Share News

‘యూరియా’ వెతలు!

ABN , Publish Date - Jun 25 , 2025 | 01:33 AM

ఖరీఫ్‌లో పంటల సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలను యూరియా కొరత కలవరపెడుతోంది. ఆరంభం నుంచి పంట చేతికి వచ్చే వరకు వివిధ దశల్లో యూరియాను వాడుతూనే ఉంటారు. అయితే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం 14,811 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు పేర్కొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో స్టాకు జాడ తెలియడంలేదు. దీంతో కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు యూరియా కావాలంటే మిశ్రమ ఎరువులను కొనాల్సిందేనని హోల్‌సేల్‌ వ్యాపారుల ఆంక్షలు పెట్టడంతో రిటైల్‌ వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా జరగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

‘యూరియా’ వెతలు!

- ఖరీఫ్‌ వేళ వేధిస్తున్న కొరత

- 14 వేల మెట్రిక్‌ టన్నులు ఉన్నట్టు అధికారుల వెల్లడి

- క్షేత్రస్థాయిలో కనిపించని స్టాకు

- కృత్రిమ కొరత సృష్టిస్తున్న కంపెనీలు

- యూరియా కావాలంటే మిశ్రమ ఎరువులను కొనాల్సిందేనని హోల్‌సేల్‌ వ్యాపారుల ఆంక్షలు

- వెనకడుగు వేస్తున్న రిటైల్‌ వ్యాపారులు

- ఆందోళనలో అన్నదాతలు

ఖరీఫ్‌లో పంటల సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలను యూరియా కొరత కలవరపెడుతోంది. ఆరంభం నుంచి పంట చేతికి వచ్చే వరకు వివిధ దశల్లో యూరియాను వాడుతూనే ఉంటారు. అయితే జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం 14,811 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు పేర్కొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో స్టాకు జాడ తెలియడంలేదు. దీంతో కంపెనీలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు యూరియా కావాలంటే మిశ్రమ ఎరువులను కొనాల్సిందేనని హోల్‌సేల్‌ వ్యాపారుల ఆంక్షలు పెట్టడంతో రిటైల్‌ వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా జరగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి - గుడివాడ:

జిల్లావ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేసే వివిధ రకాల పంటలకు ప్రస్తుతం 10 లక్షల బస్తాల యూరియా అవసరం. రాబోయే రోజుల్లో వాడకం మరింత పెరిగే అవకాశం ఉంది. మొదటి దశలోనే ఎరువుల కొరత ఏర్పడటంతో రిటైల్‌ వ్యాపారులు, అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. యూరియా కావాలంటే కాంప్లెక్స్‌ ఎరువులు, నానో యూరియా, జింకు తదితర వాటిని తీసుకుంటేనే సరుకు ఇస్తామంటూ పంపిణీదారులు డీలర్‌లకు, ప్రైవేటు దుకాణదారులకు నిబంధన పెడుతున్నారు. దీంతో చాలా చోట్ల ప్రైవేటు దుకాణదారులు సరుకు తీసుకోకపోవడం కొరతకు కారణమవుతోంది. యూరియాకు లింకు తగిలించడంతో రిటైల్‌ వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. వివిధ కంపెనీలు తమ వద్ద మిగిలిన కాంప్లెక్స్‌ ఎరువుల స్టాకును అమ్ము కునేందుకు యూరియాతో లింకు పెట్టి అమ్మకాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో హోల్‌సేల్‌ వ్యాపారులు 20.20 కాంప్లెక్‌ ఎరువులు 10 టన్నులు కొనుగోలు చేస్తే 10 టన్నుల యూరియాను ఇస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో రిటైల్‌ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

