Kurnool Bus Tragedy: కార్గో క్యాబిన్‌లో రెండో డ్రైవర్ నిద్ర
ABN , Publish Date - Oct 31 , 2025 | 06:43 AM
కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై విచారణ చేస్తున్న పోలీసులకు పలు ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. వి.కావేరీ ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకున్న సమయంలో రెండో డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో...
కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల విచారణలో ఆసక్తికర అంశాలు
మృతుల కుటుంబాలకు వి.కావేరి ట్రావెల్స్ ఆర్థిక సాయం
కర్నూలు/న్యూఢిల్లీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై విచారణ చేస్తున్న పోలీసులకు పలు ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. వి.కావేరీ ట్రావెల్ బస్సు మంటల్లో చిక్కుకున్న సమయంలో రెండో డ్రైవర్ శివనారాయణ బస్సు కింది భాగంలోని కార్గో క్యాబిన్‌లో నిద్రిస్తున్నట్లు తెలిసింది. చాలా బస్సుల్లో రెండో డ్రైవర్ అందులోనే పడుకుంటారని, అత్యవసరమైతే ప్రయాణికులను కూడా ఆ క్యాబిన్‌లోనే తరలిస్తారని వెలుగు చూసింది. పోలీసుల విచారణలో రెండో డ్రైవర్ పలు ఆసక్తి విషయాలు వెల్లడించాడు. ప్రమాద సమయంలో తాను కార్గో క్యాబిన్‌లో గాఢనిద్రలో ఉన్నట్లు, భారీ శబ్దం రావడంతో మెలుకువ వచ్చినట్లు చెప్పాడు. ముందుభాగంలో మంటలు చెలరేగిన సమయంలో కంగారుగా డ్రైవర్ లక్ష్యయ్య తన వద్దకు వచ్చినట్లు తెలిపాడు. తామిద్దరూ ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదని, బస్సు కుడివైపు అద్దాలు పగులకొట్టి కొంతమంది ప్రయాణికులను బయటకు లాగామని వెల్లడించాడు. ఇతరులతో కలసి తాము చేసిన ప్రయత్నం వల్లే 27మంది ప్రయాణికులు ప్రాణాలతో బయట పడ్డారన్నాడు.
మంత్రి భరత్‌కు చెక్ అందజేత
ప్రమాదంలో మృతి చెందిన 19మంది కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2లక్షల చొప్పున, గాయపడిన నలుగురికి రూ.50వేల చొప్పున వి.కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ఆర్థిక సాయం అందజేసింది. ఈ మేరకు రూ. 40 లక్షల చెక్‌ను ఆ సంస్థ ప్రతినిధులు జిల్లా కలెక్టరేట్‌లో గురువారం మంత్రి టీజీ భరత్‌కు అందజేశారు. కాగా, ప్రమాదంలో మృతి చెందిన ఏపీ వాసులైన ఏడుగురు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబీకులు, గాయపడిన నలుగురి బ్యాంక్ ఖాతాలు తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామని, ఒకటి రెండు రోజుల్లో వారి ఖాతాల్లో ఆర్థిక సాయం జమ అవుతుందని జిల్లా కలెక్టర్ ఏ.సిరి ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.
నిబంధనలకు విరుద్ధంగా వి.కావేరీ బస్సు మార్పు
బస్ కోడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలుకే: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
నిబంధనలకు విరుద్థంగా బస్సులలో మార్పులు చేస్తే నేరుగా జైలుకు పంపిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. బస్ కోడ్ ఉల్లంఘిస్తూ సీటర్ బస్సులను స్లీపర్ బస్సులుగా మారిస్తే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం, ఢిల్లీలో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కర్నూలు బస్సు ప్రమాదంపై స్పందించారు. ఆ బస్సును చట్ట విరుద్థంగా స్లీపర్ బస్సుగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ఇటీవల సవరించిన బస్ కోడ్‌లో స్పష్టమైన నిబంధనలు చేర్చామన్నారు.