Share News

Krishna District: స్క్రబ్‌ టైఫ్‌స్‌తో మరొకరి మృతి

ABN , Publish Date - Dec 07 , 2025 | 05:31 AM

రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం ముదునూరుకు చెందిన బుట్టి శివశంకర్‌ రాజు(42)...

Krishna District: స్క్రబ్‌ టైఫ్‌స్‌తో మరొకరి మృతి

  • కిడ్నీ వ్యాధివల్లే అంటున్న వైద్యాధికారులు

  • ఉమ్మడి కృష్ణాలో 16 మందికి పాజిటివ్‌

  • ఏలూరులో మరొకరికి వ్యాధి నిర్ధారణ

విజయవాడ,/ఏలూరు అర్బన్‌, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ మరణాలు కలకలం సృష్టిస్తున్నాయి. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం ముదునూరుకు చెందిన బుట్టి శివశంకర్‌ రాజు(42) ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. వారం క్రితం తీవ్ర జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న ఆయన మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలు ఉన్నాయని వైద్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో శివశంకర్‌ రాజుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫాం(ఐహెచ్‌ఐపీ) పోర్టల్‌లో ఆయన పేరు నమోదు చేసి వైద్యాధికారులకు సమాచారం అందించారు. రాజు చికిత్స పొందుతూ శుక్రవారం వేకువజామున మృతిచెందారు. కృష్ణాజిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్‌ యుగంధర్‌ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను విచారించారు. రాజుకు కిడ్నీ సమస్య ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోగ్య రిపోర్టులు పరిశీలించిన తర్వాత రాజు కిడ్నీ వాధితోనే మృతి చెందారని వైద్యాధికారి నిర్ధారించారు. అయితే స్క్రబ్‌ టైఫస్‌ మరణాన్ని దాచేందుకే ఇలా చెబుతున్నారని విమర్శలు వస్తున్నాయి. కాగా, కృష్ణాజిల్లాలో 15, ఎన్టీఆర్‌ జిల్లాలో ఒకటి చొప్పున స్క్రబ్‌ టైఫస్‌ కేసులు నమోదయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా జీ.కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో ఓ బాలుడికి లక్షణాలు వెలుగుచూడగా పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన ఓ వ్యక్తి(35) తాపీపనుల నిమిత్తం రోజూ ఏలూరు రాకపోకలు సాగిస్తుంటాడు. తీవ్ర జ్వరంతో గతనెల 29న నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందిస్తున్నప్పటికీ జ్వరం అదుపులోకి రాకపోవడంతో శుక్రవారం రాత్రి ఎలీసా టెస్టు నిర్వహించగా స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయన్ను శనివారం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో ఈ జిల్లాలో బాధితుల సంఖ్య మూడుకు పెరిగింది.

Updated Date - Dec 07 , 2025 | 05:32 AM