Share News

Seaweed Farming: ఉపాధినిచ్చే సముద్రపు నాచు

ABN , Publish Date - Aug 24 , 2025 | 05:51 AM

సముద్రపు నాచు (సీ వీడ్‌) పోషకాల గని..! ప్రపంచవ్యాప్తంగా దీన్ని అనేక ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తుంటారు. ఔషధాలు, కాస్మొటిక్స్‌తోపాటు అనేక వస్తువుల తయారీలోనూ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు.

Seaweed Farming: ఉపాధినిచ్చే సముద్రపు నాచు

  • తీరంలో సీ వీడ్‌ పెంపకంపై ప్రభుత్వం దృష్టి

  • పైలెట్‌ ప్రాజెక్టుగా పీఎం లంక గ్రామం ఎంపిక

  • పెంపకంపై రెండు మహిళా గ్రూప్‌లకు శిక్షణ

  • విజయవంతమైతే మరిన్ని గ్రూపులతో సాగు

నరసాపురం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సముద్రపు నాచు (సీ వీడ్‌) పోషకాల గని..! ప్రపంచవ్యాప్తంగా దీన్ని అనేక ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తుంటారు. ఔషధాలు, కాస్మొటిక్స్‌తోపాటు అనేక వస్తువుల తయారీలోనూ సముద్రపు నాచును ఉపయోగిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలున్న సీ వీడ్‌ను సముద్ర తీరంలో సాగు చేయించి మత్స్యకారులకు ఉపాధి చూపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో బాగంగా పైలెట్‌ ప్రాజెక్టుగా పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం మండలం పీఎం లంక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ మత్స్యకార మహిళలు సభ్యులుగా ఉన్న రెండు డ్వాక్రా గ్రూపుల్ని ఎంపిక చేసి.. వారికి సీ వీడ్‌ సాగుపై శిక్షణ ఇవ్వనున్నారు. ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ కింద రుణాలిచ్చి నాచు సాగును ప్రోత్సహిస్తారు. ఇది విజయవంతమైతే మరికొన్ని గ్రూపుల్ని కూడా ప్రోత్సహించి తీరంలో ఈ సాగును విస్తరించాలని యోచిస్తున్నారు.


వేలాది మందికి ఉపాధి

ప్రస్తుతం దేశంలో తమిళనాడు సీ వీడ్‌ కల్చర్‌ (సముద్రపు నాచు పెంపకం)లో అగ్రగామిగా ఉంది. అక్కడ వేలాది మంది ఈ సాగుతో ఉపాధి పొందుతున్నారు. ప్రారంభ సమయంలో మినహా సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. నాలుగు కర్రలను చతురస్రాకారంలో కట్టి దాన్ని తాళ్లతో నులక మంచం మాదిరిగా అల్లుతారు. ఈ అల్లికల మధ్యన నాచు మొక్కల్ని ఉంచుతారు. వాటిని సముద్రంలో ఉప్పు సాంద్రత ఎక్కువుగా ఉండే ప్రదేశంలో లంగర్‌తో కడతారు. ఇలా ఐదారు ఫ్రేమ్‌ల్లో మొక్కలు పెట్టి దగ్గరగా ఉంచుతారు. సముద్రపు నీటిలో ఉంచిన ఈ మొక్కలు పెరిగి కింద భాగంలో నాచుగా తయారవుతాయి. ముదిరిన తర్వాత వాటిని బయటకు తీసుకొస్తారు. గతంలో కూడా తీర ప్రాంతంలో నాచు సాగు చేసేందుకు ప్రయత్నించారు. అయితే సరైన ప్రోత్సాహం, శిక్షణ లేకపోవడం వల్ల మంచి ఫలితాలు రాలేదు. దీనిపై అధ్యయనం చేసిన మత్స్యశాఖ... ఎంపిక చేసిన రెండు డ్వాక్రా గ్రూప్‌లకు శిక్షణ ఇచ్చి పెంపకం చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ తరహా సాగును రాష్ట్రంలో శ్రీకాకుళం, విశాఖలో చేపట్టారు. అవసరమైతే ఎంపిక చేసిన రెండు గ్రూప్‌ల సభ్యుల్ని శ్రీకాకుళం, విశాఖ లేదా తమిళనాడుకు తీసుకెళ్లి సాగుపై శిక్షణ, అవగాహన కల్పించాలని యోచిస్తున్నారు.


నాచుకు భలే డిమాండ్‌

ప్రస్తుతం ఈ నాచుకు స్వదేశి, విదేశీ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అత్యధికంగా ఫార్మా కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని కాస్మొటిక్స్‌ల్లోనూ వీటిని విరివిగా వినియోగిస్తున్నారు. ఐస్‌ తయారీలో గడ్డ కట్టేందుకు ఈ నాచులోంచి వచ్చే పదార్థాన్ని ఎక్కువుగా వాడుతున్నారు. ఇంత డిమాండ్‌ వల్లే తమిళనాడులో ఎక్కువ మంది నాచు సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. మంచి మార్కెట్‌ సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇలా సాగుచేసిన నాచును కొనుగోలు చేసేందుకు ఔషధ కంపెనీలు పోటీపడుతున్నాయి.


పీఎం లంకలో పైలెట్‌ ప్రాజెక్టు

‘రాష్ట్రంలో అన్ని సముద్ర తీర ప్రాంతాల్లో సీ వీడ్‌ కల్చర్‌ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పీఎం లంక ప్రాంతాన్ని ఎంపిక చేశాం. 40 మందితో ఉన్న రెండు డ్వాక్రా గ్రూపుల్ని ఎంపిక చేసి వారికి సాగుపై శిక్షణ ఇవ్వనున్నాం. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రుణం కూడా ఇస్తాం. తీర ప్రాంతంలో అలల వడి ఎక్కువ. గోదావరి, ఉప్పుటేరు కలిసే ప్రదేశం కావడంతో ఇక్కడ నీటిలో ఉప్పు సాంద్రత తక్కువ. ఈ కారణంగా గతంలో ఈ సాగు విజయవంతం కాలేదు. ఈ సారి సముద్రం ఒడ్డున కాకుండా అలల తీవ్రత లేని ప్రదేశంలో.. అంటే సముద్రంలో కిలోమీటరు దూరంలో సాగు చేపట్టాలని నిర్ణయించాం. కర్ర ఫ్రేమ్‌లను బోటులో అక్కడికి తీసుకెళ్లి లంగర్‌ సాయంతో కట్టేసి నాచు పెంచుతాం. మూడు నెలల ఫలితాలను బట్టి మరికొన్ని గ్రూప్‌లను ఎంపిక చేసి సాగు విస్తీర్ణం పెంచుతాం.’

- మత్స్యశాఖ జేడీ నాగలింగాచార్యులు

Updated Date - Aug 24 , 2025 | 05:52 AM