న ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తరలించేందుకు సన్నాహాలు చేశారని, గ్రామస్థుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తుగానే గ్రామ శివారున ఉన్న మట్టి రహదారులు కుంగిపోకుండా కొంత మట్టిని పోశారని చెబుతున్నారు. ఇక్కడ తవ్విన మట్టిని మచిలీపట్నం, పరిసర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. పల్లెతుమ్మలపాలెం సమీపంలో ఉన్న మెరక ప్రాంతంలో నుంచి మట్టిని తవ్వేందుకు ప్రణాళికను రచించారు. ముందస్తుగా ఎక్స్‌ కవేటర్‌ ద్వారా మట్టిని తవ్వి గుట్టలుగా పోశారు. మట్టి కాస్త ఆరిన తర్వాత టిప్పర్ల ద్వారా తరలించేందుకు సిద్ధం చేసి ఉంచారు. మట్టి తవ్విన ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిప్పర్లు రాకపోకలు సాగించేందుకు బాటను కూడా వేశారు.

కోతకు గురవుతున్న రహదారి

పల్లెతుమ్మలపాలెం, పోలాటితిప్ప రహదారికి ఇరువైపులా వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ రహదారి వెంబడి ఒకవైపున ఉన్న వందలాది ఎకరాల భూమిని ఆక్రమించి, మరికొంత భూమిని కొందరు గ్రామస్థులకు మూడేళ్ల తర్వాత లీజు చెల్లిస్తామని నమ్మించి తీసుకుని రొయ్యల చెరువులుగా మార్చివేశారు. సముద్రపు ఆటుపోటు సమయంలో నీరు వచ్చి వెళ్లిపోయే ప్రాంతంలో తూములను దాదాపుగా పూడ్చి వేసి చెరువులను తవ్వారు. దీంతో సముద్రపు పోటు సమయంలో నీరు రహదారి అంచువరకు వచ్చి నిలబడిపోతోంది. నీటి అలల ఉధృతికి ఈ రహదారిలోని కొంత భాగం విరిగిపడి క్రమేణా కుంగిపోతోంది. మరికొంత కాలానికి ఈ రహదారి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ రహదారి పాడైపోతే రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. రహదారికి ఒకవైపున ఉన్న భూములను రొయ్యల చెరువులుగా మార్చి గట్లు వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రెండు గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కలెక్టర్‌కు చెన్నూరు రైతుల ఫిర్యాదు

పెడన మండలం చెన్నూరు గ్రామంలో పంట పొలాల మధ్య చేపల చెరువులు తవ్వేందుకు యంత్రాలు తీసుకువచ్చారని, పంట పొలాల మధ్య చేపల చెరువులు తవ్వితే రానున్న కాలంలో వరి సాగుకు ఇబ్బందులు ఏర్పడతాయని గ్రామస్థులు కలెక్టర్‌ బాలాజీకి ఫిర్యాదు చేశారు. ఈ చెరువుల తవ్వకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ గత సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు.

Updated Date - Dec 24 , 2025 | 01:04 AM