బాలిక మృతదేహం కోసం గాలింపు!
ABN , Publish Date - Sep 12 , 2025 | 01:25 AM
కుమార్తె మృతదేహాన్ని గంజాయి వ్యాపారి ఎలా మాయం చేశాడు? నిజంగా అటవీ ప్రాంతంలో పడేశాడా? లేక ఏదైనా పారే నదిలో వేశాడా? మైలవరంలో మిస్టరీగా మారిన బాలిక హత్య కేసులో ఉదయిస్తున్న ప్రశ్నలు ఇవి. మైలవరం సిద్ధిపేటకు చెందిన గంజాయి వ్యాపారి రెండో భార్య కుమార్తెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే.
రెండు చోట్ల పడేసినట్టు చెబుతున్న తండ్రి
ఎ.కొండూరు అటవీ ప్రాంతం, మధిర చెరువు వద్ద డ్రోన్లతో జల్లెడ
వరదల్లో కొట్టుకుపోయినట్టు భావిస్తున్న కాప్స్
హత్యలో మొదటి భార్య సహకారం!
(ఆంధ్రజ్యోతి - విజయవాడ):
కుమార్తె మృతదేహాన్ని గంజాయి వ్యాపారి ఎలా మాయం చేశాడు? నిజంగా అటవీ ప్రాంతంలో పడేశాడా? లేక ఏదైనా పారే నదిలో వేశాడా? మైలవరంలో మిస్టరీగా మారిన బాలిక హత్య కేసులో ఉదయిస్తున్న ప్రశ్నలు ఇవి. మైలవరం సిద్ధిపేటకు చెందిన గంజాయి వ్యాపారి రెండో భార్య కుమార్తెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మృతదేహం కనిపించకపోవడంతో పోలీసులు తలలు పట్టు కుంటున్నారు. బాలిక తండ్రిని విచారిస్తున్న పోలీసులకు అతడు గంటకో సమాధానం చెబుతున్నట్టు తెలిసింది. పోలీసులు విచారిస్తున్నప్పుడు కొద్దిసేపు ఎ.కొండూరు అటవీ ప్రాంతంలో పడేశానని చెబుతున్నాడు. తర్వాత కాసేపటికి ఖమ్మం జిల్లాలోని మధిరలో ఉన్న చెరువులో పడేసినట్టు చెబుతున్నాడు. ఇలా వేర్వేరు సమాధానాలు చెప్పి పోలీసులకు స్పష్టత ఇవ్వడం లేదు. గడిచిన నెలలో కురిసిన వర్షాలకు ఈ చెరువు నిండి వాగుల ద్వారా నీరు కృష్ణా నదిలోకి ప్రవహించింది. ఈ నీటి ప్రవాహంలో బాలిక మృతదేహం కొట్టుకుని వెళ్లిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. కుమార్తెను చంపినప్పుడు అతడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. ఆ మైకంలో మృతదేహాన్ని ఎక్కడ పడేశాడో చెప్పలేకపోతున్నాడని తెలుస్తోంది. పోలీసులకు ఈ విషయంలో నిందితుడు ఎలాంటి సమాచారం చెప్పడం లేదు.
డ్రోన్లతో గాలింపు
కుమార్తెను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని రెండు ప్రాంతాల్లో పడేసినట్టు నిందితుడు చెబుతున్నాడు. ఎ.కొండూరు అటవీ ప్రాంతం, మధిర చెరువు వద్ద పోలీసులు డ్రోన్లతో గాలింపు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తునకు అధికారులు ప్రత్యేక బృందాన్ని నియమించారు. అటవీ ప్రాంతంలోకి రెండు డ్రోన్లను, మధిర చెరువు వద్దకు రెండు డ్రోన్లను పోలీసులు పంపారు. అక్కడ గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు డ్రోన్లను ఎగురవేసినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. ఈ కేసులో మృతదేహం కీలకంగా మారింది. నిందితుడు ఒక్కడే బాలికను హత్య చేయలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో మొదటి భార్యతోపాటు ఆమె కుమార్తెల పాత్ర ఉన్నట్టు భావిస్తున్నారు. పక్కింటి వ్యక్తి ఆటోను చండ్రగూడెంలోని మావయ్య ఇంటికి వెళ్లి భోజనం తెచ్చుకుంటానని చెప్పి తీసుకున్నట్టు తెలిసింది. పోలీసులు ఆటోడ్రైవర్‌ను పిలిపించి విచారించారు. అతడూ ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలిసింది. గడిచిన నెల 31వ తేదీ రాత్రి ఆటోను తీసుకున్న నిందితుడు ఒకటో తేదీ ఉదయం తీసుకొచ్చి ఇచ్చాడు. కుమార్తె మృతదేహాన్ని గోనె సంచిలో చుట్టేసి ఆటోలో తీసుకెళ్లి పారేశాడు. ఆ రోజు రాత్రంతా ఆటోను శుభ్రంగా కడిగేసి ఎలాంటి రక్తపు వాసన రాకుండా స్ర్పే చేసినట్టు సమాచారం. మృతదేహం విషయంలో ఒక స్పష్టత వచ్చిన తర్వాత రెండు, మూడు రోజుల్లో పోలీసులు అధికారికంగా ఈ వివరాలను వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.