Share News

Health Alert: అమ్మో... స్క్రబ్‌ టైఫస్‌

ABN , Publish Date - Dec 04 , 2025 | 04:25 AM

రాష్ట్రంలో ‘స్క్రబ్‌ టైఫస్‌’ జ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 736 కేసులు నమోదయ్యాయి.

Health Alert: అమ్మో... స్క్రబ్‌ టైఫస్‌

  • బ్యాక్టీరియా వ్యాప్తి తీవ్రం

  • రాష్ట్రంలో 736 కేసులు

  • అనధికారికంగా మరిన్ని..

  • విజయనగరం, పల్నాడు

  • జిల్లాల్లో ముగ్గురు మృతి

  • జ్వరం, నల్లమచ్చలు

  • ఉంటే జాగ్రత్త.. ప్రాణాంతకం

  • కాదంటున్న నిపుణులు

  • (అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ‘స్క్రబ్‌ టైఫస్‌’ జ్వరాలు కలకలం సృష్టిస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 736 కేసులు నమోదయ్యాయి. కానీ అనధికారికంగా వీటి సంఖ్య వేలల్లో ఉండొచ్చని తెలుస్తోంది. బ్యాక్టీరియా సోకిన చిగ్గర్‌ మైట్‌ అనే నల్లిని పోలిన చిన్న కీటకం కుట్టడం ద్వారా వ్యాపించే ఈ ఇన్ఫెక్షన్‌ జ్వరాలకు ప్రధానకారణమవుతోంది. వర్షాలు కురిసే సమయంలో దీని తీవ్రత అధికంగా ఉంటోంది. రాష్ట్రంలో గత రెండు, మూడేళ్ల నుంచి ఈ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదవుతున్నా తొలిసారిగా ఈ ఏడాది మూడు మరణాలు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాకు చెందిన ఓ మహిళతో పాటు పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు వ్యాధి లక్షణాలతో మృతిచెందారు. కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం, ఆరోగ్య శాఖ చెబుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో 2023లో 579 కేసులు నమోదు కాగా, 2024లో 803 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది నవంబరు 30 వరకూ 736 కేసులను ఆరోగ్యశాఖ గుర్తించింది. ఇప్పటి వరకూ కాకినాడ, చిత్తూరు, విశాఖ, కడప, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, విజయనగరం, గుంటూరు, తిరుపతి, శ్రీకాకుళం, అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.


నల్ల మచ్చలతో గుర్తింపు

కీలకం కుట్టిన చోట నల్లటి మచ్చ లేదా దద్దుర్లు ఉంటే జ్వరం, తలనొప్పితో పాటు కండరాల నొప్పులు ఉంటే స్క్రబ్‌ టైఫ్‌సగా అనుమానించాలి. ఈ పురుగు కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా ఓరియాంటియా సుట్సుగముషి అనే బ్యాక్టీరియా మనిషి రక్తంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కనే నివసించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులను మనుషులను కుడుతుంటాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే ఊపిరితిత్తులు, వెన్నెముక, కిడ్నీలు, మెదడు, కాలేయం, ఇతర అవయవాలపై ప్రభావం చూపిస్తుంది. క్రమంగా రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. పీహెచ్‌సీలు, ఇతర ఆస్పత్రుల వైద్యుల సిఫారసులతో వచ్చిన రోగుల నుంచి సేకరించిన రక్త నమూనాలను బోధనాస్పత్రులు, జిల్లా పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీల్లో పరీక్షిస్తున్నారు.


ఈ ఆరు నెలలు అప్రమత్తం

స్క్రబ్‌ టైఫస్‌ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే స్క్రబ్‌ టైఫస్‌ జ్వరాల వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ఇది కూడా సాధారణ జ్వరం లాంటిదేనని, జ్వరం బారినపడిన మూడు రోజుల వరకు తగ్గకపోతే రక్తపరీక్షల ద్వారా ఈ వ్యాధి బయటపడుతుంది. శరీరంపై చిన్న నల్లమచ్చ కనిపించిన తర్వాత జ్వరం వస్తే స్క్రబ్‌ టైఫస్‌ అనుమానించాలి. కొన్ని కేసుల్లో నల్ల మచ్చ కనిపించకపోయినా, జ్వరం లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 1890లో జపాన్‌లో తొలిసారి ఈ జ్వరాలను గుర్తించారు. అప్పటి నుంచీ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కానీ మరణాలు మాత్రం పెద్దగా సంభవించలేదు. తాజాగా ముగ్గురు మృతిచెందడం ఆరోగ్యశాఖకు ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు ఈ వైరస్‌ బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. పాత మంచాలు, పరుపులు, దిండ్లు వారానికి ఒకసారి శుభ్రం చేసుకోవాలి. నివాసం ఉండే చోట పందులు, ఎలుకల సంచారం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. తడి నేలలు, పొలాలు, పశువుల పాకల్లో పనులు చేసేవారు అప్రమత్తంగా ఉండాలి. పొలం పనులకు వెళ్లేవారు రబ్బరుతో తయారుచేసిన బూట్లు ధరించాలి. పిల్లలకు కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేయాలి.


పల్నాడులో స్క్రబ్‌ టైఫస్‌ కలకలం

నరసరావుపేట, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో రెండు స్క్రబ్‌ టైఫస్‌ మరణాలు నమోదయ్యాయి. మృతుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షించగా స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ రవి బుధవారం తెలిపారు. ముప్పాళ్ల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన జ్యోతి(20), రాజుపాలెం ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన నాగమ్మ(62)లను పొలం పనులు చేస్తుండగా ఏదో పురుగు కుట్టిందని, ఆ తర్వాత జ్వరం, ఒంటి నొప్పులతో గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మృతి చెందారని వైద్యశాఖ అధికారులు వివరించారు. ఇదే వ్యాధి లక్షణాలతో రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన సాలమ్మ అనే మహిళ చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో రాజుపాలెం మండలం కొత్తూరు, రాజుపాలెం, రుద్రవరంలో ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది బుధవారం సర్వే నిర్వహించారు. జ్వరంతో ఉన్నవారి నుంచి రక్త నమూనాలు సేరించి పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వాస్పత్రి ల్యాబ్‌కు పంపారు. కాగా, స్క్రబ్‌ టైఫస్‌ ప్రాణాంతకం కాదని డాక్టర్‌ రవి తెలిపారు. డాక్సీసైక్లిన్‌ టాబ్లెట్‌ వేసుకుంటే తగ్గుతుందన్నారు. అనుమానిత లక్షణాలున్న వారి రక్త నమూనాలకు గుంటూరు ప్రభుత్వాస్పత్రి ల్యాబ్‌లో నిర్ధారణ పరీక్షలు చేస్తామన్నారు. పాజిటివ్‌గా గుర్తిస్తే చికిత్స అందిస్తారని తెలిపారు. పొలంలో పనిచేసే సమయంలో పురుగులు కుట్టినట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Updated Date - Dec 04 , 2025 | 04:26 AM