Migrant Children: వలస వెళ్లినా.. చదువు ఆగదు!
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:10 AM
పొట్టకూటి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి. ఉన్న ఊర్లో చేయడానికి పనుండదు. దీంతో రాష్ట్రంలో ప్రతి ఏటా.. వేలాది కుటుంబాలు వలసబాట పడుతున్నాయి....
పనుల నిమిత్తం వలస వెళ్లిన కుటుంబాల్లోని పిల్లలకు సర్కారు రక్ష
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పొట్టకూటి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి. ఉన్న ఊర్లో చేయడానికి పనుండదు. దీంతో రాష్ట్రంలో ప్రతి ఏటా.. వేలాది కుటుంబాలు వలసబాట పడుతున్నాయి. సీజన్ల వారీగా జిల్లాలు, రాష్ర్టాలు దాటి తాత్కాలిక వలస జీవనం సాగిస్తున్నాయి. అయితే, ఈ వలసబాట కారణంగా ఆయా కుటుంబాల్లోని పిల్లలపై తీవ్ర ప్రభావం పడుతోంది. వలస వెళ్తున్న కుటుంబాలు.. స్థానికంగా తమ పిల్లలను ఉంచే మార్గం లేక, చదివించే దారిలేక తమతోనే తీసుకెళ్తున్నారు. ఫలితంగా ఏటా 3, 4 నెలలపాటు ఆ చిన్నారులు బడికి దూరమై.. భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చిన్నారుల భవితకు భరోసా కల్పించాలని సంకల్పించింది. ఈ క్రమంలో గతంలో కంటే మెరుగ్గా సీజనల్ హాస్టళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 236 సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేసింది. ఆయా హాస్టళ్లలో వలస కుటుంబాల పిల్లలకు ఆశ్రయం కల్పించడంతోపాటు వారు విద్యను కొనసాగించేలా పర్యవేక్షిస్తుంది. ఈసారి ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి.. కేవలం రాష్ర్టానికి చెందిన విద్యార్థులనే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి పనుల నిమిత్తం వలస వచ్చే వారి పిల్లలకూ చదువు.. అదికూడా వారి మాతృభాషలోనే చెప్పించే ప్రణాళికను రూపొందించింది.
కేంద్రం సహకారం!
సీజనల్ హాస్టళ్లకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం మేరకు నిధులు ఇస్తోంది. ఈసారి రాష్ర్టానికి అత్యధికంగా హాస్టళ్లు వచ్చేలా సమగ్ర శిక్ష అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. వలస కుటుంబాల్లో 11,842 మంది విద్యార్థులు ఉంటారని అధికారులు అంచనా వేశారు. వారికోసం 236 హాస్టళ్లను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే కుటుంబాల పిల్లలను కూడా పరిగణనలోకి తీసుకుని వీరందరికీ సీజనల్ హాస్టళ్లలో భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. సగటున ఒక్కో హాస్టల్‌లో 50 మంది విద్యార్థులు ఉన్నారని అధికారులు తెలిపారు.
నెలకు రూ.80 వేలు
సీజనల్ హాస్టళ్లలో ప్రతి విద్యార్థికీ రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తున్నారు. వారి కోసం ఒక వంట మనిషి, ఒక హెల్పర్, ఒక టీచర్, ఒక కేర్ టేకర్‌ను నియమించారు. ఒక్కో విద్యార్థికీ ఆహారం కోసం నెలకు రూ.వెయ్యి ఖర్చు చేస్తున్నారు. మొత్తంగా ఒక్కొక్క హాస్టల్‌కు నెలకు రూ.80 వేలు ఖర్చు చేస్తున్నారు. స్వచ్చంధ సేవా సంస్థలు, స్వయం సహాయక బృందాల ఆధ్వర్యంలో ఈ హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం రూ.11.63 కోట్లు కేటాయించారు. ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే విద్యార్థులకు వారికి అలవాటైన ఆహారమే అందిస్తున్నారు.
గుంటూరులో 1,875 మంది బిహారీలు
గుంటూరు జిల్లాలో మిర్చి కోతలకు కర్నూలు ఇతర జిల్లాల వాసులు వస్తుంటారు. కానీ, మిర్చి యార్డుల్లో పనులకు బిహార్, జార్ఖండ్, ఛత్తీ్‌సగఢ్ కూలీలు వస్తారు. ఆయా కుటుంబాల్లోని చిన్నారుల బాల్యమంతా మిర్చి యార్డుల్లోనే మగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలిసారి యార్డుల సమీపంలోనే హాస్టళ్లు ఏర్పాటు చేసింది. అక్కడ కేవలం వసతి మాత్రమే కాకుండా బయటి రాష్ర్టాల వారి కోసం తరగతులు నిర్వహిస్తున్నారు. ఆయా కూలీలతో అధికారులు సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. చిన్నారులతో పాటు కూలీకి వెళ్లే పిల్లల్ని కూడా హాస్టళ్లల్లో తరగతులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టారు. దీంతో ఒక్క గుంటూరు జిల్లాలోనే 1,875 మంది బిహార్‌కు చెందిన పిల్లలు చదువుకుంటున్నారు. ప్రస్తుతం గుంటూరులో 2,196 మంది, కృష్ణాలో 1,821, కర్నూలులో 4,020, ఎన్టీఆర్‌లో 1,723 మంది హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు. వారిలో ఏపీతో పాటు ఇతర రాష్ర్టాల విద్యార్థులున్నారు. సీజనల్ హాస్టళ్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అదనపు ఎస్పీడీ రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.
వారి భాషలోనే చదువు
‘‘తల్లిదండ్రులు వలస వెళ్లినా పిల్లల చదువుకు బ్రేక్ పడకూడదనేది ప్రభుత్వం లక్ష్యం. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేశాం. ఈసారి కొత్తగా ఇతర రాష్ర్టాల విద్యార్థులకు వారి మాతృభాషలోనే బోధించే విధానం తీసుకొచ్చాం. స్థానికంగా ఆయా భాషలు తెలిసిన వారిని వలంటీర్లుగా నియమించి వారి ద్వారా బయటి రాష్ర్టాల పిల్లలకు విద్యను అందిస్తున్నాం. పదేళ్ల వయసు దాటిన పిల్లలు కూడా కూలి పనులకు వెళ్లకుండా తరగతులకు హాజరవుతున్నారు. అలాగే రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లే కుటుంబాల పిల్లలు అంతరాయం లేకుండా చదువుకునే అవకాశం కల్పించాం.’’
- బి. శ్రీనివాసరావు, సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్