Ministers Dola: ఎస్సీ,ఎస్టీ పెండింగ్ నిధులు ఇవ్వండి
ABN , Publish Date - Oct 07 , 2025 | 05:00 AM
రాష్ట్రానికి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
జ్యోతిబా స్కూళ్ల అభివృద్ధికి సహకరించండి
కేంద్ర మంత్రి అథవాలేకు మంత్రులు డోలా, సవిత విజ్ఞప్తి
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రావాల్సిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారతశాఖల సహాయ మంత్రి రాందాస్ అథవాలేను సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌లో మంత్రి డోలా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి, సంక్షేమ అంశాలపై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ నిధులు రూ.34 కోట్లు విడుదల చేయాలని, అంబేడ్కర్ విదేశీ విద్యా పథకానికి కేంద్రం 50 శాతం సబ్సిడీ నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలోని ఎస్సీ విద్యార్థులకు నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించామని మంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. నెల రోజుల్లో అట్రాసిటీ పెండింగ్ నిధులు విడుదల చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, అన్ని అంశాలకూ సానుకూలత తెలిపారని మంత్రి డోలా తెలిపారు. రాష్ట్రానికి అన్ని విధాలా సహకరిస్తున్న మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి డోలా కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత కూడా కేంద్ర మంత్రి అథవాలేను కలిసి రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిరావు స్కూళ్ల అభివృద్ధికి రూ.66 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఆమె విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.
భవిష్యత్తులోనూ ఎన్డీఏతోనే ఆర్పీఐ: రాందాస్
మంగళగిరి సిటీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) భవిష్యత్తులోనూ ఎన్డీఏతో కలిసి పనిచేస్తుందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. మంగళగిరి రాయల్ కన్వెన్షన్‌లో సోమవారం జరిగిన ఉచిత వినికిడి మిషన్ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అథవాలే మాట్లాడుతూ ఏపీలో ఆర్పీఐ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కూటమి విధానాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని, రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకం ద్వారా 18 రకాల వృత్తుల వారికి ఆర్థిక, సామాజిక భద్రత ఏర్పడుతుందన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో కూటమి ఐక్యత కారణంగా రాష్ట్రంలో అవినీతిపరుడైన జగన్‌ను ఓడించగలిగామని, ఇదే ఐక్యతను కొనసాగించి 2029 ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేద్దామని ఆకాంక్షించారు.