Share News

Education Incentives: ఎస్సీ గురుకుల విద్యార్థులకు నజరానా

ABN , Publish Date - Jul 09 , 2025 | 05:36 AM

ఐఐటీ, నీట్‌లో అర్హత సాధించి మెడిసిన్‌, ఇంజనీరింగ్‌లో సీట్లు సాధించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల విద్యార్థులకు రూ.లక్ష ప్రోత్సాహక నగదు బహుమతి అందిస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ బోర్డు నిర్ణయించింది.

 Education Incentives: ఎస్సీ గురుకుల విద్యార్థులకు నజరానా

  • ఐఐటీ, నీట్‌లో అర్హత సాధిస్తే రూ.లక్ష బహుమతి

  • గురుకుల సొసైటీ బోర్డు నిర్ణయం

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఐఐటీ, నీట్‌లో అర్హత సాధించి మెడిసిన్‌, ఇంజనీరింగ్‌లో సీట్లు సాధించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల విద్యార్థులకు రూ.లక్ష ప్రోత్సాహక నగదు బహుమతి అందిస్తామని ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ బోర్డు నిర్ణయించింది. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి అధ్యక్షతన మంగళవారం తాడేపల్లిలోని గురుకుల సొసైటీ కార్యాలయంలో 75వ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌ ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఐఐటీ, నీట్‌లో అర్హత సాధించి మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ సీట్లు పొందిన విద్యార్థులకు రూ.ఒక లక్ష ప్రోత్సాహం అందించడంతో పాటు అతి తక్కువ మార్కుల తేడాతో అర్హత సాధించలేకపోయిన 120 మంది విద్యార్థులకు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని 10 ఐఐటీ, నీట్‌ ఎక్సలెన్సీ సెంటర్లలో డిప్యుటేషన్‌పై గురుకులాల్లోని ఉత్తమ ఉపాధ్యాయుల నియామకం, గురుకులాలు, ఎస్సీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు 11 రకాల వస్తువులతో కాస్మెటిక్‌ కిట్స్‌ అందజేయనున్నారు. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో అనారోగ్యంతో మృతి చెందిన పల్నాడు జిల్లా వినుకొండ గురుకులం ఆరో తరగతి విద్యార్థిని సంకీర్తన భాయ్‌ తల్లిదండ్రులకు సాంత్వన పథకం కింద ఆర్థిక సాయంగా రూ.3 లక్షల చెక్కును మంత్రి డోలా అందించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయక్‌, గురుకుల సొసైటీ సెక్రటరీ ప్రసన్న వెంకటేష్‌, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ లావణ్యవేణి పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 05:38 AM