కష్టపడితే ఉపకార వేతనం
ABN , Publish Date - Nov 12 , 2025 | 12:29 AM
చదువులో ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితులు బాగోలేక కొందరు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు.
ప్రతిభ చాటితే 4 ఏళ్ల పాటు అందజేత
చాగలమర్రి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): చదువులో ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితులు బాగోలేక కొందరు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఇలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తోంది. ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధిస్తే 4 ఏళ్ల పాటు ఎనఎంఎంఎస్ (నేషనల్ మీన్స మెరిట్ స్కాలర్‌షిప్) బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఈ ఆర్థిక ప్రయోజనం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నంద్యాల జిల్లాలో గత ఏడాది 4,800 మంది దరఖాస్తు చేసుకోగా ఈ ఏడాది 3,932 మంది దరఖాస్తు చేసుకున్నారు. నెల రోజులు కష్టపడితే 4 ఏళ్ల పాటు స్కాలర్‌షిప్ అందుతుంది. ఆయా పాఠశాలల్లో 8వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించి ఎనఎంఎంఎస్ సాధించేందుకు తీర్చిదిద్దుతున్నారు.
ఫ డిసెంబరు 7న పరీక్ష
ప్రభుత్వం ప్రతి ఏడాది నేషనల్ మీన్స కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎనఎంఎంఎస్) పరీక్ష నిర్వహిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులు. డిసెంబరు 7న పరీక్ష నిర్వహిస్తారు. ఇంకా నెల రోజులు సమయం ఉంది. గత పరీక్షలో విజయం సాధించిన వారి అనుభవాలను పరిగణలోకి తీసుకొని కొద్దిగా కష్టపడి చదివి ప్రతిభ చూపితే 4 ఏళ్ల పాటు ఉపకార వేతనం అందుతుంది.
ఫ ఏడాదికి రూ.12 వేలు
పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు నెలకు రూ.1,000 చొప్పున ఏడాదికి రూ.12 వేలు అందజేస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆర్థిక సాయం కొనసాగుతుంది.
ఫ బహుళైచ్ఛిక ప్రశ్నల విధానంలో
బహుళైచ్ఛిక ప్రశ్నల విధానంలో 180 ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ ఎబిలిటి(మ్యాట్), స్కాలాస్టిక్ ఎబిలిటి(శాట్), 7, 8 తరగతుల సైన్స, గణితం, సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రొత్సహిస్తూ పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది.
ఎనఎంఎంఎస్‌కు ఎంపికయ్యాను
- షేక్.మహ్మద్ మున్వర్‌బాష, 9వ తరగతి
చాగలమర్రి బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా. 8వ తరగతి చదువుతున్న సమయంలో పాఠశాలలో ఎనఎంఎంఎస్ శిక్షణ పొందడంతో పాటు ఉదయం, సాయంత్రం గణితంపై సాధన చేశా. సందేహాలను ఉపాధ్యాయులతో నివృత్తి చేసుకున్నా. ఎనఎంఎంఎస్‌కు ఎంపికయ్యాను. ఇప్పుడు ప్రతినెలా రూ.వెయ్యి స్కాలర్‌షిప్ అందుతోంది.
ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం
- శివలక్ష్మి, హెచఎం, బాలికోన్నత పాఠశాల, చాగలమర్రి
మా పాఠశాల నుంచి ఎనఎంఎంఎస్‌కు 27 మంది విద్యార్థులతో మొదటిసారి దరఖాస్తు చేయించాం. వీరికి ప్రతి రోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. నమూనా ప్రశ్నపత్రాలతో పరీక్షకు సిద్ధం చేస్తున్నాం. మంచి ఫలితాలే లక్ష్యంగా కృషి చేస్తున్నాం.
పేద విద్యార్థులకు చేయూత
-అనూరాధ, ఎంఈఓ, చాగలమర్రి
చిన్నపాటి శిక్షణతో ఉపకార వేతనాలకు ఎంపిక కావచ్చు. విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలి. పరీక్షల్లో ప్రతిభ చూపితే 4 ఏళ్ల పాటు ఆర్థిక చేయూత లభిస్తుంది.