Jishnu Dev Varma: వికసిత భారత్ కోసం శాస్త్రవేత్తలు కృషి
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:33 AM
వికసిత భారత్ కోసం శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు కృషి చేస్తున్నారని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు.
నాయుడమ్మ అవార్డు ప్రదానోత్సవంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
తెనాలి అర్బన్, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): వికసిత భారత్ కోసం శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు కృషి చేస్తున్నారని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. బుధవారం దివంగత శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం ప్రదానోత్సవం గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మద్దిరాల నాగరాజుకు ఈ అవార్డును జిష్ణుదేవ్‌వర్మ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ మాట్లాడుతూ.. శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణుల లక్ష్యం సమాజం బాగుండాలన్నదేనని అన్నారు. తెనాలి రామకృష్ణ కవి ప్రాంతానికి తాను రావడం ఆనందంగా ఉందన్నారు. తాను త్రిపుర ఉపముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ఐఏఎస్ అధికారి నాగరాజు సహకారం అందించారని చెప్పారు. పురస్కార గ్రహీత, ఐఏఎస్ అధికారి నాగరాజు మాట్లాడుతూ.. నాయుడమ్మ ప్రపంచస్థాయి శాస్త్రవేత్త అని కొనియాడారు. ఆయన పేరిట పురస్కారాన్ని అందుకున్న తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త స్వర్ణ వి కాంత్, నాయుడమ్మ అవార్డు ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాఽథబాబు, వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ప్రసంగించారు.
ఏపీ గవర్నర్‌ను కలిసిన తెలంగాణ గవర్నర్
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిశా రు. బుధవారం ఉదయం రాజ్‌భవన్‌కు వచ్చిన జిష్ణుదేవ్ వర్మను అబ్దుల్ నజీర్ సాదరంగా ఆహ్వానించారు. ఇద్దరు గవర్నర్లు కాసేపు ముచ్చటించుకున్నారు. తెలంగాణ గవర్నర్‌ను ఏపీ గవర్నర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అలాగే తెలంగాణ గవర్నర్ కూడా ఏపీ గవర్నర్‌ను సత్కరించి జ్ఞాపిక అందించారు.