పాఠశాల స్థలం కబ్జా!
ABN , Publish Date - Jul 30 , 2025 | 01:29 AM
గత వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వంలోనూ రెచ్చిపోతున్నారు. మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామంలోని సీబీసీఎన్‌సీ(ఉత్తర సర్కార్ బాప్టిస్ట్ చర్చిల సంఘం) పాఠశాల స్థలంపై కన్నేశారు. భూ రికార్డుల్లో పేరు మార్చి గత నెల 8న భవనాలను కూల్చేశారు. గ్రామస్థులు తిరగబడతారని తెలిసి ఇక్కడ కమ్యూనిటీహాలు నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్థానికులు, సీబీసీఎన్‌సీ పాఠశాల ప్రతినిధులు గత సోమవారం కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఆక్రమణలను అడ్డుకోవాలని వేడుకున్నారు.
- విలువైన స్థలంపై కన్నేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు
- వందేళ్ల చరిత్ర కలిగిన పాఠశాల వైసీపీ ప్రభుత్వంలో మూత
- భట్లపెనమర్రులో సీబీసీఎన్‌సీకి 29 సెంట్ల స్థలం
- భూ రికార్డుల్లో వైసీపీ నేత స్థలంగా పేరు మార్పు
- గత నెల 8న పాఠశాల భవనాలు కూల్చివేత
- కమ్యూనిటీ హాలు నిర్మిస్తున్నామని ప్రచారం
- కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సీబీసీఎన్‌సీ పాఠశాల ప్రతినిధులు, గ్రామస్థులు
గత వైసీపీ ప్రభుత్వంలో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వంలోనూ రెచ్చిపోతున్నారు. మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామంలోని సీబీసీఎన్‌సీ(ఉత్తర సర్కార్ బాప్టిస్ట్ చర్చిల సంఘం) పాఠశాల స్థలంపై కన్నేశారు. భూ రికార్డుల్లో పేరు మార్చి గత నెల 8న భవనాలను కూల్చేశారు. గ్రామస్థులు తిరగబడతారని తెలిసి ఇక్కడ కమ్యూనిటీహాలు నిర్మిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్థానికులు, సీబీసీఎన్‌సీ పాఠశాల ప్రతినిధులు గత సోమవారం కలెక్టర్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఆక్రమణలను అడ్డుకోవాలని వేడుకున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
భట్లపెనుమర్రు గ్రామంలో సర్వే నెంబరు 196/1లో ఆరు సెంట్ల స్థలంలో వంద సంవత్సరాల క్రితం సీబీసీఎన్‌సీ (ఉత్తర సర్కార్ బాప్టిస్ట్ చర్చిల సంఘం) పాఠశాలను నిర్మించారు. స్థానికంగా చిన్నారులకు పాఠశాల ఉపయోగపడుతుండటంతో సమీపంలో సర్వే నెంబరు 200/1లో 23 సెంట్ల స్థలాన్ని స్థానిక పెద్ద చలసాని వెంకటరత్నం 1942లో పాఠశాలకు దానంగా ఇచ్చారు. ఈ స్థలంలో చలసాని సీతారామయ్య 1948లో పాఠశాల భవనం సొంత ఖర్చులతో నిర్మించారు. గతంలోని పాఠశాల భవనాన్ని టీచర్లు నివాసం ఉండేందుకు ఉపయోగించుకునేలా, కొత్త భవనాన్ని పాఠశాలగా వినియోగించుకునేలా అప్పటి పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. 2022 వరకు ఈ పాఠశాల నడిచింది.
రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్చేసి..
గత వైసీపీ ప్రభుత్వం 2022లో ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసింది. అన్ని ఎయిడెడ్ పాఠశాలలతో పాటే భట్లపెనుమర్రులోని సీబీసీఎన్‌సీ పాఠశాల కూడా మూతపడింది. ఇదే అదనుగా భావించిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే అనుచరుడిగా ఉన్న వ్యక్తి పేరున పాఠశాల స్థలాన్ని రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేశారు. ఈ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా జరిగింది. పాఠశాల స్థలం ఖాళీగా ఉండటంతో వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి, మండల స్థాయి ప్రజా ప్రతినిధి ఈ స్థలంపై కన్నేసి ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అనుకున్నదే తడవుగా గత నెల 8వ తేదీన పాఠశాల భవనాన్ని యంత్రాల ద్వారా కూల్చడం ప్రారంభించారు. దీంతో సీబీసీఎన్‌సీ ప్రతినిధులు, గ్రామస్థులు కూచిపూడి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేలోగానే భవనాన్ని కూలగొట్టేశారు. ఈ అంశం వివాదంగా మారడంతో పాఠశాల స్థలం ఎవరిపేరున ఉందనే విషయంపై సీబీసీఎన్‌సీ ప్రతినిధులు, గ్రామస్థులు ఆరా తీస్తే పాఠశాల స్థలం గత ఎమ్మెల్యే అనుచరుడి పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉన్నట్లు చూసి ఖంగుతిన్నారు. పాఠశాలకు చెందిన స్థలాన్ని వేరే వ్యక్తి పేరున ఎలా మార్పుచేస్తారని గ్రామస్థులు అధికారులను ప్రశ్నించినా పట్టించుకోలేదు. దీంతో పాఠశాల స్థలం ఆక్రమణ విషయంపై పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలను పిలిచిన అధికారులు వివాదంలో ఉన్న స్థలంలోకి ఎవ్వరూ వెళ్లవద్దని సర్థిచెప్పారు. అయితే ఈ స్థలం వివాదంలో పూర్తిస్థాయి విచారణ చేయకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు పాఠశాల స్థలాన్ని ఆక్రమించేవారికి అనుకూలంగా వ్యవహరించారని సీబీసీఎన్‌సీ ప్రతినిధులు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
27న పంచాయతీ తీర్మానం
పాఠశాల స్థలంపై కన్నేసిన స్థానిక ప్రజాప్రతినిధులు ఈ నెల 27వ తేదీన పంచాయతీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పాఠశాలకు చెందిన స్థలంలో కమ్యూనిటీహాలు నిర్మాణం చేయాలనే ప్రతిపాదనను అజెండాలో చేర్చారు. ఈ అంశంపై పంచాయతీ ఉపపర్పంచ్‌తోపాటు కొందరు పాలకవర్గ సభ్యులు గ్రామంలో ఇప్పటికే కమ్యూనిటీహాలు విశాలమైన స్థలంలో ఉందని, మళ్లీ కొత్తగా కమ్యూనిటీహాలు నిర్మాణం కోసం పాఠశాల స్థలాన్ని కావాలని ఎందుకు కోరుతున్నారని, నిధులు అందుబాటులో ఉన్నాయా అని ప్రశ్నించారు. సర్పంచ్, ఎంపీపీ సూచనలతోనే ఈ ప్రతిపాదన పెట్టామని పంచాయతీ సెక్రటరీ చెప్పడం గమనార్హం. మెజార్టీ సభ్యుల ఆమోదం లేకుండానే పాఠశాల స్థలంలో కమ్యూనిటీహాలు నిర్మాణం చేయాలని కుట్రపూరితంగా తీర్మానం చేశారని గ్రామస్థులు, సీబీసీఎన్‌సీ కమిటీ సభ్యులు కలెక్టర్‌కు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. ఆక్రమణదారులకు మండలస్థాయి అధికారులు సహకరిస్తున్నారని, ఈ అంశంపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.