ఆకాశన్నంటుతున్న యూరియా ధర

పంట చేతికి వచ్చే వరకు అన్నీ దశల్లో అన్నదాతలు యూరియాను వాడుతూనే ఉంటారు. తయారీ కంపెనీలు, హోల్‌సేల్‌ వ్యాపారుల షరతులతో జిల్లాలోని రిటైల్‌ దుకాణాల్లో యూరియా కొరత ఏర్పడింది. అవనిగడ్డ, నాగాయలంక, చల్లపల్లి, మొవ్వ, ఘంటసాల తదితర ప్రాంతాల్లో యూరియా వాడకం అధికంగా ఉంటుంది. కొరత కారణంగా యూరియా ధరను పెంచి రిటైల్‌ వ్యాపారులు అమ్మాల్సిన దుస్థితి ఏర్పడింది. బస్తా యూరియా ఎంఆర్‌పీ రూ.266.50 కాగా, రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు.

ఐదు వేల మెట్రిక్‌ టన్నులకు పడిపోయిన బఫర్‌ స్టాక్‌

అత్యవసర పరిస్థితుల్లో వాడకానికి రాష్ట్ర ప్రభుత్వం బఫర్‌ స్టాక్‌ను మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నిల్వ చేస్తుంది. 2014-19 కాలంలో బఫర్‌ స్టాకుగా 15,000 మెట్రిక్‌ టన్నుల యూరియాను ఉంచేది. అది క్రమేణా తగ్గుతూ వచ్చి 5,000 మెట్రిక్‌ టన్నులకు చేరింది. నేడు జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా 3,600 మెట్రిక్‌ టన్నుల యూరియాను నిల్వ చేసినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని పీఏసీఎస్‌ల్లో ఎరువుల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎరువుల లైసెన్సు రెన్యూవల్‌ కాకపోవడంతో చాలా సొసైటీల్లో అమ్మకాలు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతు సేవా కేంద్రాల్లో అవసరాలకు అనుగుణంగా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని అధికార యంత్రాంగం ఆలోచన చేస్తోంది.

అంతా కంపెనీల మాయ.

యూరియా కృత్తిమ కొరతను సృష్టించి తమ వద్ద మిగిలి ఉన్న కాంప్లెక్స్‌ ఎరువులను అమ్ముకునేందుకు వివిధ కంపెనీలు ఈ విధంగా చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పలు కంపెనీలు గత ఏడాది నిల్వ ఉండి పోయిన 20.20 కాంప్లెక్స్‌ ఎరువులు 10 టన్నుల కొంటే 10 టన్నుల యూరియా ఇస్తామనే షరతుతో వ్యాపారం చేస్తున్నాయని సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లో డీలర్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు కంపెనీల షరతులకు తలొగ్గి లింకుతో యూరియా అమ్మకాలను చేపడుతున్నారు.

అందుబాటులో 14,811 మెట్రిక్‌ టన్నుల యూరియా

జిల్లా 14,811 మెట్రిక్‌ టన్నుల (3.29 లక్షల బస్తాలు)యూరియా అందుబాటులో ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు లెక్కల్లో పేర్కొంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో అంత స్టాకు ఎక్కడుందనేది అధికారులకే తెలియడం లేదు. జిల్లా వ్యాప్తంగా గుడివాడ నుంచే ఎరువులు సరఫరా అవుతాయి. గుడివాడ మండలం శేరివేల్పూరు గోడౌన్‌లో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో నిల్వ చేసిన 3,600 మెట్రిక్‌ టన్నుల యూరియా మాత్రమే ఉంది. గుడివాడ పట్టణంలో సొసైటీ మిల్లు ఆవరణలోని గోడౌన్‌లు, మందపాడులోని గిడ్డంగుల సంస్థకు చెందిన గోడౌన్‌లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఉన్న యూరియా పోను లెక్కల్లో చెబుతున్న 11,211 మెట్రిక్‌ టన్నుల యూరియా ఎక్కడా ఉందో అధికారులే చూపాలి.

మార్క్‌ఫెడ్‌ ద్వారా రిటైల్‌ వ్యాపారులకు యూరియాను సరఫరా చేయాలని రిటైల్‌ వ్యాపారులు కోరుతున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువులు కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 01:33 AM