Share News

CM Chandrababu: రెండో దశ భూ సమీకరణపై హడావుడి వద్దు

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:17 AM

రాజధాని అమరావతి రెండో విడత భూ సమీకరణ విషయంలో హడావుడి వద్దని సీఆర్‌డీఏ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించింది. మొదటి దశలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలు ఇంకా...

CM Chandrababu: రెండో దశ భూ సమీకరణపై హడావుడి వద్దు

  • సీఆర్‌డీఏకు సీఎం చంద్రబాబు సూచన.. రైతుల అభ్యంతరాలపై క్యాబినెట్‌లో చర్చ

  • మొత్తం 44 వేల ఎకరాల్లో ఇప్పటికిప్పుడు 20 వేల ఎకరాల సమీకరణకు యోచన

  • ప్రభుత్వ ప్రణాళికలపై రాజధాని రైతులకు అవగాహన కల్పించకపోవడంతోనే సమస్య

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

రాజధాని అమరావతి రెండో విడత భూ సమీకరణ విషయంలో హడావుడి వద్దని సీఆర్‌డీఏ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం మౌఖికంగా ఆదేశించింది. మొదటి దశలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలు ఇంకా అపరిష్కృతంగా ఉండటంపై రెండో దశలో భూములు ఇవ్వాల్సిన రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ప్రణాళికలు ఏమిటనే అంశాలపై అవగాహన కల్పించకపోవడం, హడావిడిగా గ్రామసభల నిర్వహణతో వారిలో ఆగ్రహం నెలకొంటోంది. రైతుల సందేహాలను పూర్తిస్థాయిలో తీర్చే ప్రయత్నాలు జరగలేదని ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది. రెండో దశ భూ సమీకరణపై మంత్రుల కమిటీని నియమించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే రైతులను ఒప్పించి ముందుకు అడుగు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ ప్రక్రియను నిదానంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు నిర్దేశించింది.

ఇప్పటికిప్పుడు 20 వేల ఎకరాలే

కొత్తగా సమీకరించే భూముల్లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్ట్‌తో పాటు స్మార్ట్‌ ఇండ్రస్ర్టియల్‌ సిటీ, స్పోర్ట్స్‌ సిటీ వంటి వాటిని నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది. రెండోదశలో అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద మద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాలతో పాటు తుళ్లూరు మండలంలో వడ్డమాను, హరిశ్చంద్రాపురం, పెదపరిమి గ్రామాల్లో కలిపి 20,494 ఎకరాలు యుద్ధ ప్రాతిపదికన తీసుకోవాలని భావిస్తున్నారు. వీటికి ల్యాండ్‌ పూలింగ్‌ నిబంధనలు అమలు చేస్తూ చట్టసవరణ చేశారు. కాగా, ఇటీవల జరిగిన క్యాబినెట్‌ సమావేశం అనంతరం భూ సమీకరణ ప్రక్రియను నిదానంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రైతుల అభ్యంతరాల అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావించిన కొందరు మంత్రులు.. తొందరపడకూడదని సూచించినట్టు సమాచారం. రైతులు పలు సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని, వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పినట్లు భోగట్టా. దీంతో ఈ విషయంలో హడావుడి వద్దని సీఆర్‌డీఏ అధికారులకు సీఎం సూచించినట్టు తెలుస్తోంది.

Updated Date - Jul 13 , 2025 | 03:18 AM