Centenary Celebration: సత్యసాయి ప్రేమతత్వం విశ్వవ్యాప్తం
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:53 AM
సత్యసాయి ప్రేమతత్వం విశ్వవ్యాప ్తమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కొనియాడారు. సత్యసాయి దివ్య సన్నిధానం ప్రతిచోటా వెలిగిపోతోందన్నారు.
కొనియాడిన మహారాష్ట్ర సీఎం, ఒడిశా గవర్నర్
ముగిసిన సేవాదళ్ అంతర్జాతీయ సదస్సు
పుట్టపర్తి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): సత్యసాయి ప్రేమతత్వం విశ్వవ్యాప ్తమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కొనియాడారు. సత్యసాయి దివ్య సన్నిధానం ప్రతిచోటా వెలిగిపోతోందన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి శతజయంతి వేడుకల్లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ప్రశాంతి నిలయంలోని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీసత్యసాయి అంతర్జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సత్యసాయి బోధించిన ‘అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు’ అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆచరిస్తున్నారని అన్నారు. ప్రశాంతి నిలయం నుంచి సత్యసాయి ప్రేమతత్వాన్ని తాను వెంట తీసుకువెళుతున్నానని అన్నారు. సత్యసాయి మానవతా దీప్తి అని, నిస్వార్థ సేవలకు ప్రతిరూపమని ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు కొనియాడారు. సత్యసాయి మానవ రూపంలో ఉన్న ప్రేమ, సేవ, ఆధ్యాత్మిక దైవమని రాజ్యసభ సభ్యుడు అశోక్‌చవాన్ కొనియాడారు. కాగా, సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు వచ్చి భక్తులతో ప్రశాంతి నిలయం కోలాహలంగా మారింది. సాయికుల్వంతు మందిరం భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అంతర్జాతీయ సదస్సుకు వివిధ దేశాల నుంచి 2500 మంది సేవాదళ్ ప్రతినిధులు హాజరయ్యారు. వేడుకలకు హాజరైన భక్తులకు ట్రస్టు ఆధ్వర్యంలో నారాయణసేవను అందించారు.

నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి
పుట్టపర్తి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ శనివారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి రానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య మంత్రి చంద్రబాబు పుట్టపర్తి ఎయిర్ పోర్టుకు చేరుకుని వారికి స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతి ఉదయం 11గంటలకు ప్రశాంతి నిలయంలో జరిగే సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొని, 12.20 గంటలకు తిరుగు పయనమవుతారు. ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ మధ్యాహ్నం 3.40 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రి రాత్రికి ఇక్కడే బసచేసి, ఆదివారం జరిగే సత్యసాయి శత జయంతి వేడుకల్లో పాల్గొంటారు.
శ్రీసత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి, సీఎం
శ్రీసత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం శనివారం జరగనుంది. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంతు మందిరంలో చాన్సలర్ చక్రవర్తి అధ్యక్షతన జరిగే ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. స్నాతకోత్సవంలో 546 మంది విద్యార్థులకు పట్టాలు, 18 మందికి పీహెచ్‌డీలు, 20 మందికి బంగారు పతకాలను అందిస్తారు.
మహనీయుడు సత్యసాయి: మంత్రి దుర్గేశ్
సామాజిక సేవకు, మానవ సంక్షేమానికి ఆధ్యాత్మికతను సాధనంగా మలిచిన మహనీయుడు సత్యసాయి అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కొనియాడారు. ప్రశాంతి నిలయంలో సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులతో కలిసి వంద కిలోల సత్యసాయి బాబా పుట్టిన రోజు కేకును మంత్రి శుక్రవారం కట్ చేశారు. సత్యసాయి ఆశీస్సులు అందరిపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్, సభ్యులు నాగానందం, చక్రవర్తి పాల్గొన్నారు.