Amaravati Secretariat: సెలవుల మూడ్‌లో సచివాలయం
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:27 AM
కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, సందర్శకులతో నిత్యం కళకళలాడే సచివాలయం వరుస సెలవులతో బోసిపోయింది.
25వ తేదీ నుంచి 5 వరకు ఎఫెక్ట్
అమరావతి, డిసెంబరు 26 (ఆంధ్రజోతి): కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, సందర్శకులతో నిత్యం కళకళలాడే సచివాలయం వరుస సెలవులతో బోసిపోయింది. ఏడాది చివరిలో అమరావతి సచివాలయం సెలవుల మూడ్‌లోకి వెళ్లిపోయింది. క్రిస్మస్ సందర్భంగా 25వ తేదీ గురువారం సెలవు. ఆ మరుసటి రోజు 26వ తేదీ శుక్రవారం ఆప్షనల్ హాలిడే కావడంతో సచివాలయంలో ఉద్యోగుల హాజరు, సందర్శకుల సంఖ్య తక్కువగానే కనిపించింది. తర్వాత వరుసగా 27, 28వ తేదీలు శని, ఆదివారాలు వారంతపు సెలవులు. ఏడాది చివరి కావడంతో సాధారణ, ఐచ్ఛిక సెలవులకు మధ్యలో వచ్చిన పని దినాల్లో ఉద్యోగులు తమకు ఉన్న సెలవులను వినియోగించుకుంటున్నారు. 29వ తేదీ సోమవారం పనిదినం కావడంతో పాటు క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్‌కు సంబంధించిన ఉద్యోగులు మాత్రమే విధులకు వచ్చే అవకాశం ఉంది. 30వ తేదీ వైకుంఠ ఏకాదశి పండగ కావడంతో ఉద్యోగులు సెలవులను ఉపయోగించుకునే అవకాశం ఉంది. అలాగే 31 తేదీ ఈ ఏడాది చివరి రోజు కావడంతో ఉద్యోగులు సెలవులను వాడుకునే అవకాశం ఉంది. జనవరి 1వ తేదీ ఆప్షనల్ హాలిడే. పలువురు ఉద్యోగులు సెలవును వినియోగించుకున్నా, మరికొంత మంది విధులకు హాజరైనా న్యూ ఇయర్ శుభాకాంక్షలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉంది. జనవరి 2వ తేదీ శుక్రవారం వర్కింగ్ డే. ఆ తర్వాత వరుసగా శని, ఆదివారాలు సెలవులు. దీంతో జనవరి 5వ తేదీ నుంచి సచివాలయంలో పూర్తి స్థాయిలో ఉద్యోగుల హాజరు, కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.